Share News

‘ధమ్కీ’ రాజకీయాలు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:04 AM

ఆధునిక రాజకీయ నిఘంటువులోకి ఇప్పుడొక కొత్త పదం వచ్చి చేరింది. దాని పేరే ‘ధమ్కీ’. ఆ ధమ్కీకి అర్థ తాత్పర్యాలను వివరించి, అందుకు అవసరమైన పారిభాషిక పదజాలాన్ని రూపొందించాల్సిన బాధ్యత భాషాశాస్త్రవేత్తలపై ఉంది.

‘ధమ్కీ’ రాజకీయాలు!

ఆధునిక రాజకీయ నిఘంటువులోకి ఇప్పుడొక కొత్త పదం వచ్చి చేరింది. దాని పేరే ‘ధమ్కీ’. ఆ ధమ్కీకి అర్థ తాత్పర్యాలను వివరించి, అందుకు అవసరమైన పారిభాషిక పదజాలాన్ని రూపొందించాల్సిన బాధ్యత భాషాశాస్త్రవేత్తలపై ఉంది.

చాలా మంది నాయకుల రాజకీయ అరంగేట్రమే ధమ్కీలతో ప్రారంభమవుతుంది. పక్కనున్న పోటీదారులకు ధమ్కీలు ఇవ్వకుండా పదవులు సంపాదించడం ప్రస్తుత రాజకీయాలలో సాధ్యపడే విషయమేనా? నలుగురిని ఎదగకుండా తొక్కిపెడితే తప్ప ఎవరైనా నాయకత్వ స్థానంలోకి రావడం కుదరదు. పదవులు పొందడానికైనా, ఉన్న పదవులు ఊడగొట్టడానికైనా ధమ్కీయే అవసరం. ధమ్కీ ఇవ్వడం రాని వాడు రాజకీయాలలో దమ్మిడీకి కొరగాడు మరి!

‘దేఖేంగే’ అంటాడొక నాయకుడు! ‘చలో దేఖేంగే’ అంటూ ప్రతిసవాలు విసురుతాడు ఇంకొక నాయకుడు. మామూలుగా అయితే ఒక పార్టీకి చెందిన వాళ్లు ఇతర పార్టీల నాయకులకు ధమ్కీ ఇస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టైలే వేరు! వాళ్లు బయటి నాయకుల కన్నా పార్టీ లోపలి వాళ్లకే ఎక్కువగా ధమ్కీలు ఇస్తూ ఉంటారు. ఈ మధ్య ఏకంగా ముఖ్యమంత్రికే ధమ్కీ ఇవ్వబోయింది ఓ మంత్రి. మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన మంత్రాంగం నడపలేదని కాదు. ఎక్కడ నొక్కాలో మీటను అక్కడ నొక్కేశారు. ఆయనది నిశ్శబ్ద ధమ్కీ అన్నమాట. ఆ తరువాత, ఓ కార్యక్రమంలో ‘నేను ధమ్కీలకు భయపడను’ అని బహిరంగంగా ప్రకటించారాయన. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించడమే రాజకీయాలలో రాణింపునకు మొదటి మెట్టు! అలా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ పోవడమే రాజకీయ చతురత! ఆ చతురత లోపించిన చోట చరిష్మా మసకబారిపోతుంది!


రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి తరం నాయకులు మొట్టమొదట నేర్చుకునేది ధమ్కీనే. ధమ్కీని నమ్ముకునే వీళ్లలో ఎక్కువ మంది దందాలు సాగిస్తుంటారు. మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు కానీ ధమ్కీలకు మాత్రం చాలా పనులు జరుగుతాయి. చట్టం చేయలేని పనులను ఎన్నిటినో ఈ ధమ్కీ చేసి చూపిస్తుంది. అందుకే నాయకులు అన్నిసార్లూ తామే ధమ్కీలు ఇవ్వరు. తమకు వీలుకాని చోట తమ అనుయాయులతో గానీ లేదా తమ చెప్పుచేతల్లో ఉన్న సంస్థల ద్వారా గానీ ఈ మహత్కార్యాన్ని చేయిస్తుంటారు. ఎక్కడి దాకానో ఎందుకు? పశ్చిమ బెంగాల్‌లో మమతకు ధమ్కీ ఇచ్చే బాధ్యతను బీజేపీ పెద్దలు ఎలక్షన్ కమిషన్‌కు అప్పగించారు. స్థానిక ప్రభుత్వాలను ఓడించడానికి, పార్టీలను చీల్చడానికి చట్టబద్ధంగా ఎలా ధమ్కీ ఇవ్వవచ్చునో ఆ సంస్థ చేసి చూపింది. ఓట్ల గల్లంతు నుంచి చీలిపోయిన పార్టీ గ్రూపులకు ఎన్నికల గుర్తులు కేటాయింపు వరకు తన చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉంది.

వర్తమాన రాజకీయాలలో ధమ్కీ ఇప్పుడొక శక్తిమంతమైన ఆయుధం. ధమ్కీకి అధికారిక గుర్తింపు లేకపోవచ్చు కానీ, ప్రజలలో మాత్రం దానికి ఎక్కడలేని పాపులారిటీ ఉంది. ధమ్కీకి సానబెట్టి దానిని ఒక రాజకీయ కళగా అభివృద్ధి చేస్తున్నవాళ్లు జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా అనేక మంది ఉన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ధమ్కీలు ఇచ్చే విషయంలోనూ పెద్దన్నగానే వ్యవహరిస్తున్నారు. బుజ్జగింపులు, బెదిరింపులు పనిచేయకపోతే సుంకాలతో కూడా మిగతా దేశాల ‘కొంకులు’ విరగ్గొట్టొచ్చని కనుక్కున్న దార్శనికుడు డోనాల్డ్ ట్రంప్. ట్రంప్ చేసే ధమ్కీ రాజకీయాలకు ప్రపంచవ్యాప్తంగా భిన్న ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ధమ్కీ ఇస్తే జడుసుకోవడానికి భారత్ లాంటి దేశాలు ఉన్నట్టే, ధమ్కీలకే ధమ్కీ ఇచ్చే జడుపు లేని చైనా లాంటి దేశాలూ ఉన్నాయి. వ్యక్తులైనా, దేశాలైనా, ఎవరు ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే విషయం ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి.

- గుండెబోయిన శ్రీనివాస్

Updated Date - Oct 03 , 2026 | 12:04 AM