Share News

మేధాసాహసి రాజాజీ

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:07 AM

వలసపాలన నుంచి దశాబ్దాల క్రితమే స్వాతంత్ర్యాన్ని పొందిన మనం వలసవాద ఆలోచనా రీతుల నుంచి కూడా పూర్తిగా విముక్తమవ్వాలనే ఆరాటం ప్రబలమవుతున్న ప్రస్తుత తరుణంలో ...

మేధాసాహసి రాజాజీ

వలసపాలన నుంచి దశాబ్దాల క్రితమే స్వాతంత్ర్యాన్ని పొందిన మనం వలసవాద ఆలోచనా రీతుల నుంచి కూడా పూర్తిగా విముక్తమవ్వాలనే ఆరాటం ప్రబలమవుతున్న ప్రస్తుత తరుణంలో మొన్న సోమవారం నాడు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఆ సౌధ వాస్తుశిల్పి ఎడ్వర్డ్‌ లుట్యెన్స్‌ ప్రతిమను తొలగించి ఆ స్థానంలో రాజాజీగా జగద్విఖ్యాతుడైన చక్రవర్తుల రాజగోపాలాచారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. తన 94 ఏళ్ల జీవన ప్రస్థానంలో మహా మేధావి, విద్యాధికుడు, న్యాయవాది, దేశ భక్తుడు, సంఘ సంస్కర్త, రాజనీతివేత్త, పరిపాలనాదక్షుడు, మానవతావాది, ప్రపంచ శాంతికాముకుడుగా రాజాజీ ప్రభాసించారు.

నియంత్రణలు అతి తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంతో తాను నెలకొల్పిన స్వతంత్ర పార్టీ విధానాలే భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు అవుతాయని 1971లో ఇందిరాగాంధీ ప్రభంజనంలో ఘోర పరాజయం సంభవించిన కొద్ది రోజులకే ప్రకటించిన ధీర రాజనీతిజ్ఞుడు రాజాజీ. ఆయన మాట సత్యవాక్కు అయింది. 1990 దశకం తొలినాళ్లలో ఆరంభమయిన ఆర్థిక సంస్కరణలకు పితామహుడుగా ఆయన్ని గౌరవించడం సద్వివేకమవుతుంది. సోషలిస్టు తరహా సమాజాన్ని నిర్మిస్తామని 1950ల్లో కాంగ్రెస్‌ నాయకులు చమ్కీ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు వారు తీసుకువచ్చేది పర్మిట్‌–లైసెన్స్‌–కోటా రాజ్‌ మినహా మరేమీ కాదని ఘాటుగా విమర్శించి ప్రత్యామ్నాయ రాజకీయపథాన్ని దేశ ప్రజలకు సూచించిన వివేకశీలి రాజాజీ. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ముస్లింల పాకిస్థాన్‌ ఆరాటాన్ని ఆమోదించడమే శ్రేయస్కరమని కాంగ్రెస్‌కు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన ఏకైక కాంగ్రెస్‌ వాది ఈ దక్షిణాత్య దార్శనికుడు.


ఇది చరిత్ర. భావి తరాలకూ, వారి సమస్యల సందర్భంలో వివేకశీలతను అలవరిచే చరిత్ర. ఈ సమాంతర చరిత్రను నేటి నవీన తరం విపులంగా తెలుసుకోవలిసిన అవసరమున్నది. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో రాజాజీ కాంస్య విగ్రహావిష్కరణ ఆ ఉదాత్తుని చరిత్రపై నేటి యువతరంలో జిజ్ఞాసను పురిగొల్పాలి. విశిష్ట గుణసంపన్నుడైన రాజాజీలో మనకు ప్రధానంగా ప్రస్పుటమయ్యేది మేధా ధైర్యం. తన భావాల సమంజసత్వంలో పరిపూర్ణ విశ్వాసంతో అవసరమైతే సహచరులనూ, సమాజాన్నీ ధిక్కరించేందుకు ఒక ఆలోచనాపరుడిని సాహసింపజేసేది మేధా ధైర్యం. పాకిస్థాన్‌ ఏర్పాటు అనివార్యమని గుర్తించి, ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు రాజాజీ వెనుకాడలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమ సంకల్పం అసంబద్ధమని ఎలుగెత్తి, గాంధీజీతో విభేదించి కాంగ్రెస్‌కు దూరం కావడానికి సిద్ధమయిన సాహసి. ఆర్థిక విధానాల విషయంలో నెహ్రూను వ్యతిరేకించి రాజాజీ ప్రతిపాదించినవే ఇప్పుడు అనుసరిస్తున్న మార్గాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఆయన మేధా ధైర్యానికి విశిష్ట తార్కాణాలు.


