ఔరా! రాజకీయ వలసల భారతం!
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:37 AM
భారత రాజకీయాలలో ఆరు వారాలు ఒక సుదీర్ఘకాలమే. ఈ ఏడాది ఫిబ్రవరి 10న కాంగ్రెస్ ఎంపీ ప్రద్యోత్ బోర్దోలాయి తీవ్ర ఆగ్రహావేశాలతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక వ్యవస్థను తక్షణమే మరింత పటిష్ఠపరచాలి. పార్టీ చీలికల పేరిట మూకుమ్మడి ఫిరాయింపులకు ఆస్కారమిస్తున్న చట్టపరమైన లోపాలను పూర్తిగా పరిహరించి తీరాలి. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులపై న్యాయ నిర్ణయాన్ని తీసుకునే అధికారం స్పీకర్‌కు కాకుండా ఒక స్వతంత్ర అధికారికి ఉండేలా చర్యలు చేపట్టాలి.
భారత రాజకీయాలలో ఆరు వారాలు ఒక సుదీర్ఘకాలమే. ఈ ఏడాది ఫిబ్రవరి 10న కాంగ్రెస్ ఎంపీ ప్రద్యోత్ బోర్దోలాయి తీవ్ర ఆగ్రహావేశాలతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు. ఒక ముస్లిం వ్యక్తిపై బొమ్మ తుపాకీతో హిమంత కాల్పులు జరుపుతున్నట్టు చూపించిన వివాదాస్పద విడియో ఒకటి వైరల్ అయిన సందర్భంలో బోర్దోలాయి ఆ ట్వీట్ చేశారు.
‘ఇది మీకు సిగ్గు చేటు, హిమంత! మతసామరస్యానికి పర్యాయపదమైన అసోం సామాజిక వ్యవస్థను ఇంతకుముందెన్నడూ ఒక రాజకీయవేత్త ఎవరూ మీ మాదిరిగా ఛిద్రం చేయలేదు’ అని నిన్నటిదాకా కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడుగా ప్రభాసించిన ప్రద్యోత్ బోర్దోలాయి ఆ ట్వీట్‌లో విమర్శించారు. అసలు కథకు వస్తే ఈ నెల 18న బోర్దోలాయి, ముఖ్యమంత్రి శర్మ పక్కన నుంచొని ఉన్నారు. బీజేపీ కండువా కప్పుకుని, ఆ పార్టీ టోపీ పెట్టుకున్న ప్రద్యోత్ బీజేపీలో చేరిన క్షణమది. ‘విలువైన కార్యకర్త’ అని బోర్దోలాయిపై బీజేపీ నేతలు ప్రశంసలు కురిపించారు. కేవలం ఆరు నెలల క్రితమే ఇదే ప్రద్యోత్‌ను ‘అసోం ప్రజలు ఇదివరకు ఎన్నడూ చూడని అవినీతిపరుడు, నక్కజిత్తుల అధికార దళారీ’ అని అదే బీజేపీ నాయకులు దుయ్యబట్టారు. ఇప్పుడు ఎవరూ ఇంకెంత మాత్రం ఆశ్చర్యపోని ఒక రాజకీయ మార్గంలో బీజేపీ గూటికి బోర్దోలాయి చేరారు. ఎన్నికల తరుణంలో పార్టీ ఫిరాయింపు సాధారణమైపోయిన రోజులివి. దేశ రాజకీయ విశ్వంలో ఫిరాయింపులు ఒక కొత్త సాధారణంగా వర్ధిల్లుతున్నాయి. అవకాశవాదమే అందరూ ఆదరిస్తున్న, అనుసరిస్తున్న రాజకీయ‘వాదం’. అసోం రాజకీయాలే ఇందుకొక నిండు తార్కాణం.
