Share News

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ధర్నా

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:31 AM

ప్రభుత్వాలు, ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ధర్నా

ప్రభుత్వాలు, ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు. లక్షలాది ఆదివాసీలు ‘జల్‌, జంగల్‌, జమీన్‌, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు. వారిపై తీవ్రమైన అణచివేత కొనసాగుతున్నది. సామాజిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేస్తూ, వాటికి అనుకూలంగా రచనలు చేస్తూ, కోర్టులో న్యాయపోరాటాలు చేస్తూ, మీడియాలో వార్తలు రాసే ప్రజాస్వామిక వాదులపై కూడా పోలీసులు ఉపా చట్టం కింద కేసులు పెట్టి జైళ్లలో బంధిస్తున్నారు. వీరందరూ రాజకీయ ఖైదీలే. ఒకవైపు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయిందని ప్రకటించాయి. ఉద్యమం వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నాయకులు, కార్యకర్తలపై కేసులు తీసివేయకపోయినా అరెస్టు చేయకుండా ఇళ్లకు పంపించాయి. కానీ, మావోయిస్టులకు సహకరించారనే కారణంతో సాధారణ కార్యకర్తలు మాత్రం విచారణ ఖైదీలుగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలా జైళ్లలో ఉన్న వారిలో 90శాతం ఆదివాసీలే. ఈ రాజకీయ ఖైదీలలో కొందరు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.


జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి. ప్రజాసంఘాల నాయకులపై, మేధావులపై, ముస్లిం మైనారిటీ రాజకీయ ఖైదీలపై పెట్టిన అక్రమ ఉపా కేసులన్నింటినీ ఎత్తివేయాలి. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. ఉపా చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ దగ్గర ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రొ. లక్ష్మణ్‌ గడ్డం, ప్రొ. హరగోపాల్‌, ప్రొ. మాడభూషి శ్రీధర్‌, ప్రొ. కోదండరాం, కూనంనేని సాంబశివరావు, గుమ్మడి నర్సయ్య, జె.జాన్‌ వెస్లీ, సంధ్య, విమలక్క, కన్నెగంటి రవి తదితరులు పాల్గొంటారు.

– రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక, తెలంగాణ

Updated Date - Aug 28 , 2026 | 03:37 AM