వలసపాలకులు మన జ్ఞాన వ్యవస్థలను కించపరిచారు. మన అంతర్గత విశ్వాసాలను ప్రభావితం చేశారు. మనలో మేధా, సాంస్కృతిక న్యూనతలను సృష్టించారు.. అయితే రాజా రామమోహన్‌రాయ్‌ నుంచి మానవేంద్రనాథ్‌రాయ్‌ వరకు మన కవులు, తాత్వికులు, విద్వజ్ఞులు, సాంస్కృతిక కృషీవలులు ఎందరో పాశ్చాత్య అనుచిత ఆధిపత్యాలను తోసిపుచ్చి అవసరమైన ఆలోచనలు తీసుకుని మన మేధా సంస్కృతి విశిష్టతను కాపాడి నిలబెట్టారు, సమున్నతపరిచారు. ఈ కృషి ఎప్పటికీ కొనసాగాలి. ఏ నాగరికతా ఒక ద్వీపం లాంటిది కాదు. వివిధ నాగరికతలతో పరస్పర ఆదానప్రదానాలు లేనిదే ఎవరికీ పురోగతి ఉండదు. మరి వలసపాలనలో మనలను ప్రభావితం చేసిన ఆధునిక ప్రజాస్వామ్యం, ఆధునిక విజ్ఞానశాస్త్రం, నవీన ఆర్థిక జీవన పద్ధతులలో ఆ పథనిర్దేశకుల కంటే మనమే అన్నివిధాల మెరుగ్గా, అగ్రగాములుగా ఉండడమే వలసవాద మానసిక ధోరణుల నుంచి విముక్తి ఆరాటాల లక్ష్యంగా ఉండడం హేతుబద్ధమవుతుంది. వివేకాన్ని మేల్కొలపని విగ్రహపూజ మన సంప్రదాయాలలో ఉంది. వలసవాద ఆలోచనా రీతుల నుంచి విముక్తికై మోదీ సర్కార్‌ చేస్తున్న కృషి –పేర్ల మార్పు, పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాల స్థాపన, కొత్త కట్టడాలు ఇత్యాదులు– ఆ దారిలో నడవకుండా ఉండాలి.


రాజాజీ మేధా నైశిత్యం, నైతిక నిబద్ధతల విషయమై తమిళేతరులలో ఉన్న ప్రతికూల అభిప్రాయాలు తక్కువేమీ కాదు. ఒకనాడు తమిళులతో కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులలో ఆయన పట్ల ఒక విధమైన నిరసన ఉన్నది. అదొక మూసభావనగా రూపొంది ఇప్పటికీ పరిఢవిల్లుతూనే ఉన్నది. ఆ కాలంలో నదులపై ప్రాజెక్టుల విషయంలో ఆయన ప్రతిపాదనలు అంగీకరించి ఉంటే నేడు రాయలసీమలో సాగునీటి సదుపాయాలు చాలా మెరుగ్గా ఉండేవేమో?! ఈ విషయమై ఆంధ్రులు ఇప్పటికైనా నిష్పాక్షికంగా తర్కించుకోవాలి. గతంలో రాజకీయ, ప్రాంతీయ, భావజాలపరమైన భావోద్వేగాలు వివేకశీల ఆలోచనలు, నిర్ణయాలకు అడ్డుపడ్డాయి. మన ప్రజాస్వామ్య యుగంలో అశుభాలను ఎదుర్కొని శుభాలు సమకూర్చుకోవడంలో ప్రజల ప్రాజ్ఞత కీలకమైనది. మరి జనంలో అటువంటి ప్రాజ్ఞత వికసించి వర్థిల్లేందుకు రాజాజీ లాంటి ప్రజాస్వామ్య వివేకశీలి నుంచి స్ఫూర్తిని పొందడం చాలా ముఖ్యం.

Updated Date - Feb 27 , 2026 | 01:14 AM