డిండి లిఫ్టు పెద్ద మోసం!
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:09 AM
ప్రొ. హరగోపాల్ ‘నీళ్ల కోసం పాలమూరు పోరుబాట’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాస్తే (26.09.2026), ఆయన రెండు అంశాలపై తప్పుడు అభిప్రాయంతో ఉన్నారంటూ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ‘పాలమూరు ఆపి కాళేశ్వరం మొదలుపెట్టలేదు’ అని..
ప్రొ. హరగోపాల్ ‘నీళ్ల కోసం పాలమూరు పోరుబాట’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాస్తే (26.09.2026), ఆయన రెండు అంశాలపై తప్పుడు అభిప్రాయంతో ఉన్నారంటూ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ‘పాలమూరు ఆపి కాళేశ్వరం మొదలుపెట్టలేదు’ అని వివరణాత్మక వ్యాసం రాశారు (06.10.2026). కానీ ఆయన ఇచ్చిన వివరణలలో అబద్ధం మాత్రమే ఉంది.
నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి కన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని హరగోపాల్ అనడం సరికాదంటున్నారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే. కానీ నిజం స్పష్టంగానే కనిపిస్తున్నది కదా. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నీటి లభ్యత సాకుతో మరొకరి పోటీ లేని జూరాల నుంచి తప్పించి అంతర్రాష్ట్ర వివాదాలున్న శ్రీశైలంలోకి మార్చారు. అలా మార్చేదాక తెలంగాణ ఉద్యమకాలమంతా రిటైర్డ్ ఇంజినీర్ల ప్లానింగ్ శక్తిని, పాలమూరు అధ్యయన వేదిక సంవాదశక్తిని చాలా పొగిడారు. అధికారం చేతికి రాగానే తొలి వరద నీరు తీసుకుని, ఆంధ్ర జలదోపిడీని ఆపి తీరుతామన్నవి గొప్పలుగా తేలిపోయి... మళ్లీ నీటి లభ్యత నాటకం ప్రారంభించారు. ఈ నాటకానికి ముగింపు ఏమిటంటే ‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు. నీరు తరలించుకుపొ’మ్మని వైయస్ జగన్‌కు చెప్పి రాయలసీమ లిఫ్ట్‌కు తెర తీయడం. కోర్టు కేసుల నెపంతో పాలమూరు–రంగారెడ్డిని పక్కన పడేయటం.
పాలమూరు–రంగారెడ్డికి నిధుల కొరత వస్తే కాళేశ్వరం కార్పొరేషన్ నిధులు వెచ్చించారని శ్రీధర్‌రావు అన్నారు. కానీ పాలమూరు–రంగారెడ్డికి కార్పొరేషన్ పెట్టి నిధులు ఎందుకు సమీకరించలేదు? నికరజలాల విషయంలో మైనర్ ఇరిగేషన్ పేరున 45 టీఎంసీలు చూపి, వివాదం తేలకముందే గోదావరి జలాలను కూడా ఎందుకు చూపినట్టు? ఈ వివాదాలన్నీ స్థలం మార్చినందువల్ల వచ్చినవి. కాళేశ్వరం లాగా పనులు చురుకెత్తించి భీమా–కృష్ణా నదుల సంగమ స్థలం దగ్గర నుంచి వరద నీరు ఎత్తి తరలించే వ్యవస్థలు నిర్మించి ఉంటే మూడు లిఫ్టులలో ప్రాజెక్టు పూర్తయి ఉండేది, మూడేళ్ల కాలం కూడా పట్టేది కాదు.
ప్రాణహిత–చేవెళ్ల పథకం ఆదిన తుమ్మిడిహెట్టి కత్తిరించి, చివరన చేవెళ్ల కత్తిరించి అటు ఆదిలాబాద్‌ను, ఇటు రంగారెడ్డి జిల్లాను దెబ్బ కొట్టింది. పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని 70 మీటర్ల దిగువకు 100 కిలోమీటర్ల దూరానికి మార్చి, చివరన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించకుండా రంగారెడ్డి జిల్లాకే అన్యాయం చేసింది. రంగారెడ్డి జిల్లా భూములు రియల్ ఎస్టేట్ దందాకు అందిరావాలని దురుద్దేశపూరితంగా రైతుల పొట్ట కొట్టింది. సోర్స్ పాయింట్ మార్చటాన్ని లాజిక్‌లతో చెప్పగలరు కానీ గమ్యం మార్చటాన్ని ఏ లాజిక్‌తో కప్పిపెడతారు. ఈ నిజాలన్నీ శ్రీధర్‌కు తెలుసు. ఆయన పార్టీ వ్రతంలో ఉండటమే ఆయనకు సమస్య.
