Share News

Legislative Accountability: అసెంబ్లీలోనే మాట్లాడవచ్చుగా!

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:56 AM

ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించి సమర్థవంతమైన పరిష్కార మార్గాలను వెతకడమన్నది ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ప్రక్రియ.

Legislative Accountability: అసెంబ్లీలోనే మాట్లాడవచ్చుగా!

ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించి సమర్థవంతమైన పరిష్కార మార్గాలను వెతకడమన్నది ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ప్రక్రియ. కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు ఇది అర్థమైనట్టు లేదు. ఆ పార్టీ నాయకులు శాసనసభల పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. శీతాకాల సమావేశాలను బహిష్కరించి, బయట మీడియా ముందు మాత్రం అడ్డగోలుగా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపైన, కృష్ణానది నీటి పంపకాలపైన శాసనసభలో చర్చ జరిగిన వేళ ప్రధాన ప్రతిపక్షం ఇలా ప్రవర్తించడం ఎంతో బాధ్యతా రహితం. ప్రస్తుత శాసనసభను బహిష్కరించడం వల్ల ప్రతిపక్షం తమ హయాంలో జరిగిన అసలు వాస్తవాలను సభ దృష్టికి, తద్వారా ప్రజల ముందుకు తెచ్చే అవకాశాన్ని కోల్పోయింది.

నాటి నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు గురించి చేసిన ప్రత్యారోపణలు వాస్తవమే అయితే మరి ఈ శాసనసభ సమావేశాలను ఎందుకు బహిష్కరించారో ఆయనే చెప్పాలి. బహిష్కరించడానికి ఆయన చెప్తున్న కారణాలు తూతూ మంత్రంగానే ఉన్నాయని తెలంగాణ సమాజం, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అనుకుంటున్నారు. శాసనసభ బహిష్కరణ అనంతరం బీఆర్‌ఎస్‌ భవన్‌లో, తమ అడుగులకు మడుగులొత్తే పార్టీ నాయకులతో సమావేశం పెట్టి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, సీఎం రేవంత్‌రెడ్డి పైన, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పైన అవాకులు చవాకులు మాట్లాడడం సబబుగా లేదు. శాసనసభలో అధికారికంగా చెప్పే అవకాశం ఉన్నప్పుడు, బయట ఎన్ని చిలుక పలుకులు పలికినా అవన్నీ ‘ఆఫ్ ది రికార్డు’గానే మిగిలిపోతాయి.


ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపైన కూడా అధికార పార్టీ నాయకులు ఎన్నెన్నో విషయాలు తెర మీదికి తెచ్చారు. మజ్లిస్, బీజేపీ నాయకులు సంధించిన అనేక ప్రశ్నలకు సూటిగా జవాబులు కూడా చెప్పారు. దీనిపైన కూడా హరీశ్‌రావు మీడియా పాయింట్లోనూ, తమ బీఆర్‌ఎస్‌ నాయకుల సమావేశంలోనూ కమీషన్లు తదితర కథా కమామీషు ధారావాహికంగా ఏకరువు పెట్టారు. దానిలో పస ఎంతో, పొల్లు ఎంతో ఆయనకే తెలియాలి. హైదరాబాద్ కార్పొరేషన్ గురించి ముఖ్యమైన బిల్లు ప్రవేశపెట్టినపుడు కూడా సభలో చాలామంది శాసన సభ్యులు తమ అనుమానాలను వెలిబుచ్చారు. అధికారపక్షం దానికీ సమాధానం చెప్పింది. ఈ శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టిన బిల్లుల మంచి చెడ్డల పైన ప్రజల కోణంలో మాట్లాడకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ మంచి అవకాశాన్ని వదులుకుంది. నిటారుగా నిలబడి వాస్తవాలను తెలంగాణ సమాజానికి గొంతెత్తి తెలియజెప్పే సందర్భాన్ని బీఆర్‌ఎస్‌ నాయకత్వం పోగొట్టుకుంది. దీని వల్ల అధికార పక్షం మాటే ప్రజలకు వినపడింది. ఈ అవకాశాన్ని వారు సమర్థంగా వాడుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలకులు నీటి పంపకాలపై చేసిన నిర్ణయాలతో పాటు, వారి అనేకానేక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.

-జూకంటి జగన్నాథం

Updated Date - Jan 09 , 2026 | 04:56 AM