ఎవరిదీ నిధి?
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:12 AM
నిరుపయోగంగా ఉన్న పీఎంకేర్స్ నిధులను స్కూళ్ళు కట్టడానికి వాడవచ్చు కదా అని ‘కాక్రోచ్’ నాయకుడు అభిజిత్ దీప్కే అన్నందుకు బీజేపీ నాయకులకు కోపం వచ్చింది.
నిరుపయోగంగా ఉన్న పీఎంకేర్స్ నిధులను స్కూళ్ళు కట్టడానికి వాడవచ్చు కదా అని ‘కాక్రోచ్’ నాయకుడు అభిజిత్ దీప్కే అన్నందుకు బీజేపీ నాయకులకు కోపం వచ్చింది. 2025 మార్చి నాటికి పీఎం కేర్స్ ఫండ్ మొత్తం నిల్వ ౮,452కోట్లు కనుక, ఒక మోడల్ స్కూల్ నిర్మాణానికి రూ. 8 కోట్లు ఖర్చవుతుందని అనుకున్నా, ఆ సొమ్ముతో వెయ్యి స్కూళ్ళు కట్టవచ్చునని దీప్కే లెక్కవేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందని, అధికారులను అడిగితే నిధుల కొరత అంటున్నారని, అందువల్ల, వాడకుండా మురగబెడుతున్న పీఎం కేర్స్ ఫండ్‌ను వాటి అభివృద్ధికి వాడవచ్చునని దీప్కే వాదన. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఈ పోస్టుతో పాటు, దుర్భరమైన స్థితిలో ఉన్న కొన్ని ప్రభుత్వపాఠశాలల చిత్రాలను కూడా ఉంచి, ప్రభుత్వ విద్య కూడా నేషనల్ ఎమర్జెన్సీయే అంటూ రాశారు. ‘స్కూల్ ఠీక్ కరో’ పేరిట సీజేపీ సరికొత్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన నేపథ్యంలో, పీఎంకేర్స్ నిధులమీద రేగిన వివాదాన్ని ఆయన తన ఉద్యమంతో ముడిపెట్టినందుకు బీజేపీ నాయకులకు ఆగ్రహం కలిగినట్టుంది. కేజ్రీవాల్ తన శిష్యుడికి నాటకీయంగా వ్యవహరించడం నేర్పారు తప్ప, ప్రాథమిక విషయాలపట్ల అవగాహన కల్పించలేదంటూ, ఆ నిధులు అత్యవసర, విపత్తుసాయం కోసం మాత్రమేనని వారు విమర్శలు చేశారు.
దీప్కే మీద బీజేపీ నాయకుల విమర్శలను అటుంచితే, పీఎం కేర్స్ విరాళాలను ఎఫ్‌డీల రూపంలో దాచి, ఆ నిధులను ఉపయోగించకుండా వదిలేయడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు కచ్చితంగా జవాబు ఉండాల్సిందే. కరోనాకాలంలో ఆపన్నులను ఆదుకొనేందుకు ఆరంభమైన పీఎం కేర్స్ నిధులవాడకం ప్రకటిత లక్ష్యానికి అనుగుణంగా జరగనేలేదన్న సత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా నేతృత్వం వహించే పీఎం కేర్స్ ఫండ్ ఒక రహస్యనిధిగా మిగిలిపోవడం కూడా రచ్చకు కారణం. తాజా ఆడిట్ నివేదిక ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్‌నుంచి 85లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. దీనిముందు ఏడాది ఖర్చుచేసిన పదిహేనున్నరకోట్లతో పోల్చితే ఇది అత్యల్పం. 202౨–23 ఆర్థికసంవత్సరంలో ఇది 346కోట్లు కనుక ఏడాదికేడాది వ్యయం వేగంగా తగ్గిపోతూవచ్చిందని అర్థం. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలను ఈ నిధులు ఉపయోగిస్తామని చెప్పినప్పటికీ, దాని ప్రకారం 2024–25లో మూడున్నరవేలమంది పిల్లలకు ఏటా 20వేల రూపాయల చొప్పున సాయం అందాలని, కానీ, ఆ ఏడు మొత్తం వ్యయం 87 లక్షలే చూపుతున్నందున అది కూడా సక్రమంగా జరగలేదనో, లెక్కకు చిక్కడం లేదనో కొందరి అనుమానం. సుమారు పదివేలమంది పిల్లలు దరఖాస్తు చేసుకుంటే అందులో సగం మాత్రమే ఆమోదించారట.
ఇక, పీఎం కేర్స్ పారదర్శకతమీద ఆదినుంచీ వివాదం ఉంది. దీప్కే అమెరికా చదువుమీద సమాచారహక్కు చట్టం కింద ఒక దరఖాస్తు దాఖలైతే, సదరు ఆర్టీఐ కార్యకర్త మా నాయకుడి చదువుమీద కంటే, పీఎంకేర్స్ మీద శ్రద్ధపెడితే దేశం బాగుపడుతుందని సీజేపీ ఓ వ్యాఖ్య చేసింది. పీఎం కేర్స్ ఆర్టీఐకు అందనిది, కాగ్ ముట్టకూడనిదని వారికి తెలియనిదేమీ కాదు. చివరకు, ఆ విరాళాల గుట్టు తెలుసుకొనే హక్కు పార్లమెంట్‌కూ, ప్రజాప్రతినిధులకూ కూడా లేకపోయింది. ఇప్పుడు విడుదలైన వివరాలు కూడా కేవలం ఒకే పేజీలో అసమగ్రంగా ఉండటం విశేషం. ఆరంభనిల్వ, ముగింపు నిల్వ, మధ్యలో విరాళాలూ వడ్డీ మొత్తాలు, చెల్లింపులే తప్ప, దాతలెవరో, గ్రహీతలెవరో అందులో ఉండవు. పీఎం కేర్స్ ఆరంభించినప్పుడు చాలా సంస్థలనుంచి విరాళాలు వసూలు చేసినందున, ఆయా కంపెనీల వివరాలు తెలియచెప్పడం ప్రభుత్వం బాధ్యత. కోవిడ్ కష్టకాలంలో జనం కదిలిపోయి మరీ విరాళాలు ఇచ్చారు. ఇదంతా ప్రజల డబ్బే కనుక దాపరికానికి తావులేదు. విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉన్నందున పీఎం కేర్స్ నిర్వచనం ప్రకారం ఆ నిధుల వాడకం కుదరకపోతే సరే. దీప్కే డిమాండ్ తప్పేనని అనుకుందాం. కానీ, ఈ ఐదేళ్ళ కాలంలో ఇతరత్రా ఏ కష్టంలోనూ, అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ పీఎం కేర్స్ ప్రజలను ఆదుకోలేదు. పౌర సహాయం నిర్వచనంలో ఉన్నదే తప్ప ఆచరణలో లేదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో ఇది ప్రజలకు పనికిరాలేదు. పీఎం కేర్స్ ప్రజలది, ప్రధానిది కాదు అని దీప్కే అన్నందుకు ఆగ్రహం కలగవచ్చు. కానీ, ప్రజలకోసం సేకరించిన డబ్బు వారికోసం వాడకుండా వదిలేయడం సరికాదు.