ఓటుహక్కు పరిరక్షణకే చలో ఢిల్లీ!
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:45 AM
భారత ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటు కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాశక్తి. సామాన్యుడి నుంచి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత వ్యవస్థల వరకు..
భారత ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటు కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాశక్తి. సామాన్యుడి నుంచి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత వ్యవస్థల వరకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేది ఓటు హక్కు. అలాంటి హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ మహత్తర లక్ష్యంతోనే ‘ఛలో ఢిల్లీ... ఓటును రక్షించుకుందాం– దేశాన్ని కాపాడుకుందాం!’ అనే నినాదంతో నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న ప్రజా పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు పెద్దఎత్తున తరలిరావాలి.
కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఓటరుకు సమాన విలువ ఉండాలన్నదే మన రాజ్యాంగ స్ఫూర్తి. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, పాలకులను ప్రశ్నించడం, అవసరమైతే అధికార మార్పిడికి తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగాలు. అయితే, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాల విశ్వసనీయత, ఓటు హక్కు వినియోగంలో ఎలాంటి అడ్డంకులూ లేకపోవడం వంటి అంశాలపై ప్రజలకు పూర్తి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉంది. తన ఓటు సురక్షితంగా ఉందని, తన ఓటుకు తగిన విలువ ఉందని ఓటరు విశ్వసించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు పరిరక్షణ కోసం జరిగే ఉద్యమం ఒక రాజకీయ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకూడదు. అది రాజ్యాంగ విలువలను కాపాడే, పౌర హక్కులపై అవగాహన పెంచే, ప్రజాస్వామ్య సంస్థల పట్ల జవాబుదారీతనాన్ని కోరే విస్తృత ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి.
భారత స్వాతంత్ర్య పోరాటం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ వంటి సూత్రాలు మన ప్రజాస్వామ్యానికి పునాదులు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ఎన్నికల్లో ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలు ఉండాలి. ప్రజల అభిప్రాయానికి గౌరవం దక్కాలి. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఈ విలువలను కాపాడేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం. దేశంలో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్నలు చర్చకు వచ్చినప్పుడు వాటిని బాధ్యతాయుతంగా పరిశీలించడం, పారదర్శకతను కోరడం, ప్రజల సందేహాలకు సమాధానాలు లభించేలా కృషి చేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది.
తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలు ప్రదర్శించిన ఐక్యత, పట్టుదల, త్యాగనిరతి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రజల ఆకాంక్ష కోసం వీధుల్లోకి వచ్చి పోరాడిన అనుభవం మనకు ఉంది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందడుగు వేయాల్సిన సమయం వచ్చింది. నవంబర్ 1న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ప్రజా పాదయాత్రలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితమైన బాధ్యతగా స్వీకరించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సంకల్పమే మన ప్రయాణానికి ప్రేరణ కావాలి.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. ఓటు హక్కు విలువను అర్థం చేసుకుని, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచుకుని, ప్రజాస్వామ్య చర్చల్లో చురుకుగా పాల్గొనే యువతే బలమైన భారతదేశ నిర్మాణానికి పునాది. మహిళల రాజకీయ భాగస్వామ్యం, అణగారిన వర్గాల ప్రాతినిధ్యం, వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు ప్రజాస్వామ్యాన్ని మరింత సమగ్రంగా మారుస్తాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు. ప్రతి పౌరుడికి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉండాలి. ప్రతి వర్గానికి తన హక్కుల కోసం గొంతెత్తే స్వేచ్ఛ ఉండాలి. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు అందుబాటులో ఉండాలి. ఓటర్ల జాబితాల్లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దే వ్యవస్థలు సమర్థంగా పనిచేయాలి. ఎన్నికలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు నిరంతరం కొనసాగాలి.
కాంగ్రెస్ కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఒక్కటే. ప్రజాస్వామ్య పరిరక్షణను ఒకరోజు కార్యక్రమంగా చూడవద్దు. అది నిరంతర బాధ్యతగా భావించాలి. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి. ఓటర్ల జాబితాల్లో అర్హులైన వారి పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ప్రోత్సహించాలి. ఓటు హక్కు వినియోగంలో ఎదురయ్యే సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించేందుకు సహకరించాలి.
రాజకీయ భేదాభిప్రాయాలు సహజం. కానీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌరుల హక్కుల పరిరక్షణ విషయంలో మనందరిలో ఒకే సంకల్పం ఉండాలి. మన పోరాటం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ప్రజల గొంతుకు విలువ ఉన్నప్పుడే పాలన జవాబుదారీగా ఉంటుంది. ప్రతి ఓటుకు గౌరవం లభించినప్పుడే రాజ్యాంగస్ఫూర్తి సజీవంగా ఉంటుంది. అందుకే న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానం నుంచి దేశానికి బలమైన సందేశం ఇద్దాం. తెలంగాణ పోరాటస్ఫూర్తిని దేశ రాజధానిలో ప్రతిధ్వనింపజేద్దాం.
- పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి