ఇక మనకు ‘ఈవీ’లే శరణ్యం!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:48 AM
ఇంతకుముందు వరకు చమురు ప్రకంపనలు ధరలు పెరగటం కారణంగానే చోటుచేసుకునేవి. చమురు ఎగుమతి దేశాలు ఒక ముఠాగా కూడబలుక్కుని ధరల్ని పెంచుతుండేవి. కానీ ప్రస్తుత సంక్షోభం ఒక కీలక సముద్ర మార్గాన్ని...
ఇంతకుముందు వరకు చమురు ప్రకంపనలు ధరలు పెరగటం కారణంగానే చోటుచేసుకునేవి. చమురు ఎగుమతి దేశాలు ఒక ముఠాగా కూడబలుక్కుని ధరల్ని పెంచుతుండేవి. కానీ ప్రస్తుత సంక్షోభం ఒక కీలక సముద్ర మార్గాన్ని మూసివేయడం వల్ల ఏర్పడింది. హోర్ముజ్ జలసంధి మూసివేత ద్వారా ఓ కొత్త దుస్సంప్రదాయానికి తెరతీశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే అవకాశముంది.
భారతదేశం 90శాతం వరకు చమురును, 50శాతానికి పైగా వంటగ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నది. ఇంధనావసరాలకు దిగుమతుల మీద ఆధారపడటమే కొన్ని దశాబ్దాలుగా మన వాణిజ్యలోటు మొత్తానికీ కారణమంటే అతిశయోక్తి కాదు. 2026 ఆర్థిక సంవత్సరంలో మన మొత్తం ఇంధన దిగుమతులు సుమారు 162 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 119.3 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటుకు అదనంగా చమురు, గ్యాస్ ధరలు పెరగటం ద్రవ్యోల్బణాన్ని అనివార్యంగా పెంచుతుంది. మన ఆర్థిక వేగానికి ఇది తీవ్ర విఘాతంగా పరిణమించే అవకాశముంది. ప్రస్తుత ఇంధన ప్రకంపనలు మనకో మేలుకొలుపు కావాలి. వచ్చే 5–10 ఏళ్లలో చమురు, గ్యాస్ దిగుమతులను గణనీయంగా తగ్గించే ఆచరణసాధ్య, సంఘటిత కార్యాచరణకు మనల్ని పురిగొల్పాలి. పునరుత్పాదక ఇంధనం, హరిత సాంకేతికతలకు మళ్లటం వల్ల ఇప్పటికే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం 10శాతం దాకా తగ్గినట్లు అంచనా. భారత్ ముందున్న కీలక సవాలు– దిగుమతి చమురు, గ్యాస్, ఎల్‌పీజీ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవటం. ఇప్పటికే ఇంధన స్వావలంబన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, దిగుమతుల్ని తగ్గించేందుకు గణనీయ చర్యలు తీసుకుంటున్నారు. సౌర విద్యుదుత్పత్తి, విద్యుత్ నిల్వ, విద్యుత్ వాహనాలు (ఈవీలు) ఈ మౌలిక మార్పునకు కేంద్రబిందువుగా ఉన్నాయి. మన సౌర విద్యుత్ స్థాపక సామర్థ్యం 154 గిగావాట్లు (మొత్తం విద్యుత్ స్థాపక సామర్థ్యంలో 28.5శాతం). ఏడాదికి 300 బిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యమిది (మొత్తం ఉత్పత్తిలో 14శాతం). ఈ మొత్తం సామర్థ్యాన్ని దాదాపు గడచిన కొన్నేళ్లలోనే సమకూర్చారు. ఇదే సంకల్పాన్ని కొనసాగిస్తే 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యం అసాధ్యం కాదు. కానీ ఇప్పుడున్న అవసరాలకు ఇది చాలదు. ఇంకా ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. చైనా 1,200 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పింది. 2,400 బిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యమిది (మొత్తం ఉత్పత్తిలో 21శాతం).
సౌర విద్యుదుత్పత్తితో పాటు మనం విద్యుచ్ఛక్తిని బ్యాటరీల్లో నిల్వ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. మన ప్రస్తుత బ్యాటరీ స్టోరేజీ (బీఈఎస్‌ఎస్) బహు స్వల్పం. రోజువారీ సౌర ఉత్పత్తిలో 1శాతం కంటే బాగా తక్కువ. చైనా సౌర ఉత్పత్తిలో 12శాతం నిల్వకు బీఈఎస్‌ఎస్‌ను నెలకొల్పింది. 2032 నాటికి బీఈఎస్‌ఎస్ ద్వారా 346 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్–అవర్)ను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇది 63 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి సమానం. సీఈఏ అంచనాల ప్రకారం, మనకు ఇంతకంటే ఎక్కువ అవసరం. మన పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు సౌర విద్యుదుత్పత్తిని పెంచటానికి, నిల్వకు అపార వనరులు, సమన్వయం, మౌలిక వసతులు, సరుకు రవాణా ఏర్పాట్లు, ప్రోత్సాహకాలు అవసరం.
