Share News

మోదీ దూకుడును అడ్డుకునేదెవరు?

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:13 AM

తిరుగులేని అధికారం చలాయిస్తున్న ప్రధానమంత్రి ఉంటే సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రయోజనాలు సమకూరుతాయనడంలో సందేహం లేదు. ఈ ఏకఛత్రాధిపత్యం వల్ల వచ్చే నష్టాలు ప్రస్తుతం చర్చనీయాంశం కాదు కానీ..

మోదీ దూకుడును అడ్డుకునేదెవరు?

తిరుగులేని అధికారం చలాయిస్తున్న ప్రధానమంత్రి ఉంటే సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రయోజనాలు సమకూరుతాయనడంలో సందేహం లేదు. ఈ ఏకఛత్రాధిపత్యం వల్ల వచ్చే నష్టాలు ప్రస్తుతం చర్చనీయాంశం కాదు కానీ, ఉన్నట్లుండి చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమైన ఘట్టంగా భావించక తప్పదు. దీని వల్ల దేశవ్యాప్తంగా చట్ట సభలు మహిళలతో కళకళలాడక తప్పదు. మహిళా చైతన్యానికీ, సాధికారతకు ఇది దోహదం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా బడ్జెట్ సమా వేశాలను పొడిగించి మరీ మధ్యలో ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకు? ఎన్నికలయిన తర్వాత సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు కదా? అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి చర్చించవచ్చు కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నించడం సహేతుకమే. అయితే గతంలో సర్వం సహా అధికారం చలాయించిన వారు ఇప్పుడు మోదీ ప్రవర్తించిన తీరులోనే వ్యవహరించిన దాఖలాలు లేకపోలేదు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఇదే విధంగా ప్రవర్తించారు. 1959లో నెహ్రూ కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా చేసేందుకు రాజీవ్‌గాంధీ ముస్లిం మహిళల చట్టాన్ని తీసుకువచ్చారు. అందువల్ల మోదీ కూడా ప్రధానిగా తనకున్న అధికారాలను ఉపయోగించుకుని మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందిగా హుకుం జారీ చేయడంలో తప్పేమిటని బీజేపీ నేతలు ప్రశ్నించడానికి ఆస్కారం ఉన్నది. ప్రధాని అధికారాల విషయంలో ప్రతిపక్షాలది అరణ్య రోదన మినహా మరేమీ కాదు.


ఇక రాజకీయాల మాటకొస్తే అవకాశం ఉంటే ఏ పార్టీ రాజకీయాలు చేయదు? ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో మహిళల మద్దతును పెద్ద ఎత్తున పొందేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మోదీ భావిస్తున్నారు. దేశంలో 50 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా, 47 కోట్లకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. గడచిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని చూస్తే ప్రతిసారీ పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారు. పైగా ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఆ ఓటర్లు పెద్ద సంఖ్యలో అధికార పార్టీకి ఓటు వేశారని తేలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఇదే విధంగా అధికార పార్టీ మహిళలను ఆకట్టుకుంటే, ఇటీవల ఎన్నికలు జరిగిన అస్సాంలో కూడా అన్ని వర్గాల మహిళలకు ఇతోధికంగా నిధుల పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలే మహిళలను ఆకట్టుకుంటున్నప్పుడు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తే ఇంకెంత రాజకీయ ప్రయోజనం ఉంటుందో అని మోదీ భావించడంలో ఆశ్చర్యం లేదు. త్రిపుల్ తలాఖ్ రద్దు వల్ల ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలు ఈ బిల్లును అడ్డుకుంటే కూడా రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ బిల్లు పేరుతో మహిళలను సమీకరించేందుకు బీజేపీ నేతలు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు మొదలుపెట్టారు.


మోదీ వరకొస్తే ఎన్నికల మధ్యలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపడం పెద్ద విషయం కాదు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటున్న అస్సాంలో ఎన్నికలు జరగనే జరిగాయి. పుదుచ్చేరిలో కూడా కూటమి అధికారంలోకి వచ్చేందుకే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని బృహత్తర విన్యాసాలు చేసినా కేరళలో ఓట్ల శాతం పెంచుకోవడం తప్ప బీజేపీకి పెద్దగా ఒరిగేది లేదు. ఇక మహిళా రిజర్వేషన్ మూలంగా పశ్చిమబెంగాల్లో కొంత మేరకు మహిళలను తమ వైపునకు తిప్పుకునే అవకాశం లేకపోలేదు. ఆ రాష్ట్రంలో బీజేపీ గణనీయ ఫలితాలు సాధిస్తే మహిళా ఓటర్లు తమకు భారీగా మద్దతిచ్చారని ఆ పార్టీ ప్రకటించవచ్చు. పైగా ఎన్నికలు జరగాల్సిన తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 67 మంది ప్రతిపక్షాల ఎంపీలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటే వారి దృష్టిని ఎన్నికల నుంచి ఎంతో కొంత మళ్లించినట్లవుతుంది. ఇక పశ్చిమాసియా పర్యవసానాల నుంచి చర్చను మళ్లించేందుకు కూడా ఈ సమావేశాలు ఉపయోగపడతాయి. ఎటుతిరిగీ ఈ సమావేశాల మూలంగా ఫాయిదా మోదీ సర్కార్‌కే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.


