ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:51 AM
ఔషధం ఏ మోతాదులో తీసుకోవాలి, రోజులో ఎన్నిసార్లు వాడాలి, ఏ ఆహారంతో కలిపి తీసుకోకూడదు, దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి... అనే జ్ఞానాన్ని అందించడంలో ఫార్మసిస్టు పాత్ర అపారమైనది.
ఔషధం ఏ మోతాదులో తీసుకోవాలి, రోజులో ఎన్నిసార్లు వాడాలి, ఏ ఆహారంతో కలిపి తీసుకోకూడదు, దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి... అనే జ్ఞానాన్ని అందించడంలో ఫార్మసిస్టు పాత్ర అపారమైనది. క్లినికల్ ట్రయల్స్ నుంచి సమాజంలోని ప్రతి వ్యక్తికి ఆ మందు చేరేవరకు ప్రతిదశలోనూ ఫార్మసిస్ట్‌లు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్న సంక్షోభాల్లో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (AMR) అత్యంత ప్రమాదకరమైనది. చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా డాక్టర్ సలహా లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల, వ్యాధి కారక క్రిములు ఆ మందులను తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి. ప్రతి ఏటా పెరుగుతున్న ఈ తీవ్ర ముప్పును అరికట్టడంలో ఫార్మసిస్టులు ప్రజా రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. వైద్యుడి ఆమోదం లేనిదే యాంటీబయోటిక్స్ అందించకూడదనే నిబంధనలను పాటించడంతో పాటు, మందుల కోర్సును రోగులు మధ్యలోనే ఆపకుండా వాడేలా అవగాహన కల్పించడంలో వీరు క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. నేడు గ్రామీణ ఉపకేంద్రాల్లోనూ మందుల పంపిణీ పరిధి విస్తరిస్తున్నందున, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అక్కడ కూడా నూతనంగా ఫార్మసిస్ట్ పోస్టులను మంజూరు చేయాలి. డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ ఫార్మా గ్రాడ్యుయేట్లకు సొంతంగా ఫార్మసీ కేంద్రాలను స్థాపించుకోవడానికి వడ్డీలేని రుణాలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. కమ్యూనిటీ హెల్త్ నెట్‌వర్క్‌లలో ఫార్మసిస్టులకు తగిన స్థానం కల్పించడం ద్వారానే నూతన ఔషధ పరిశోధనల్లో, నాణ్యతా నియంత్రణలో భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదగగలదు.
- యండి. ఉస్మాన్‌ఖాన్