Share News

మదరాసు తెలుగు బావుటా... అమరజీవి స్మారక భవనం

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:58 AM

మద్రాసు నగరంలో మైలాపూర్‌లోని లజ్ కార్నర్ సమీపాన, రాయపేట హైరోడ్‌లో గల 126వ నెంబరు ఇంట్లో ఆంధ్రరాష్ట్ర సాధనకై పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష చేశారు.

మదరాసు తెలుగు బావుటా... అమరజీవి స్మారక భవనం

మద్రాసు నగరంలో మైలాపూర్‌లోని లజ్ కార్నర్ సమీపాన, రాయపేట హైరోడ్‌లో గల 126వ నెంబరు ఇంట్లో ఆంధ్రరాష్ట్ర సాధనకై పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష చేశారు. 1952 అక్టోబర్ 19న ప్రారంభించిన దీక్ష 58వ రోజున... డిసెంబర్ 15 రాత్రి 11 గంటల 20 నిమిషాలకు తనువు చాలించారు. ఫలితంగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

1953 అక్టోబర్ 1న ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత... పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన స్థలం ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఏడాది లోపే ప్రకాశం ప్రభుత్వం పడిపోవడంతో అది అక్కడితోనే ఆగిపోయింది. 1956 నవంబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లలో భాగంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపుదిద్దుకుంది. బులుసు సాంబమూర్తి, తెన్నేటి విశ్వనాథం పూనికతో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు ప్రాయోపవేశం చేసిన ఇంటిని కొనుగోలు చేసింది.


ఈ ఇంటిలోనే ‘పొట్టి శ్రీరాములు మిషన్’ కార్యక్రమాలు నిర్వహించేవారు. 1958లో దీనిని ‘పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సమితి’గా మార్చారు. ప్రకాశం పంతులుకు కొంతకాలం కార్యదర్శిగా పనిచేసిన వై.ఎస్ శాస్త్రికి ఈ కార్యక్రమాల బాధ్యతను అప్పజెప్పారు. ఒకవైపు స్వాతంత్ర్యం రావడం, మరోవైపు భాష ఆధారంగా తెలుగు రాష్ట్రం ఏర్పడటంతో చాలా విలువైన కార్యక్రమాలు అక్కడ సాగాయి. 1964 ఏప్రిల్ 19న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆవిష్కరించారు. ఆ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అక్కడ క్రమం తప్పకుండా సాహిత్య, సాంస్కృతిక సమావేశాలు జరిగేవి. ప్రముఖ పాత్రికేయులు బి.ఎస్.ఆర్.కృష్ణ ద్వారా అమరజీవి స్మారక కేంద్రం పరిస్థితి తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో చలించి, 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఒకవైపు ధరలు పెరగడం, మరోవైపు పెద్ద భవనం కావాలనే ఆలోచన రావడంతో ఆ 20 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మారింది.

2000 అక్టోబర్ 2న భవన పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దాచి ఉంచిన సొమ్ము సరిపోకపోయినా ఎల్ అండ్ టీ రామకృష్ణ తోడ్పాటుతో మూడంతస్తుల భవనం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నర్ డా. సి.రంగరాజన్ పునర్నిర్మాణమైన భవనాన్ని 2001 నవంబర్ 18న ప్రారంభించారు. క్రింది అంతస్తులో పొట్టి శ్రీరాములు కన్నుమూసిన చోట నెలకొని ఉన్న విగ్రహంతో పాటు ఎంతోమంది తెలుగు ప్రముఖుల ఫొటోలు అక్కడ ఉన్నాయి. మొదటి అంతస్తులో చక్కని సమావేశ మందిరంతో పాటు రెండో అంతస్తులో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. కొత్త జవసత్వాలు పుంజుకోవడంతో కార్యక్రమాలు అద్భుతంగా సాగాయి.


2015 తర్వాత మండలి బుద్ధప్రసాద్ చొరవతో ప్రక్షాళన మొదలై, ప్రభుత్వ యాజమాన్యంలో కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ యాజమాన్యంలో సాగే ఈ సంస్థకు ఏడేళ్ల క్రితం అంటే 2018–20 మధ్య రెండు విడతలుగా ప్రభుత్వ నిధులు వచ్చి ఆగిపోయాయి. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన ఆ స్థలం... చెన్నైలో పర్యటించే ప్రతి తెలుగు ప్రముఖుడు వెళ్లి దర్శించుకుని వచ్చేలా ఉండాలి. గత సంవత్సరం ఈ భవనానికి ‘త్యాగ భవనం’ అని నామకరణం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఒకసారి వెళ్లి వచ్చి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందేలా చూడాలి. ఇది మద్రాసులోనే కీలకమైన పర్యాటక స్థలంగా మారాలి.

అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీ విద్యార్థులు పొట్టి శ్రీరాములు గురించి పూర్తిగా తెలుసుకునే రీతిలో పాఠ్యాంశాలు మార్పు చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పక్షాన పొట్టి శ్రీరాములు త్యాగపూరిత జీవితం స్ఫూర్తిమంతమైన సినిమాగా రూపొందాలి. తర్వాత అది ఇతర దక్షిణాది భాషలతో పాటు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం కావాలి. ఈ సినిమా ద్వారా సామాన్య ప్రజలు పొట్టి శ్రీరాములు త్యాగమయమైన జీవితాన్ని తెలుసుకోవాలి. ప్రస్తుతం 15,000 గ్రంథాలతో ఉన్న లైబ్రరీ మరింత ప్రవర్ధమానమవ్వాలన్నా, నిత్యం పర్యాటకులు చూడటానికి అనువుగా మారాలన్నా, ఇంకా ఆ మందిరంలో కార్యక్రమాలు చురుకుగా జరగాలన్నా నిర్వహణకు పూర్తిస్థాయి ఉద్యోగి అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలి.

- డా. నాగసూరి వేణుగోపాల్

Updated Date - Oct 31 , 2026 | 01:00 AM