ప్రజాశ్రేయస్సే పరమావధి
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:41 AM
రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు ఎన్నికల్లో గెలుపోటములకు పరిమితం కావు. అవి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న విశ్వాసానికి, సామాజిక న్యాయ పోరాటానికి, చెరిగిపోని ఒక ఆశయానికి ప్రతీకలుగా నిలుస్తాయి...
రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు ఎన్నికల్లో గెలుపోటములకు పరిమితం కావు. అవి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న విశ్వాసానికి, సామాజిక న్యాయ పోరాటానికి, చెరిగిపోని ఒక ఆశయానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి ఒక రాజకీయ ప్రభంజనమే జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. వెండితెరపై కోట్లాది మంది అభిమానాన్ని చూరగొని, అగ్రస్థానంలో ఉన్నవారెవరైనా తమ ప్రజాదరణను ఆధారం చేసుకుని పదవుల కోసం రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ సకల సౌఖ్యాలను, సురక్షితమైన జీవితాన్ని వదులుకుని... పేద ప్రజల కష్టాలను తీర్చడానికి కంటకప్రాయమైన బాటను ఎంచుకున్నారు.
2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సులో ‘ప్రశ్నించే గొంతుకగా నిలవడానికే రాజకీయాల్లోకి వచ్చా’నని ఆయన ప్రకటిస్తే, తెలుగు నేల పులకించిపోయింది. రాజకీయాలను స్వార్థానికి వాడుకోకపోవడం అనేదానికి పవన్ కల్యాణ్ నిలువెత్తు నిదర్శనం. 2014 ఎన్నికల్లో నవ్యాంధ్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర స్థిరత్వం కోసం కూటమి విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు. విడిపోయిన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని భావించిన ఆయన, ఏ పదవులనూ ఆశించకుండా తన నిస్వార్థ వైఖరిని చాటుకున్నారు. 2019–2024 మధ్యకాలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. వైఎస్సార్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై, అరాచక పాలనపై పవన్ కల్యాణ్ రాజీలేని పోరాటం చేశారు. 2019 ఎన్నికల ఫలితాలు ఆయనను కుంగదీయలేదు. కుటుంబాన్ని, ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడానికి వైఎస్సార్సీపీ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా రాష్ట్ర శ్రేయస్సు కోసం భరించారు. వారాహి రథమెక్కి రాష్ట్రమంతటా పర్యటిస్తూ వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగట్టారు. విశాఖపట్నం పర్యటనలో ఆయనను హోటల్ గదికి పరిమితం చేసి నిర్బంధించినా, వేధింపులను లెక్కచేయకుండా ప్రజా చైతన్యాన్ని రగిలించారు.
ఈ సుదీర్ఘ పోరాట ప్రయాణంలో కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా ‘సకల జనులు బాగుండాలి’ అనే ఉదార తపనతో ఆయన పరితపించారు. పార్టీ శ్రేణులను, నాయకులను స్పష్టమైన లక్ష్యం వైపు నడిపిస్తూ పార్టీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకోలేదాయన. వ్యక్తిగత, పార్టీ స్వార్థాల కన్నా ప్రజాస్వామ్య విలువల రక్షణే ముఖ్యమని నమ్మారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయటే పొత్తు ప్రకటన చేసి రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి ఉన్న ప్రజాదరణ దృష్ట్యా ఇంకా ఎక్కువ సీట్లు అడగవచ్చు. కానీ, ‘కూటమి ధర్మం’ కోసం సీట్ల సర్దుబాటులో అసమానమైన త్యాగం చేశారు. నేషన్ ఫస్ట్... పార్టీ నెక్స్ట్... పర్సన్ లాస్ట్ అనే విప్లవాత్మక సిద్ధాంతాన్ని వేదికలపై పవన్ కల్యాణ్ చెప్పడమే కాదు, ఆచరణలో చూపిస్తున్నారు. ఆయన చూపిన విశ్వసనీయతకు, నిస్వార్థ రాజకీయాలకు 2024 ఎన్నికల ఫలితాలు సాక్ష్యం. జనసేన పోటీ చేసిన 21 శాసనసభ స్థానాల్లో అన్ని స్థానాలనూ గెలుచుకోవడమేగాక, రెండు లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధించి నూరు శాతం స్ట్రైక్ రేట్‌తో దేశ రాజకీయ చరిత్రలోనే అపూర్వమైన రికార్డు సృష్టించింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ–పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ తన పాలనాదక్షతను రుజువు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామానికీ తాగునీరు అందించడం, పంచాయతీ వ్యవస్థలకు పూర్వవైభవం తీసుకురావడం, అడవులు–పర్యావరణ పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మరోవైపు భారతీయ మూలాలను కాపాడుకోవడంలో భాగమైన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన తీసుకుంటున్న చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి రాష్ట్రాన్ని మార్చే ‘కింగ్ మేకర్’ పాత్రను విజయవంతంగా పోషిస్తూనే ఉంది. పార్టీ భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండబోతోంది. అధికారం సాధించడంలో రక్తం చిందించి, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తల, నాయకుల త్యాగాలను పవన్ కల్యాణ్ ఎన్నటికీ మరచిపోరు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలకు, నాయకులకు తగిన ప్రాధాన్యం ఇచ్చి, వారి త్యాగాలకు గుర్తింపునివ్వడానికి ఒక స్పష్టమైన కార్యాచరణతో పవన్ ముందుకు సాగుతున్నారు. నేడు పవన్ కల్యాణ్ మరొక వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా... కోట్లాది ప్రజల, రైతు సోదరుల, మహిళల, జనసైనికుల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలి. వ్యక్తుల కన్నా, పదవుల కన్నా దేశం, రాష్ట్రం, ధర్మం ముఖ్యమని నమ్మి జీవిస్తున్న పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు తెలుగు జాతికి దిశానిర్దేశం చేసే వెలుగులా నిలవాలి.
లింగమనేని రమేశ్
రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..