Share News

నీళ్ల కోసం పాలమూరు పోరుబాట

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:59 AM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటి వాటా సమస్య చాలా కాలంగా చర్చలో ఉన్నా, గత రెండు మూడు మాసాలుగా మరింతగా ఊపందుకుంది. ముఖ్యమంత్రితో సహా చాలామంది మంత్రులు ఈ సమస్య గురించి మాట్లాడుతున్నారు.

నీళ్ల కోసం పాలమూరు పోరుబాట

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటి వాటా సమస్య చాలా కాలంగా చర్చలో ఉన్నా, గత రెండు మూడు మాసాలుగా మరింతగా ఊపందుకుంది. ముఖ్యమంత్రితో సహా చాలామంది మంత్రులు ఈ సమస్య గురించి మాట్లాడుతున్నారు. బహుశా మొదటిసారి జిల్లాకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా ముఖ్యమంత్రిని కలిసి తమ జిల్లా నీటి సమస్య గురించి మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం కొంత కదిలింది. ఈ సమస్యకు ప్రాధాన్యం ఉంటుందని, పరిష్కారం వస్తుందని మాట్లాడుతున్నారు. అయితే ప్రజలెవ్వరూ ఈ మాటలను పూర్తిగా విశ్వసించడం లేదు. దానికి కారణం గతంలో కూడా ఇలాంటి వాగ్దానాలు చేసినా సమస్య పరిష్కారం దిశగా సాగలేదు.

తెలంగాణలో మూడు ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఈ ఉద్యమాలన్నింటిలో నీళ్ల పంపిణీ ఒక సమస్యగా ముందుకు వచ్చింది. జయశంకర్‌ రూపొందించిన ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు’’ తెలంగాణ ఉద్యమానికి ఒక స్థాయిలో దాని దిశను కల్పించింది.

తెలంగాణ ఉద్యమంలో పాలమూరు నీళ్ల సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. చర్చ ఎక్కడ జరిగినా, తెలంగాణ వెనుకబాటుతనాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా కరువులు, వలసలు, ఆత్మహత్యలు ప్రచారంలో భాగమవ్వడమే కాక ‘రాష్ట్ర విభజన ఎందుకు?’ అన్న ప్రశ్నకు పాలమూరు వెనుకబాటుతనం ఒక బలమైన ఆయుధంగా ఉద్యమం వాడుకున్నది.


పాలమూరు జిల్లాకు నీళ్లలో న్యాయమైన వాటా రాలేదని రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి అడగగా.. ‘కృష్ణానది నీళ్ల వాటా ముగిసిన అంశం. ఆ సమస్యను మళ్లీ లేవదీయడం అనవసరం’ అని ఆయన కచ్చితంగా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే న్యాయం కోసం పోరాడవచ్చు అని అంతకాలం అనుకున్న మేము ఆ మాటలు విన్నాక... తెలంగాణ విడిపోవడం తప్ప వేరే మార్గం లేదనే నిర్ణయానికి వచ్చాం. అదే మాట ఆయనతో చెబితే ‘ఉద్యమంలో పాల్గొనండి. మిమ్మల్ని ఎవరు ఆపారు’ అన్నారు.

గతంలో వలే కాకుండా ఈసారి తెలంగాణ ఉద్యమం రాజీలేని పోరాటం చేసింది. సకల జనులంతా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని గురించి పెద్ద ఎత్తున లేవదీశారు. సభలలో వేలాదిమంది పాల్గొన్నారు. గ్రామగ్రామానికీ ఉద్యమం పాకింది. ఏ జిల్లాలో సభలు జరిగినా పాలమూరు, ఆదిలాబాదు వెనుకబాటుతనం చర్చకు వచ్చింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సూత్ర రీత్యా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఒక జీవో కూడా తెచ్చింది. సర్వే ప్రారంభమయ్యింది. పాలమూరు ప్రజల్లో ఒక ఆశ చిగురించింది. ఈ జీవో ఉద్యమానికి దోహదపడింది. నీటిరంగంలో నిష్ణాతులు విద్యాసాగరరావు నీళ్ల గురించి మొత్తం తెలంగాణను అడ్వకేటు చేశారు. పాలమూరు నీళ్ల గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడేవారు. తీరా తెలంగాణ వచ్చాక సార్‌ను సలహాదారుగా నియమించారు. నిజానికి ఆయనను ఇరిగేషన్‌ మంత్రిగా నియమించాల్సింది. ఒక సందర్భంలో పాలమూరు జిల్లా నీటి సమస్య గురించి మాట్లాడితే తన సలహాలను ప్రభుత్వం ఎక్కువగా పట్టించుకోవడం లేదని బాధపడ్డారు. రాష్ట్రం ఏర్పడక ముందే జయశంకర్‌ మరణించడం వల్ల తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు చాలా అన్యాయం జరిగింది.


తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ మధ్యంతరంగా దానిని ఆపి, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించింది. ఒక వెనుకబడిన ప్రాంతం పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నప్పుడు, అదే ప్రమాణం మీద... వెనుకబడిన ప్రాంతంలోని మరీ వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే నిజమైన న్యాయసూత్రం. తెలంగాణలో ఏ జిల్లా బాగుపడ్డా తెలంగాణ అభివృద్ధి చెందినట్లే అని భావించేవారు చాలామందే ఉన్నారు. బాధపడుతున్న వారికి తెలిసినంతగా ఈ సమస్య ఇతరులకు అర్థం కాకపోవచ్చు. పాలమూరు వలసల జీవితాలను, వాళ్లు అనుభవించిన వేదనను సానుభూతితో లేదా న్యాయ దృక్పథంతో చూస్తే తప్ప అర్థం కాదు. ఏ జిల్లాకు నీళ్లు వస్తే ఏమిటి? అన్న ప్రశ్న దశాబ్దాల కాలం పోరాటం చేస్తున్న ప్రజల కష్టాలకు జవాబు కాదు. ఆశ్చర్యంగా... జిల్లాకు అన్యాయం జరిగిందంటే, పాలమూరులో ప్రవహించే నీళ్లను డిండికి తరలించి, ఈ జిల్లా కంటే అభివృద్ధి చెందిన నల్లగొండకు నీటిని తీసుకుపోవడమేమిటి?

తెలంగాణ సాధించి దశాబ్దకాలం దాటినా, జిల్లాను పట్టించుకోకపోవడం వల్ల పాలమూరు అధ్యయన వేదిక తన శక్తి సరిపోదని జిల్లాలోని ఇతర ప్రముఖులను కలుపుకుని ఒక జేఏసీని ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నది.

తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజలు చాలా పాఠాలు నేర్చుకున్నారు. చర్చల ద్వారా, కమిషన్‌ల ద్వారా సమస్యలపై అవగాహన పెరగవచ్చు కానీ, ప్రజల ఒత్తిడి లేకుండా ప్రజల సమస్యల పరిష్కారం చేసి దూరదృష్టి కలిగిన న్యాయ భావన కలిగిన నాయకత్వం లేకపోతే ఉద్యమాలే చివరికి మిగులుతాయన్నది పెద్ద పాఠం.


అత్యంత వెనుకబడిన జిల్లాల ప్రజలు ఉద్యమించకపోతే అభివృద్ధి చెందిన వర్గాలు, ప్రాంతాల వారు రాజకీయ నిర్ణయాలలో కీలక పాత్ర నిర్వహిస్తారు. ఇంతకాలం పాలమూరు జిల్లాకు నాయకత్వం లేకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురయ్యాం అంటున్నారు. ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధి చెందిన ప్రాంత నాయకులను కాదని నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించాలి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా పాలమూరు ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. అందుకే ప్రజలు కింది స్థాయి నుంచి ఒత్తిడి చేయాలి. దాంట్లో భాగంగానే 27వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ పాదయాత్ర చేపట్టింది. ఇది ఎవ్వరినీ వ్యతిరేకించడం కాదు. తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు ప్రత్యక్షంగా అడిగే ఒక ప్రజాస్వామ్య మార్గం. కాళోజీ అన్నట్లు ‘అన్యాయాన్ని ఎదిరిస్తే నాకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నాకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు.’ పాలమూరు ఉద్యమాలకు ఈ నినాదమే ఆక్సిజన్‌.

- ప్రొ. జి. హరగోపాల్‌

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - Sep 26 , 2026 | 01:01 AM