Share News

పాన్‌ ఐఐటీ.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇన్నోవేషన్‌ ఇంజిన్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:17 AM

ఒక రాష్ట్రాన్ని మార్చేది కేవలం భారీ పెట్టుబడులు కాదు. ఆ పెట్టుబడులకు దారితీసే ఆలోచనలు, ఆ ఆలోచనలను ఆవిష్కరణలుగా మలిచే పరిశోధన, ఆ ఆవిష్కరణలను పరిశ్రమలుగా తీర్చిదిద్దే సమర్థ వ్యవస్థ.

పాన్‌ ఐఐటీ.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇన్నోవేషన్‌ ఇంజిన్‌

ఒక రాష్ట్రాన్ని మార్చేది కేవలం భారీ పెట్టుబడులు కాదు. ఆ పెట్టుబడులకు దారితీసే ఆలోచనలు, ఆ ఆలోచనలను ఆవిష్కరణలుగా మలిచే పరిశోధన, ఆ ఆవిష్కరణలను పరిశ్రమలుగా తీర్చిదిద్దే సమర్థ వ్యవస్థ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న ప్రస్తుత సమయంలో ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది కేవలం సహజ వనరులు మాత్రమే కాదు.. జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత, ఆవిష్కరణ సామర్థ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రయాణంలో పాన్‌ ఐఐటీ వంటి మేధో వేదికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

నేడు విజయవాడలో జరగనున్న పాన్‌ ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌ ఈ దిశగా ఒక ముఖ్యమైన ప్రయత్నం. దేశ విదేశాల్లో ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, పాలసీ రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. వారి అనుభవం, పరిజ్ఞానం, పరిచయాలు, పెట్టుబడి సామర్థ్యాన్ని ఏపీ అభివృద్ధికి అనుసంధానం చేయడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించవచ్చు.

అమెరికాలో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం చుట్టూ ఏర్పడిన పరిశోధన, పరిశ్రమ వాతావరణం సిలికాన్‌ వ్యాలీకి బలమైన పునాది వేసింది. జర్మనీలోని ఫ్రాన్‌హోఫర్‌ సంస్థలు పరిశోధనను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేసి సాంకేతికతను వాణిజ్యీకరణ దిశగా తీసుకెళ్తున్నాయి. ఇజ్రాయెల్‌ స్టార్టప్‌ వ్యవస్థ, సింగపూర్‌ పరిశోధన– పరిశ్రమ అనుసంధానం, తైవాన్‌ సెమీకండక్టర్‌ పర్యావరణం కూడా నాలెడ్జ్‌ ఆర్థిక శక్తిగా ఎలా మారుతుందో చూపిస్తున్నాయి.


ఈ నమూనాల నుంచి రాష్ట్రం నేర్చుకోవాల్సిన ప్రధాన విషయం ఒక్కటే. ప్రతిభను ఒకచోట చేర్చడం మాత్రమే కాదు.. ఆ ప్రతిభను రాష్ట్రాభివృద్ధి అవసరాలతో అనుసంధానం చేయాలి. రాష్ట్రంలోని సమస్యలకు ఐఐటీలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు కలిసి పరిష్కారాలు చూపే విధానం రావాలి. కొత్త ఆలోచనలు ప్రోటోటైప్‌లుగా మారాలి. ప్రోటోటైప్‌లు స్టార్టప్‌లుగా మారాలి. స్టార్టప్‌లకు పెట్టుబడులు రావాలి. అవి పరిశ్రమలుగా ఎదిగి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి, ఉత్పాదకత చివరకు... రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బాట వేయాలి అనే వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడాలి. ఇదే నిజమైన ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌.