సౌర విద్యుత్తు వల్ల నిజమైన ప్రయోజనం రోడ్డు ప్రయాణాలు, రవాణాలో మనం పూర్తిస్థాయి విద్యుత్ పంథాలోకి (ఎలక్ట్రానిక్ వెహికిల్స్– ఈవీలు) మారినప్పుడే సాధ్యం. 2025లో మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీ కార్ల వాటా 4.4శాతం ఉంది. మనకు భిన్నంగా చైనాలో మొత్తం కార్లలో 48శాతం విద్యుత్‌తో నడుస్తున్నాయి. వచ్చే 5–10 ఏళ్లలో మనం రోడ్డు రవాణా విద్యుదీకరణను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలి. మొత్తం రోడ్డు రవాణా విద్యుదీకరణకు ఏడాదికి సుమారు 600 బిలియన్ యూనిట్ల ఇంధనం కావాలని అంచనా. అంటే, రోజుకు దాదాపు 1.6 బిలియన్ యూనిట్లు. ఇది 100 గిగావాట్ల నిరంతరాయ అదనపు విద్యుదుత్పత్తికి సమానం. అంటే, సౌర విద్యుత్ సామర్థ్యంలో 300 గిగావాట్ల మేర ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది పూర్తిగా సాధ్యం. అసలైన సవాలు– ఈవీలను సౌర విద్యుదుత్పత్తి జరిగే సూర్యకాంతి సమయంలో వేగంగా చార్జింగ్ చేయటం. దీనివల్ల నిల్వకయ్యే విపరీత వ్యయభారం తగ్గుతుంది. విద్యుదుత్పత్తి సమయంలోనే గరిష్ఠ వినియోగమవుతూ ఖర్చు పరిమితంగా ఉంటుంది. పగటిపూట ఈవీలను చార్జింగ్ చేయాలంటే వేగంగా చార్జింగ్ సదుపాయాన్ని విధిగా అందుబాటులోకి తేవటం, చార్జింగ్ అవసరాలకు తగ్గట్లు పంపిణీ నెట్‌వర్క్‌ను నిర్మించటం, సూర్యరశ్మి అందుబాటులో ఉన్నప్పుడు తక్కువ ధర; నిల్వ చేసిన ఇంధనాన్ని వినియోగించేటప్పుడు ఎక్కువ మొత్తం వసూలు... ఇవన్నీ రోడ్డు రవాణాను వంద శాతం వేగంగా విద్యుదీకరించటానికి తప్పనిసరి అవసరాలు.
నగరాల్లో ట్రాఫిక్ నరకం, ప్రమాదాలు, కాలుష్యం లేకుండా బహుళ ప్రజా రవాణాను ఇంటి వద్ద వరకు అనుసంధానంతో మెరుగుపరిచి, వ్యక్తిగత ప్రయివేటు వాహనాలను పరిమితం చేయటాన్ని కూడా వంద శాతం ఈవీ ప్రణాళికలో భాగం చేయాలి. హైదరాబాద్‌నే తీసుకుంటే, 65–70శాతం ప్రయివేటు వాహనాలు, 30 శాతం మాత్రమే ప్రజారవాణా ఉంది. అన్ని రకాల రోడ్డు రవాణా వాహనాలను ఈవీలుగా మార్చటం ద్వారా, భారత్‌లో మనం 120 బిలియన్ లీటర్ల డీజిల్‌ను, 62 బిలియన్ లీటర్ల పెట్రోల్‌ను ప్రతి సంవత్సరం ఆదా చేసుకోగలం. దీంతో, ముడిచమురు దిగుమతులు తగ్గుతాయి. వెంటనే కాకున్నా, డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగాన్ని క్రమంగా దశలవారీగా తొలగించటం వల్ల, దిగుమతుల్ని ఏడాదికి సుమారు 160 మిలియన్ టన్నుల చొప్పున తగ్గించవచ్చు. ప్రస్తుత ధరల ప్రకారం, ఈ తగ్గింపు 160–180 బిలియన్ డాలర్లు. 2025 ధరల ప్రకారమైతే, 90 బిలియన్ డాలర్లు. బహిరంగ ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ కార్యక్రమాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2026 నాటికి ప్రజలకు 72,300 కొత్త చార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావటానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. ఈవీ వాహనాలకు త్వరగా మళ్లటానికి మనం ఈ సదుపాయాలను విస్తృతి, సంఖ్యాపరంగా మరింత ఎక్కువగా అందుబాటులోకి తేవాలి. చైనా ఇప్పటికే 20 లక్షల చార్జింగ్ పాయింట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలో లక్షకు పైగా ఉండగా, భారత్‌లో ప్రస్తుతం 29,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
దిగుమతి చమురు మీద ఆధారపడటానికి స్వస్తి పలికి, వాణిజ్య సమతూకాన్ని మెరుగుపరచుకునేందుకు; ద్రవ్య క్రమశిక్షణతో భవిష్యత్తులో ఆర్థిక ఒడుదుడుకులను నిరోధించేందుకు ప్రస్తుత చమురు సంక్షోభం మనకు ఒక అవకాశాన్నిస్తోంది. ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, మోటారు వాహనాల తయారీపై అర్థవంతమైన నియంత్రణ ఉంటే ఈవీల వైపు మళ్లటానికి వినియోగదారులు సైతం సిద్ధంగా ఉన్నారు.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్
లోక్‌సత్తా వ్యవస్థాపకులు
ఇవి కూడా చదవండి
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!