రెచ్చగొట్టే ప్రశ్న నొకదాన్ని అడగవలసిన సమయమాసన్నమయింది: అసోంలోనే కాకుండా విశాల భారతదేశమంతటా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ రహిత భారత్) అనే నినాదం ‘కాంగ్రెస్ యుక్త్ బీజేపీ’ (కాంగ్రెస్ సమ్మిళిత బీజేపీ)గా రూపాంతరం చెందిందా? ఈ ప్రశ్న సకారణమైనది. 2024 సార్వత్రక ఎన్నికలలో 100మందికి పైగా బీజేపీ అభ్యర్థులు రాజకీయ ఫిరాయింపుదారులే. అంతేకాదు వీరిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి ఫిరాయించినవారే. గత పది సంవత్సరాల కాలంలో 200 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు మోదీ నేతృత్వంలోని బీజేపీలో చేరారు. ఈ ఫిరాయింపుదారులలో 40శాతం మంది కాంగ్రెస్ నుంచి కప్పగంతు వేసినవారే. మనం చూస్తున్నది కేవలం ఒక పార్టీ పతనం, మరొక పార్టీ ఉత్థానం మాత్రమే కాదు. ఒక రాజకీయ ఆవరణాన్నే బీజేపీ తనలో సంలీనం చేసుకుంటున్న పరిణామమది. కాంగ్రెస్ కాళ్ల కింద భూమిని తొలగించడం మాత్రమే కాదు, అసలు కాంగ్రెస్ వ్యవస్థనే వారసత్వంగా బీజేపీ పొందుతోంది. కాంగ్రెస్ నాయకులు, దాని నెట్‌వర్క్‌లను మాత్రమే కాదు, ఆ పార్టీ సామాజిక పునాదిలోని గణనీయమైన భాగాలను సైతం బీజేపీ స్వాయత్తం చేసుకుంటోంది. ఇటీవలి రాజకీయ పరిణామాలు, గణాంకాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ఇవి రాజకీయ భావజాలంపై ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భారత రాజకీయాలు దశాబ్దాలుగా సైద్ధాంతిక విభజనల వాతావరణంలో ప్రస్థానిస్తున్నాయి. కాంగ్రెస్ తన స్థానాన్ని ఒక లౌకికవాద పార్టీగా సుస్థిరం చేసుకున్నది. విభిన్న ప్రపంచ దృక్పథమున్న జాతీయవాద పార్టీగా బీజేపీ ఎదిగింది. అయితే ప్రస్తుత రాజకీయ మథనంలో ఈ సైద్ధాంతిక విభజనలు అస్థిరమైపోతున్నాయి. మొన్నగాక అటు మొన్న బీజేపీ హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గర్జించిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీ విధానాలను గట్టిగా సమర్థిస్తున్నారు. ఎన్నికల మానిఫెస్టోలు సంబంధిత పార్టీల నిబద్ధతలకు ఎంత మాత్రం తార్కాణాలుగా ఉండడం లేదు. దీనినెలా అర్థం చేసుకోవాలి? భావజాలం అవశేషమైపోయిందనా? కాదు, కానేకాదు. అయితే రాజకీయాలలో సిద్ధాంతాల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ప్రగతిశీల భావజాలాలు ప్రతిష్ఠను కోల్పోయాయి. ఇది వాస్తవం. అధికారం (సంపద సైతం) రాజకీయాల ప్రాథమిక వ్యవస్థాపక సూత్రంగా మారింది. ఎన్నికల విజయం అంతకంతకూ కేంద్రీకృతమైపోతున్న వ్యవస్థలో ప్రోత్సాహకాలు ఏమిటో స్పష్టమే. ఆధిపత్య రాజకీయ శక్తితో కలిసి సాగుతూ రాజకీయ మనుగడను కాపాడుకోవడం, లేదా రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోవడమే. మరో ప్రత్యామ్నాయం లేదు.
ఇది కేవలం అవకాశవాదం గురించి మాత్రమే కాదు; ఇది పార్టీ నిర్మాణాల గురించి కూడా. పాలక, ప్రతిపక్షాల మధ్య అధికార పరమైన అసౌష్ఠవం పెరిగిపోయింది. ఆర్థిక వనరులు, మీడియా మద్దతు, సంస్థాగత శక్తి సామర్థ్యాలు అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే ఉంటున్నాయి. రాజకీయవేత్తల ఘటనాఘటన సామర్థ్యం ఫిరాయింపుల నిరోధక పరిధిని మించి పోయింది. రాజకీయ అస్థిరతను నివారించేందుకు ఉద్దేశించిన ఈ చట్టాన్ని రాజకీయ ఘనపాఠీలు చాలా తెలివిగా ఉల్లంఘిస్తున్నారు. పార్టీలలో చీలికలు, పార్టీల విలీనాలు తదితర పన్నుగడలతో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో రాజకీయవేత్తలు సఫలమవుతున్నారు. ఓటర్ల తీర్పును కాపాడేందుకు లక్ష్యించిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రజా తీర్పుకు వాటిల్లుతున్న విద్రోహాలను చట్టబద్ధం చేస్తోంది!
వర్తమాన రాజకీయ ప్రవర్తనలో ఇదొక నైతిక సంక్షోభం. భారత జాతీయ కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనమైపోవడం ఆ సంక్షోభాన్ని మరింత విషమింపచేసింది. ఒకప్పుడు భారత రాజకీయాల కేంద్ర ధ్రువంగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు కీలక రాష్ట్రాలలో తన ఉనికిని కాపాడుకునేందుకు, కొత్త నాయకత్వాన్ని ప్రభవింప చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. అధికార సాధనకు కాంగ్రెస్ ఇంకెంత మాత్రం విశ్వసనీయమైన మార్గం కాదని ఆ పార్టీ నాయకులు చాలా మంది విశ్వసిస్తున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ ఫిరాయింపు అనేది దగాకోరు వ్యవహారంగా కాకుండా ఒక వ్యూహాత్మక రాజకీయ చర్యగా పరిగణన పొందుతోంది! రాజకీయాలలో ఇంతకు మించిన నైతిక భ్రష్టత్వం మరేముంటుంది?
