వికసిత తెలంగాణ లక్ష్యమే ఈ పర్యటన
ABN , Publish Date - May 10 , 2026 | 12:31 AM
ఏ రాష్ట్ర అభివృద్ధినైనా కొలిచే అసలు ప్రమాణం హామీల హోరు కాదు.. ప్రజల జీవితాల్లో నిలిచిపోయే శాశ్వత ఆస్తులు. రహదారులు, రైల్వే లైన్లు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక పార్కులు...
ఏ రాష్ట్ర అభివృద్ధినైనా కొలిచే అసలు ప్రమాణం హామీల హోరు కాదు.. ప్రజల జీవితాల్లో నిలిచిపోయే శాశ్వత ఆస్తులు. రహదారులు, రైల్వే లైన్లు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక పార్కులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఇవన్నీ రేపటి భవిష్యత్తుకు అసలైన పునాదులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలు కేవలం రాజకీయ పర్యటనలు కావు. అవి తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో చారిత్రక మైలురాళ్లు.
మే 10న ప్రధాని హైదరాబాద్ పర్యటన ఒక కీలక సందర్భం. ఈ పర్యటనలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్ జాతీయ రహదారి విస్తరణ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట–విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్, కాజీపేట రైల్ బైపాస్, మల్కాపూర్ పెట్రోలియం టెర్మినల్, హైదరాబాద్ పరిసరాల్లో అధునాతన వైద్య సదుపాయాలు... ఇవన్నీ కలిసి తెలంగాణ అభివృద్ధికి ఒక సమగ్ర దిశను చూపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి విడివిడిగా కనిపించే ప్రాజెక్టులయినా అంతర్లీనంగా రాష్ట్రాభివృద్ధికి అనుసంధానమైనవే.
రోడ్లు వస్తే పరిశ్రమలకు మార్గం సుగమమవుతుంది. రైల్వే సామర్థ్యం పెరిగితే సరుకు రవాణా వేగవంతమవుతుంది. పారిశ్రామిక పార్కులు వస్తే పెట్టుబడులు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంధన, లాజిస్టిక్స్, వైద్య మౌలిక వసతులు బలపడితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బలం చేకూరుతుంది. ఇదే అభివృద్ధి ఆర్థికమైన, ప్రజాస్వామ్యమైన అసలు అర్థం. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఆరోగ్యం, పరిశ్రమలు, ఇంధనం, విద్య, లాజిస్టిక్స్ వేర్వేరు రంగాలు కావు. ఇవన్నీ కలిసే వికసిత తెలంగాణకు బలమైన పునాది వేస్తాయి.
తెలంగాణ ఏర్పడి దాదాపు పన్నెండు ఏళ్లు పూర్తికావస్తోంది. ఈ కాలంలో రాష్ట్రానికి అవకాశాలు లేవనడం అబద్ధం. హైదరాబాద్ వంటి మహానగరం, ఐటీ రంగం, ఫార్మా, రక్షణ, వ్యవసాయం వంటి రంగాలు తెలంగాణకు సహజ బలాలు. కానీ, ఈ బలాన్ని ఉత్పాదక ఆస్తులుగా, స్థిరమైన ఉద్యోగాలుగా మార్చడంలో గత రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి.
పాలనలో ఒక ప్రాథమిక న్యాయ సూత్రం ఉంది. ‘‘ప్రజల సొమ్ము ప్రజల ప్రయోజనానికే ఉపయోగపడాలి.’’ ప్రభుత్వం అప్పు తీసుకుంటే, అది భావి తరాలకు భారంగా కాకుండా ఆస్తిగా మారాలి. కానీ తెలంగాణలో భారీ ఖర్చులు జరిగినా, వాటికి తగిన ఉత్పాదక ఫలితాలు కనిపించలేదు. ఆపై అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారు. తత్ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రోగులు, రైతులు, కాంట్రాక్టర్లు, గ్రామ పంచాయతీ అధ్యక్షులు... అందరూ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం అంతులేని నిరీక్షణలో ఉన్న పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ మూలధన ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం నేడు ఉపయోగించలేని స్థితికి చేరుకుంది.
తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణికి నేడు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కష్టాల్లో కునారిల్లుతుంది. టీఎస్‌జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిలే రూ.18,827 కోట్లకు చేరుకున్నాయి. ఆర్టీసీ దీనపరిస్థితి అందరికీ విదితమే. మిగిలిన ప్రభుత్వరంగ సంస్థల విషయానికి వస్తే కాగ్ ఆడిట్ చేసిన 18 రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో.. 11 సంస్థలు రూ.11,969.66 కోట్ల నష్టాలను చవిచూశాయి. ఈ నష్టాల కారణంగా 9 సంస్థల నికర విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇది రాజకీయ విమర్శ కాదు, కాగ్ నివేదికలు చెబుతున్న నగ్న సత్యాలు. ప్రైవేట్ రంగాన్ని పరిశీలించినా, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అభివృద్ధి దృష్టి, దిశ, సంకల్పం లోపించింది. బలమైన సాంకేతిక మౌలిక వసతులు, ప్రపంచస్థాయి ప్రతిభ, చురుకైన ప్రైవేట్ రంగం ఉన్నా, హైదరాబాద్ స్టార్టప్ రంగంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ స్థాయికి చేరుకోలేకపోయింది. మొన్నటి వరకు జోష్ మీద కనిపించిన రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు నేడు స్తంభించిపోయాయి. వాటిపై ఆధారపడిన కార్మికుల జీవితాల్లో అనిశ్చితి నెలకొంది.
ఈ నేపథ్యంలో కేంద్రం నిర్మించిన ఆస్తుల ప్రాధాన్యం స్పష్టమవుతోంది. రూ.6300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. అదనంగా మరో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం జోడించబడుతోంది. ఇలాంటివి రాష్ట్ర ఇంధన పారిశ్రామిక భద్రతకు వెన్నెముకగా నిలిచాయి.
ఇవి ఎన్నికల నినాదాలు కావు. పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, ఉద్యోగాలు, దీర్ఘకాలిక అభివృద్ధి సామర్థ్యాలు. అందుకే నేటి మోదీ తెలంగాణ పర్యటనను తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలను జాతీయ ప్రాజెక్టులుగా, స్పష్టమైన ఫలితాలుగా మార్చడంలో తదుపరి అధ్యాయంగా చూడాలి. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది విమర్శలు, ఆరోపణలు కాదు, అభివృద్ధిలో పోటీ. మోదీ ప్రతి పర్యటన ఒక స్పష్టమైన సందేశాన్నిస్తోంది: ‘‘మాటల కంటే మౌలిక వసతులు.. భావోద్వేగాల కంటే పెట్టుబడులు.. కుటుంబ పాలన కంటే జవాబుదారీ పాలన.’’ ఇవే రాష్ట్ర అభివృద్ధికి సోపానాలు.
కేంద్రం ఇంత చేస్తున్నప్పుడు, రాష్ట్రం పూర్తి సహకారంతో ముందుకొస్తే తెలంగాణ ఎంత వేగంగా ఎదగగలదో ఊహించడం కష్టం కాదు. ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం అనేది కేవలం నినాదం కాదు, అది అభివృద్ధి అమలుకు అవసరమైన పరిపాలనా తర్కం. సాకుల దశను దాటి, సాధన దశలోకి అడుగు పెట్టాలి. మోదీ పర్యటన ఆ చారిత్రాత్మక మార్పుకు బలమైన పునాది.
- ఎన్. రామచందర్ రావు
అధ్యక్షులు, తెలంగాణ బీజేపీ