దేశం కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియా ఏఐ మిషన్‌, నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌, రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ వంటి కార్యక్రమాల ద్వారా కృత్రిమ మేధస్సు, క్వాంటమ్‌, డీప్‌టెక్‌, రోబోటిక్స్‌, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌ వంటి రంగాల్లో పరిశోధన, ప్రైవేట్‌ పెట్టుబడులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ జాతీయ అవకాశాలను రాష్ట్ర అవసరాలతో అనుసంధానం చేసుకోవడం కీలకం. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏఐ, క్వాంటమ్‌ రంగాలకు ప్రత్యేక యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుకు ఎన్‌ఐఈఎల్‌ఐటీ, రాష్ట్రం మధ్య జరిగిన ఒప్పందం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఏఐ/ఎంఎల్‌, సైబర్‌ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌, ఏఐ–క్వాంటమ్‌ రీసెర్చ్‌, ఇండస్ట్రీ లింక్‌డ్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, డీప్‌టెక్‌ ఇంక్యుబేషన్‌ వంటి రంగాలను ఒకే పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచన భవిష్యత్‌ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఉంది. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో ఐబీఎంతో భాగస్వామ్యం, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు కూడా ఈ దిశలోనే ఉన్నాయి.


అయితే ఇలాంటి ప్రాజెక్టులు, సంస్థలు ఏర్పడితేనే సరిపోదు. వాటి చుట్టూ పరిశోధన, పెట్టుబడి, పరిశ్రమ, స్టార్టప్‌ వ్యవస్థ ఏర్పడాలి. ఒక ఆలోచనకు నిధులు దొరకాలి. ఒక పరిశోధనకు పరిశ్రమ భాగస్వామ్యం కావాలి. ఒక స్టార్టప్‌కు మార్కెట్‌ దొరకాలి. ఒక విద్యార్థికి ప్రపంచస్థాయి మెంటార్‌ లభించాలి. ఒక పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలి. అప్పుడే మేధస్సు ఆర్థిక విలువగా మారుతుంది. పాన్‌ ఐఐటీని ఈ మొత్తం వ్యవస్థకు అనుసంధానించే వేదికగా మలచాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఏడాదికి ఒకసారి జరిగే సదస్సుగా కాకుండా, పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌, గ్లోబల్‌ ఐఐటీ మెంటార్‌ నెట్‌వర్క్‌, డీప్‌టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ పరిశ్రమలతో అనుసంధానమైన పరిశోధన కేంద్రాలు వంటి శాశ్వత వ్యవస్థలు ఏర్పడితే దాని ప్రభావం మరింత విస్తరించవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని వివిధ రంగాలకు ఈ మేధోశక్తిని అనుసంధానం చేయవచ్చు.

ప్రపంచం ఇప్పుడు ఏఐ, క్వాంటమ్‌, సెమీ కండక్టర్స్‌, రోబోటిక్స్‌, బయోటెక్నాలజీ, స్పేస్‌టెక్‌, గ్రీన్‌ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త పోటీని చూస్తోంది. రేపటి ఆర్థిక శక్తి ఈ సాంకేతిక రంగాల్లోనే రూపుదిద్దుకోనుంది. ఈ పోటీలో నిలబడాలంటే భౌతిక మౌలిక వసతులతో పాటు మేధో మౌలిక వసతులు కూడా నిర్మించాలి. పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువత నైపుణ్యాలను పెంచాలి. ఆవిష్కరణలకు పెట్టుబడులు అందించాలి. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య దూరాన్ని తగ్గించాలి. అందుకే పాన్‌ ఐఐటీని మరో సదస్సుగా చూడకూడదు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా జ్ఞానాధారిత, సాంకేతికంగా శక్తిమంతమైన, ఆవిష్కరణలకు నిలయమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దీర్ఘకాలిక వేదికగా మలచాలి. ప్రపంచ ఐఐటీ మేధస్సును రాష్ట్ర భవిష్యత్తుతో అనుసంధానం చేయగలిగితే.. పాన్‌ ఐఐటీ ఒక కార్యక్రమంగా కాక, రాష్ట్ర భవిష్యత్తును నడిపించే ఇన్నోవేషన్‌ ఇంజిన్‌గా రూపుదిద్దుకుంటుంది.

- సి.వి. శ్రీధర్

డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్‌ మిషన్

Updated Date - Oct 03 , 2026 | 12:19 AM