ఈ పరిస్థితి ఓటర్లను ఒక ప్రజాస్వామిక సందిగ్ధతకు లోనుచేస్తుంది. ఒక పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధి ఎదుటి పక్షంలో చేరినప్పుడు ఓటర్ల సమ్మతి లేకుండానే వారి తీర్పు ఆ రెండో పక్షానికి అనుకూలంగా బదిలీ అవుతుంది. ఓటర్ల అభీష్టం అస్పష్టం కావడమే కాకుండా నిరర్థకమైపోతుంది. అయినా ఈ నీతిబాహ్య కథ పూర్తిగా ఓటర్ల నిస్సహాయత్వానిది మాత్రమే కాదు. పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు మళ్లీ ఎన్నికవుతున్నారు. సైద్ధాంతిక నిబద్ధత కంటే అధికారానికి సమీపంలో ఉండడానికే ఓటర్లు ప్రాధాన్యమిస్తున్నారని అది సూచిస్తుంది. రాజకీయ విధేయత కంటే అభివృద్ధి హామీలు, అధికారవర్గాల అండదండలే ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. నాయకుల తీరుతెన్నుల పట్ల నిరుత్సాహం, తమ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాల ఆవశ్యకత మధ్య ఓటర్లు నిరంతరం సతమతమవుతున్నారు. మన ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని నిర్వచిస్తున్న అనైతిక ద్వంద్వ స్వభావమిది. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు ఏమి చేయాలి? ప్రలోభాల, ప్రోత్సాహకాల లభ్యతను అలభ్యం చేయడమే ఒక సంభావ్య పరిష్కారం. పార్టీ మారిన వెన్వెంటనే తనకు ఎలాంటి పదవి దక్కే అవకాశం లేదని తెలిస్తే ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయింపునకు ఉత్సాహం చూపకపోవచ్చు. పార్టీ మార్పుపై అతడి లెక్కలు మారుతాయి. పార్టీ ఫిరాయింపుదారులను కనీసం ఐదు సంవత్సరాల పాటు మంత్రి పదవుల్లో నియమించకూడదన్న చట్టాన్ని తీసుకు వస్తే, అది ఆయారం, గయారాంలను తప్పక నిలువరిస్తుంది. ఫిరాయింపులను పూర్తిగా నిరోధించలేకపోవచ్చు కానీ, తక్షణ ప్రతిఫలాలు ఏవీ లేని క్లిష్ట పరిస్థితిని ఫిరాయింపుదారులకు కలిగిస్తుంది.
అదే సమయంలో ఫిరాయింపుల నిరోధక వ్యవస్థను తక్షణమే మరింత పటిష్ఠపరచాలి. పార్టీ చీలికల పేరిట మూకుమ్మడి ఫిరాయింపులకు ఆస్కారమిస్తున్న చట్టపరమైన లోపాలను పూర్తిగా పరిహరించి తీరాలి. ఫిరాయింపులపై న్యాయ నిర్ణయ ప్రక్రియను పక్షపాత నియంత్రణ నుంచి వేరు చేయాలి. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులపై న్యాయ నిర్ణయాన్ని తీసుకునే అధికారం స్పీకర్‌కు కాకుండా ఒక స్వతంత్ర అధికారికి ఉండేలా చర్యలు చేపట్టాలి. అయితే ఏ న్యాయ సంస్కరణలూ అంతిమంగా రాజకీయ నైతిక నిష్ఠకు ప్రత్యామ్నాయం కావు, కాలేవు. ప్రతిపక్షం సంస్థాగతంగా బలహీనమై, చీలికలు పేలికలుగా ఉన్నంతవరకు ఫిరాయింపులకు ప్రలోభాలు, ప్రోత్సాహకాలు ఉంటూనే ఉంటాయి. పరిష్కారమేమిటి? రాజకీయ ప్రవర్తనను క్రమబద్ధీకరించడంతో పాటు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాలను పునః నిర్మించడమే.
ఇది మనలను మళ్లీ అసోంకు, విశాల రాజకీయ భారతావనికి తీసుకువస్తుంది. దేశ రాజకీయాలలో బీజేపీ ఉత్థానం నిస్సందేహంగా ఒక రాజకీయ విజయగాథ.. నరేంద్రమోదీ– అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ఒక మహా శక్తిమంతమైన ఎన్నికల పోరాట యంత్రాంగం. అధికారానికి చేరువగా ఉంటూ ఆర్థిక వనరులను అతి స్వల్ప వ్యవధిలో అపారంగా సమకూర్చుకునేందుకు ఆరాటపడుతున్న వారందరినీ ఆ పార్టీ ఒక స్వగృహంగా ఆకట్టుకుంటోంది. ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఒక ఏకపక్ష మార్గంగా మారే ప్రమాదం ఎంతైనా ఉన్నది. ప్రజలు ఓటు వేస్తున్నారు. అయితే వారి ఓటుతో ఎన్నికైన వారు తమకు ఇతోధిక లబ్ధి సమకూర్చే పార్టీకి మారడానికి వెనుకాడడం లేదు. వారి రాజకీయ ప్రవర్తన స్వీయ ప్రయోజనాలకు మాత్రమే అనుగుణంగా ఉంటోంది. నిశ్శబ్దంగా చోటుచేసుకుంటున్న మార్పు ఇది. పర్యవసానంగా ప్రజా తీర్పుకు అర్థం కూడా దానికదే మారిపోతోంది.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)