కార్మికుల ధర్మాగ్రహం
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:58 AM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పారిశ్రామికవాడలో సోమవారం కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన ఇటీవలికాలంలో లేనిది. సుమారు యాభైవేలమంది కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలకు దిగడంతో నియంత్రణ కష్టమైపోయింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పారిశ్రామికవాడలో సోమవారం కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన ఇటీవలికాలంలో లేనిది. సుమారు యాభైవేలమంది కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలకు దిగడంతో నియంత్రణ కష్టమైపోయింది. కొందరు కార్మికులు కట్టుతప్పి విధ్వంసానికి పాల్పడ్డారు, వాహనాలకు నిప్పుపెట్టారు. నోయిడా–ఢిల్లీ దారులు మూసుకుపోయి వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. కార్మికుల అసహనం ఈ స్థాయిలో కనబడటంతో ఇటు జిల్లా యంత్రాంగం, అటు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వేగంగా దిగివచ్చింది. ఇదేమీ అప్పటికప్పుడు రేగిన ఆగ్రహమూ కాదు, కార్మికులవి గొంతెమ్మకోరికలూ కావు. వారు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చిపడ్డారనడం సరికాదు. వేతనపెంపు, బోనస్, మెరుగైన పని పరిస్థితులు ఇత్యాది డిమాండ్లతో కొద్దిరోజులుగా వారు నిరసన వెలిబుచ్చుతూనే ఉన్నారు. తదనుగుణంగా అక్కడి పారిశ్రామిక యూనిట్లతో అధికారగణం చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతోనే కార్మికులకు ఆగ్రహం కలిగింది. పరిశ్రమలకు జారీచేసిన సూచనలు అమలుకాక, తమ డిమాండ్లు నెరవేరక వారి అసహనం తారాస్థాయికి చేరింది. సకాలంలో జీతాలు, ఓవర్ టైమ్‌కు తగినంత వేతనం, కచ్చితమైన వారంతపు సెలవు, ఆ రోజున పనిచేసిన పక్షంలో రెట్టింపు జీతం ఇత్యాది హామీలతో జిల్లా యంత్రాంగం కార్మికులను చల్లార్చేందుకు తన వంతు కృషి చేసింది. పరిశ్రమలకు జారీ చేసిన మార్గదర్శకాల కచ్చితమైన అమలును పర్యవేక్షించే వ్యవస్థతో పాటు, కార్మికులు వచ్చి తమ ఫిర్యాదు నమోదుచేసుకొనేందుకు జిల్లాస్థాయిలో ఒక కంట్రోల్‌రూము, పనిప్రదేశాల్లో కంప్లయింట్ బాక్సులు కూడా ఏర్పాటవుతాయట. అయితే, వేలమంది కార్మికులు ఇలా ఉద్యమిస్తే పాలకులకూ పారిశ్రామికవేత్తలకు సహజంగానే భయాందోళనలు హెచ్చుతాయి కనుక, ఈ నిరసనల వెనుక దుష్టశక్తులున్నాయన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. హింసను రేపిన లోపలివారెవ్వరో, బయటనుంచి వచ్చి ఆగ్గిరాజేసిందెవ్వరో గుర్తించి, శిక్షించి తీరుతామని డీజీపీ శపథం చేశారు. నాలుగువందలమంది కార్మికులను అరెస్టుచేయడమే కాక, వీరి వెనుక పాకిస్థాన్ ఉన్నదని రాష్ట్ర కార్మికమంత్రి అనిల్ రాజ్‌భర్ అన్నారు. పాక్‌తో సంబంధాలున్నాయంటూ ఇటీవల రాష్ట్రంలోని కొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఉగ్రవాదులను అరెస్టుచేయడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. జీతం పెంచమని అడిగినవారి జీవితాలమీదే పాలకులు కన్నేశారన్నమాట.
పొరుగున ఉన్న హర్యానాలో కనీసవేతనాన్ని ఇటీవలే రూ. 14వేల నుంచి 19వేలకు పెంచడం కనీసవేతనం రూ. 13వేలు మాత్రమే ఉన్న యూపీ కార్మికులను ఇలా ఉద్యమించేట్టు చేసిందని అంటారు. నిరసనలు రాష్ట్రంలోని అన్ని పారిశ్రామికవాడలకూ విస్తరించే ప్రమాదం కనిపించడంతో యూపీ ప్రభుత్వం వేగంగా ప్రతిస్పందించి వేతనాలను కాస్తంత పెంచింది. రూ. 11వేలు కనీసవేతనంగా ఉన్న అన్‌స్కిల్డ్ కార్మికుడికి ఓ రెండువేలు పెరిగితే, నైపుణ్యం గల కార్మికుడికి ఈ పెరిగిన మొత్తం వెయ్యి రూపాయల కంటే లేదు. అయినా, దీనినే రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. నోయిడా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల రాకపోకల ఖర్చు ఇటీవలికాలంలో రెట్టింపు అయిందనీ, ఇక నిత్యావసరాలు సహా అన్నిటిధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే, యోగి ప్రభుత్వం ఇప్పుడు కార్మికులకు అదనంగా ఇచ్చిందేమీలేదని కార్మిక నాయకులు అంటున్నారు. నోయిడా మాత్రమే కాదు, ఉత్తరభారతంలోని అత్యధిక పారిశ్రామికవాడల్లో, ప్రధానంగా కాంట్రాక్టు కార్మికుల దోపిడీ యధేచ్ఛగా జరిగిపోతోంది. నెలకు పదిపన్నెండువేల రూపాయల జీతంతో, రోజుకు పన్నెండుగంటలపాటు, వారంతపు సెలవునాడు కూడా అదనపు జీతం లేకుండా పనిచేయించుకొని, ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్ వంటి కనీసభద్రతలు దక్కని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ వాతావరణానికి వ్యతిరేకంగా, కొద్దిపాటి జీతం పెంచమంటూ కార్మికులు రోడ్డునపడితే వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు, వారి ఉద్యమాన్ని దేశవ్యతిరేకమంటున్నారు. నోయిడాకు ముందు హర్యానాలోని మానేసర్, బిహార్ బరౌనీ, గుజరాత్‌లోని సూరత్, రాజస్థాన్‌లోని భివాడీ ఇత్యాది పారిశ్రామికవాడల్లో రేగిన కార్మిక ఉద్యమాలను పాలకులు పరిగణనలోకి తీసుకొని, కార్మికుల అసంతృప్తిని ఒక విస్తృతమైన విధానంతో చల్లార్చని పక్షంలో, కట్టుతెగాక నియంత్రించడం కష్టమవుతుంది.