వెనుకబడిన పాలమూరు నీళ్లను అభివృద్ధి చెందిన నల్లగొండకు తరలించడం ఏమిటి అన్న హరగోపాల్ ప్రశ్నకు కూడా శ్రీధర్ వివరణ ఇచ్చారు. ‘శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసి నల్లగొండలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో 3.41 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతిపాదించినదే డిండి ప్రాజెక్టు’ అంటూ ఆ ప్రాజెక్టును సమర్థించారు. కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి లిఫ్టు పథకాన్ని రీడిజైన్ చేసి, శ్రీశైలంలోకి మార్చకపోతే డిండి లిఫ్ట్ వివాదం ఉండేది కాదు. పాలమూరు–రంగారెడ్డిలో కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కాలువల ద్వారా మర్రిగూడ, చింతపల్లి మండలాలకు నీరు అందేది. తెలంగాణ ఉద్యమకాలమంతా ఆంధ్ర చేసిన అన్యాయంపై చర్చించిన తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ఆ తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం ముచ్చట, అందుకు కీలకమైన మహబూబ్‌నగర్ ముచ్చట వదిలేశారు. పాలమూరు–రంగారెడ్డికి డిండి లిఫ్ట్ పేరిట ఒక జల చౌర్య పథకాన్ని తగిలించడాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్స్ ఫోరం తీవ్రంగా వ్యతిరేకించి లేఖ రాసింది. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే మహబూబ్‌నగర్ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం ఏర్పడి, ప్రాతినిధ్యాలు చేసింది. అప్పటి అధికారపక్షంలో క్యాబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు లెటర్ హెడ్‌పై 12 మంది సంతకాలతో లేఖ రాశారు. అన్ని నియోజకవర్గాలలో రైతాంగంతో ధర్నాలు జరిగాయి. ఎస్.జైపాల్‌రెడ్డి, డి.కె.అరుణ, జిల్లెల చిన్నారెడ్డి, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, సంపత్ వంటి వారు ఈ ధర్నాలలో పాల్గొని డిండి లిఫ్టును తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా కేసీఆర్ ఆ పనులు చేయించారు. కానీ సోర్స్ పాయింట్ నిర్ణయించలేదు. ఇప్పటికీ అది నిర్ణయం కాలేదు. పాలమూరు అధ్యయన వేదిక నడిపిన మహత్తర ఉద్యమంలో ఆ డిండి లిఫ్టు సహజ మరణం పాలైంది.
ఉద్యమ జేఏసీ నాలుగు కారణాలతో ఈ డిండి లిఫ్టు అనే మోసాన్ని వ్యతిరేకిస్తున్నది. మొదటిది– కృష్ణా బేసిన్లో తెలంగాణ జిల్లాలకు అవసరమైన నీటిని ఏ జిల్లా అవసరాలకు ఆ జిల్లా నుంచి తీసుకోవాలి. ఇతర జిల్లాల పథకాలు ఆయకట్టును ధ్వంసం చేయకూడదు. రంగారెడ్డి జిల్లా దీనికి మినహాయింపు. నల్లగొండ జిల్లాకు శ్రీశైలం ప్రాజెక్టును మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉంది. రెండవది– ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం చేపట్టిందే మునుగోడు, దేవరకొండ ప్రాంత భూముల కోసం, ఫ్లోరైడ్ బాధితుల కోసం. కానీ ఎస్ఎల్బీసీ కాలువ కింది పెద్దలే ఫ్లోరైడ్ బాధితులకు ద్రోహం చేశారు. మూడవది– ఈ డిండి లిఫ్ట్ పథకం వల్ల కల్వకుర్తి లిఫ్ట్‌తో సాగునీరు అందే భూములు, కాలువలు ధ్వంసం అవుతున్నాయి. కల్వకుర్తి ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా 45 టీఎంసీల నీరు తీసుకోవలసిన పథకంలో నాలుగు టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్లు కూడా నిర్మించకుండా, ఇరవై ఏళ్ల కిందటి ప్రాజెక్టులను గాలికి వదిలి, డిండి లిఫ్ట్‌కు తొందర ఎందుకని కేసీఆర్‌ను అడిగాం. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా రైతులు తమ గ్రామాల ముంపు నివారణ కోసం 310 రోజులుగా దీక్షలు చేస్తుంటే మీకెందుకు పట్టడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, రేవంత్‌రెడ్డిని అడుగుతున్నాం, పోరాడుతున్నాం. ఈ ఉద్యమ ఆకాంక్షను, సారాంశాన్ని హరగోపాల్ రాశారు.
నాలుగవ కారణం ముఖ్యమైనది, మౌలికమైనది. మహబూబ్‌నగర్ ప్రజలు కృష్ణానదీ జలాలలో వాటా కోసమే 1995లో జలసాధన సమన్వయ వేదికతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. రాష్ట్రం వచ్చి పదమూడేళ్లు అవుతున్నా నీళ్లు రాలేదు. తెలంగాణకు ఉన్నవి అంటున్న నీళ్లు సాగర్ ఎడమ కాలువ, మూసీ, డిండి, ఏఎంఆర్ పథకాల ద్వారా నల్లగొండలోనే పారుతున్నాయి. ఎస్ఎల్బీసీ నీరు అదనపు నీరే కదా. మహబూబ్‌నగర్–రంగారెడ్డి జిల్లాలకు కృష్ణానది నీరు వద్దా? తెలంగాణ పాలిట కృష్ణానది మీద పోతిరెడ్డిపాడు ఎలాంటిదో, మహబూబ్‌నగర్–రంగారెడ్డి జిల్లాల పాలిట డిండి లిఫ్టు అంతటి ద్రోహం.
- ఎం.రాఘవాచారి (పాలమూరు అధ్యయన వేదిక)