‘ఆకాశంలో సగం నీవు, అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు, సగం నేను’ అన్న కవిత వినడానికి బాగానే ఉంటుంది కానీ, నిజానికి ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు అలంకారప్రాయంగా మహిళా విభాగాలు ఏర్పాటు చేయడం మినహా వారికి రాజకీయ ప్రాతినిధ్యం న్యాయంగా కల్పించిన దాఖలాలు లేవు. లోక్‌సభలో 1999లో మహిళా సభ్యుల సంఖ్య 9 శాతం ఉంటే అది క్రమంగా పెరుగుతూ 14 శాతానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రజా ప్రతినిధుల సగటు శాతం 26.5 కంటే ఇది ఎంతో తక్కువ. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాజీవ్‌గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది కానీ రాజ్యసభలో ఆమోదం పొందలేదు. పీవీ నరసింహారావు హయాంలో కానీ రాజ్యాంగంలోని 72, 73 చట్టసవరణల ద్వారా స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్ మహిళలకు లభించలేదు. చట్టసభల్లో మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ తిరస్కరించిన తర్వాత గీతాముఖర్జీ నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. అయితే ఆ లోక్‌సభ రద్దు కావడంతో బిల్లుకు కాలం చెల్లింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో మళ్లీ ఈ బిల్లును చర్చకు పెట్టేందుకు పలుమార్లు యత్నించారు కానీ సఫలీకృతం కాలేదు. సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పటికీ యూపీఏ హయాంలో బిల్లును ఆమోదించేందుకు యత్నాలు నత్తనడకన సాగాయి. 2010లో రాజ్యసభలో ఆమోదించినప్పటికీ 2014లో లోక్‌సభ రద్దయ్యే వరకూ దాన్ని ప్రవేశపెట్టకపోవడంతో మళ్లీ కాలం చెల్లింది. ఈ బిల్లును ఆమోదించాలని బీజేపీ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ గట్టిగా వాదించారు కానీ ఓబీసీ, మైనారిటీ, దళిత, ఆదివాసీలకు కూడా కోటా కల్పించాలని సమాజ్‌వాది పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, జనతాదళ్ నేత శరద్ యాదవ్ వాదించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే జుట్టు కత్తిరించుకున్నవారు, పట్టణాల్లో నివసించే మహిళలు చట్టసభల్లో ప్రవేశిస్తారని శరద్ యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను పక్కన పెట్టి మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకుగాను ఆగమేఘాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినందుకు మోదీ దూకుడును ఎందుకు వ్యతిరేకించాలి?


ఈ దేశంలో ఎవరికీ న్యాయ సమ్మతంగా వారికి దక్కాల్సింది దక్కదు. దళితులకు, ఆదివాసీలకు రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించకపోతే బహుశా వారికి కూడా సీట్లు కేటాయించేవారు కాదేమో. బీసీలు కూడా చాలాకాలంగా తమకు సామాజిక న్యాయం కావాలని పోరాడుతున్నా వారికి దక్కాల్సిన వాటా దక్కడం లేదు. అలాగే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల విషయాన్ని చూడండి. స్వాతంత్ర్యం తర్వాత 268 మంది న్యాయమూర్తులు ఉంటే వారిలో మహిళలు ఇప్పటి వరకూ కేవలం 11 మంది మాత్రమే! స్వాతంత్ర్యం తర్వాత 39 సంవత్సరాలకు గానీ తొలి మహిళా న్యాయమూర్తిని నియమించలేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఎనిమిది దశాబ్దాలకు 2027లో ఒక మహిళ ప్రప్రథమంగా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. అది కూడా ఆమె 36 రోజులు మాత్రమే ఆ అత్యున్నత పదవిలో ఉంటారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాక మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో!


2029 సార్వత్రక ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కు పెంచాలని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల ప్రకారమే 1952లో, అనంతరమూ లోక్‌సభ సీట్లను పెంచారు. ఆ తర్వాత ఆ సీట్ల సంఖ్యను పెంచకుండా స్తంభింపజేశారు. తొలుత 2026 జనాభా లెక్కల ప్రకారం సీట్లను పెంచాలనుకున్నారు. అయితే ఇప్పుడు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని లోక్‌సభ సీట్లను 850కు పెంచాలని నిర్ణయించారు. ఈ పెంపుదలలో శాస్త్రీయత లేదని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలు విమర్శిన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య సీట్ల విషయంలో అగాధం పెరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఒక్క ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్‌లో చక్రం తిప్పితే చాలు, బీజేపీకి సునాయాసంగా 330కి పైగా సీట్లు లభిస్తాయి. ఇక ఇతర చోట్ల, స్వంతంగా, పొత్తులు పెట్టుకుని మరో వంద సీట్లు సాధిస్తే ఆ పార్టీకి తిరుగుండదని, అప్పుడు బీజేపీయేతర రాష్ట్రాలను పట్టించుకునే నాథుడే ఉండడని ప్రతిపక్ష శిబిరంలో కొందరు వాపోతున్నారు. సమాఖ్య స్ఫూర్తికి వాటిల్లనున్న ప్రమాదంపై డీఎంకే అధినేత స్టాలిన్ ఇప్పటికే తుది హెచ్చరిక జారీ చేశారు. ఏమైనా మహిళా రిజర్వేషన్ల కంటే డీలిమిటేషన్ విషయమే పార్లమెంటును రణరంగంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఈ దేశంలో కీలక నిర్ణయాలను సామరస్యపూర్వకంగా, సంప్రదింపులతో తీసుకునే అవకాశాలేవీ లేవా? ప్రతి నిర్ణయాన్ని బుల్డోజింగ్ ద్వారా అమలు చేయాలనుకోవడం సరైనదేనా?

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Apr 15 , 2026 | 04:16 AM