ప్రేమించిన స్వప్నం...!
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:09 AM
ఏదీ లేని ఖాళీతనం కన్నా దోసెడు కన్నీళ్లో పిడికెడు ఆత్మగౌరవ తండ్లాటో వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తినిచ్చే పోరాటమో..
ఏదీ లేని ఖాళీతనం కన్నా
దోసెడు కన్నీళ్లో
పిడికెడు ఆత్మగౌరవ తండ్లాటో
వెనక్కి తిరిగి చూసుకుంటే
తృప్తినిచ్చే పోరాటమో
నీ డైరీలో ఒక పేజీగా ఒదిగిపోవాలి
కథలు కథలుగా
అనుభవాల ముసురు కురవాలి
నిన్ను ముట్టుకుంటే
బతుకును ముట్టుకున్నట్టే
నిన్ను తలుచుకుంటే
నరాల్లో కరెంటు ప్రవాహం పోటెత్తినట్టే
బతుకంటే ఇట్లా కదా బతకాలి
సాదాసీదాగా సాగిపోతే
దేనికైనా పరమార్థం ఏముంటుంది
ఊపిరి సలుపని సంఘర్షణతోనో
లెక్కకు మించిన సంఘటనలతోనో
నువ్వు నిండుకుండవి కావాలి
బతుకును తలలుపండినతనంతో
తాత్వికంగా వ్యాఖ్యానించాలి!
సున్నితత్వాన్ని నువ్వు వాయిదాల పద్ధతిలో
వదులుకుంటూ సాగిపోతావు
రాటుదేలినతనం
నీ చెరగని చిరునామాను చేసుకుంటావు
వెంటాడే జ్ఞాపకాలను
దోసిళ్లలో పొదువుకుంటావు
చరిత్ర అంటే తవ్వకాల్లోనే బయటపడదు
చరిత్రగా బతికిన నీ గతమై
పురుడుపోసుకుంటుంది
ముందుకు సాగాలనుకున్నప్పుడు
ఏది ఏమైనా ముందుకు సాగాలి
ఎదురుగాలుల కాలం
మానని గాయాల బహుమానాలు
యుద్ధానికి సిద్ధపడ్డాక
బతుకు కొత్తగా కనిపించడం
ఒక ఉపశమనం
పండు రాలి పడడం
ఒక బహిరంగ దృశ్యం
లోలోపల ఉడికిన కుతకుత
చెట్టుకు మాత్రమే తెలిసే యాతన
ఇది నీ పూర్వీకుల యుద్ధం
ఇది నువ్వు ప్రేమించిన స్వప్నం
దీనికి అలసట లేదు
దీనికి ఏ విరామమూ రాదు
- పసునూరి రవీందర్
77026 48825