Share News

కళాపోషకుడు, పరోపకారి

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:58 AM

పొన్నెకంటి పోతురాజు గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో 1926 ఫిబ్రవరి 16న జన్మించారు. సత్యవేదం, యోసేపు తల్లిదండ్రులు. అసలు పేరు మార్టిన్...

కళాపోషకుడు, పరోపకారి

పొన్నెకంటి పోతురాజు గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో 1926 ఫిబ్రవరి 16న జన్మించారు. సత్యవేదం, యోసేపు తల్లిదండ్రులు. అసలు పేరు మార్టిన్. పోతురాజుది సాధారణ కుటుంబమే. చిన్ననాటి నుంచే ఈయన హాస్యప్రియుడు, సృజనశీలి. ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఎంతో మంది విద్యార్థులకు, యువతకు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలలో శిక్షణనిచ్చారు. వాచికాభినయంలో, నటనలో మేటి కళాకారుడు. పచ్చి రావి ఆకులను హార్మోనికగా మలిచి, రాగ, తాళాలతో పద్యాలు, పాటలూ హృద్యంగా పాడేవారు. అంతేగాదు, ఆయన కళాపోషకుడు కూడా. సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. ఈ సానుకూల అంశాలే పోతురాజుకు ప్రత్యేకతను సంతరించిపెట్టాయి.

ఉద్యమకారులు, బాటసారులు, అక్కరలో ఉన్నవారికి పోతురాజు ఎంతో సహాయం చేసేవారు. ఇలాంటి వారికి ఆయన ఇల్లు ఆశ్రయంగా ఉండేది. ఎమర్జెన్సీ కాలంలో చెరుకుపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి కేసులో నిందితులని తెలియక, కొందరికి పోతురాజు తన ఇంట్లో కొద్దికాలం ఆశ్రయమిచ్చారు. దీంతో ఇక్కట్లపాలై కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళవలసివచ్చింది. ఎంతోమంది వ్యవసాయ కూలీలకు పోతురాజు అప్లికేషన్లు రాసిపెట్టి, రిప్రజెంట్ చెయ్యగా, నాటి టెనెంట్స్ చట్టంతో.. వ్యవసాయ కూలీలు భూ యజమానులయ్యారు. ఈ సమయంలో పోతురాజుపై హత్యాయత్నం కూడా జరిగింది. లోకం బసవపున్నయ్యతో కలిసి కొలకలూరుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెప్పించారు. అగస్త్యేశ్వర స్వామి దేవాలయ ట్రస్టు డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. కొలకలూరులో రథసప్తమి తిరునాళ్ళలో పోతురాజు రెండు రథాలను లాగేవారు.

తన సోదరి విక్టోరియమ్మతో కలిసి గ్రామంలో క్వారీలు పెట్టకుండా జీవితాంతం అడ్డుకున్నారు. గ్రామంలో రాజకీయ ఏకీకరణ జరగాలంటే పోతురాజు ఉండి తీరాల్సిందేనని ప్రజలు నమ్మేవారు. దుగ్గిరాల అసెంబ్లీ నియోజకవర్గానికి అవుతు రామిరెడ్డి, బొంతు గోపాలరెడ్డి మొదలైనవారు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలవడానికి పోతురాజు చేసిన కృషి విశేషమైనది. ప్రఖ్యాత సినీనటుడు, నాటక రచయిత, గేయకారుడు మోదుకూరి జాన్సన్‌లోని ప్రతిభా పాటవాలను మొదటగా గుర్తించి, ఆయనకు ప్రోత్సాహాన్నిచ్చారు. కవి నూతక్కి అబ్రహాం, రావూరి కోటేశ్వరరావు వంటివారితో కలిసి పోతురాజు ఆ రోజుల్లో పప్పుకూటి నాటక పరిషత్‌ను స్థాపించి, ఎన్నో రంగస్థల నాటకాలను ప్రదర్శించారు. అలాగే, సామాజిక రుగ్మతలపై భారతంలో మరో హరిశ్చంద్రుడు, భస్మ సింహాసనం వంటి ఏకపాత్రలను స్వయంగా సృష్టించి, ప్రదర్శించారు. గుఱ్ఱం జాషువా శిష్యురాలైన విమలమ్మ వద్ద పోతురాజు పాటలు, పద్యాలు ఆలపించడంలో, నటనలో చిన్ననాటే తగిన శిక్షణ పొందారు. డప్పు, సితార వాద్యాలు, చిందు నాట్యంలో ఆయనకు మంచి ప్రవేశం ఉంది. విజయవాడ గోపరాజు రామచంద్రరావు (గోరా) నాస్తిక సమాజంలో పోతురాజు శిక్షణ పొందారు.

కొలకలూరు గ్రామంలో తన చిన్నాన్న బెంజమిన్‌ స్థాపించిన విద్యాసంస్థల అభివృద్ధి కోసం పోతురాజు తన తమ్ముడు ఎలీషాతో కలిసి కృషి చేశారు. అవసరంలో ఉన్న ఎందరికో సహాయం చేసి, విద్యార్థి, యువకుల్లో ప్రతిభను వెలికితీశారు. జీవితాన్ని స్నేహ మయంగా, పరోపకారంగా, ఆనందంగా మలుచుకున్న మంచి మనీషి ఆయన. 2017, నవంబర్ 9న మన మధ్య నుంచి పోతురాజు నిష్క్రమించారు.

-కృపాకర్ మాదిగ

Updated Date - Feb 14 , 2026 | 12:58 AM