పార్ట్‌టైం స్వీపర్లను ఆదుకోవాలి
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:05 AM
1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. దీని పరిధిలోని గ్రామాలలో ఆనాడు విద్యనందించుటకు ఒక ఉపాధ్యాయుడిని, విద్యార్థులకు తాగునీరు ఏర్పాటు చేయడానికి, బడిగంట కొట్టడానికి ఒక స్వీపర్‌ను ఏర్పాటు చేశారు.
1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. దీని పరిధిలోని గ్రామాలలో ఆనాడు విద్యనందించుటకు ఒక ఉపాధ్యాయుడిని, విద్యార్థులకు తాగునీరు ఏర్పాటు చేయడానికి, బడిగంట కొట్టడానికి ఒక స్వీపర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఎన్నో మారాయి. కానీ నాటి నుంచి నేటి వరకు పార్ట్‌టైం స్వీపర్ల జీవితాలు మాత్రం మారలేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులు రాకముందే పాఠశాలకు చేరుకుని, గదులు ఊడ్చి, విద్యార్థులకు తాగునీరు ఏర్పాటు చేసి, బడిగంట కొడతారు స్వీపర్లు. పిల్లల మధ్యాహ్న భోజనం పూర్తయిన తర్వాత, పోగైన చెత్తను తీసిపారేసి, భోజనశాలను శుభ్రం చేస్తారు. ఉపాధ్యాయులకు టీ, కాఫీలు అందించడం, అనంతరం ఆయా పాత్రలను శుభ్రం చేయడం, సాయంత్రం మళ్లీ చివరి బడిగంట కొట్టడం, అందరూ వెళ్లిన తర్వాత పాఠశాలకు తాళం వేయడంతో స్వీపర్ల రోజువారీ పని పూర్తవుతుంది. ఇవేగాక ఇంకా పాఠశాలకు సంబంధించిన ఎన్నో అదనపు విధులను పార్ట్‌టైం స్వీపర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. పేరుకే ఇది పార్ట్ టైం పని అయినా, స్వీపర్లు రోజంతా పాఠశాలలో ఫుల్ టైం పని చేయాల్సి ఉంటుంది. ఇంతా చేస్తే స్వీపర్లకు అందే నెలవారీ పారితోషికం కేవలం రూ.5,200 మాత్రమే! అవి కూడా మూడు, నాలుగు నెలలకోసారి మాత్రమే చేతికందుతాయి. నిత్యావసర ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఈ అరకొర వేతనాలతో స్వీపర్లు తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. పాఠశాలల్లో పనిచేసే మా పార్ట్ టైం స్వీపర్ల వేతనాలు పెంచాలి. పెంచిన వేతనాలను ప్రతి నెలా క్రమం తప్పక చెల్లించాలి. వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి. స్వీపర్ల విద్యార్హతలకనుగుణంగా అటెండర్ లేదా వాచ్‌మెన్‌గా ప్రమోషన్లు కల్పించాలి. వారికి హెల్త్‌కార్డులు, రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. స్వీపర్ల కుటుంబాలకూ కారుణ్య నియామకాలు వర్తింపజేయాలి.
- పానుంటి నాగయ్య
ప్రభుత్వ పాఠశాలల పార్ట్‌టైం స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు