Share News

Vaishno Devi Medical College: మతం – మెరిట్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 03:49 AM

జమ్మూలోని వైష్ణోదేవి వైద్యకళాశాలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి రద్దుచేసింది. ‘శ్రీ మాతా వైష్ణోదేవీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎక్సలెన్స్‌’కు అన్ని అనుమతులూ....

Vaishno Devi Medical College: మతం – మెరిట్‌

జమ్మూలోని వైష్ణోదేవి వైద్యకళాశాలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి రద్దుచేసింది. ‘శ్రీ మాతా వైష్ణోదేవీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎక్సలెన్స్‌’కు అన్ని అనుమతులూ ఇచ్చిన కొద్దినెలల్లోనే సదరు కాలేజీలో సవాలక్ష సమస్యలున్న ఆరోపణతో కేంద్రప్రభుత్వ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చింది. ఎన్‌ఎంసీ బృందం ఆకస్మిక తనిఖీలో అనేక లోపాలూ దోషాలూ బయటపడ్డాయట. తమకు అందిన ఫిర్యాదుల్లో ప్రస్తావించిన అంశాలన్నీ నిజమేనని, కాలేజీ కొనసాగింపును అనుమతిస్తే వైద్యవిద్య ప్రమాణాలు కచ్చితంగా పతనమవుతాయని ఎన్‌ఎంసీ వ్యాఖ్యానించింది. ఈ కళాశాలలో మౌలికసదుపాయాల కొరత తీవ్రంగా ఉందట, బోధనాసిబ్బంది నలభైశాతం తక్కువట, ట్యూటర్లు, డిమాన్‌స్ర్టేటర్లు, సీనియర్‌ రెసిడెంట్స్‌ వంటివారి లోటు 60శాతం వరకూ ఉందట. రోగులు సగమే ఉన్నారట, ఎనభైశాతం పడకలు భర్తీకావాల్సి ఉండగా, నలభైశాతమే నిండాయట. ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్లు, లేబరేటరీలు, లైబ్రరీలు, ఆపరేషన్‌ థియేటర్లు ఇలా ప్రతీచోటా లోపాలు అనేకం బయటపడటంతో ఈ చర్య తీసుకుందట. యాభైమంది ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీతో విద్యాసంవత్సరం ఆరంభానికి సకల అనుమతులూ ఇచ్చిన సంస్థకు కొద్దినెలల్లోనే ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నట్టు కనిపించింది. వరుస ఫిర్యాదులతో ఆకస్మిక తనిఖీలు జరిగేట్టుచేసి, కాలేజీ మూసివేయించింది తామేనని నలభైఐదురోజులుగా అడ్మిషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘర్ష్‌ సమితి నేతలు ప్రకటించారు. అనుమతి రద్దయిన వార్త చెవినపడగానే వీరంతా సంబరాలు చేసుకున్నారు. మహాద్భుతంగా నిర్మితమైన ఒక కాలేజీ ఇంకా పూర్తిగా నడకమొదలెట్టకముందే కుప్పకూలితే ఆనందం కలుగుతుందా? నలభైరెండుమంది ముస్లిం విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని దూరం చేసిన ఆ సంతోషం కొలవలేనిది.


ఆకస్మిక తనిఖీలతో పాటు, అనుమతి రద్దు నిర్ణయం కూడా అతివేగంగా జరిగిపోయింది. నాసిరకం కాలేజీలకు కూడా తమ వాదన వినిపించుకోవడానికి ఎన్ఎంసీ ఎంతో సమయం ఇస్తుంది. తనిఖీలో తాము గ్రహించిన లోటుపాట్లమీద ప్రశ్నలు వేసి, జవాబు చెప్పుకోమంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నాక కూడా మూడు దశల్లో అప్పీలుచేసుకొనే అవకాశం కూడా కాలేజీలకు ఉంటుందని అంటారు. ఈ కాలేజీ విషయంలో అటువంటిదేమీ జరగలేదని, అనుమతి ఇచ్చేముందు కఠిన పరీక్షలు పెట్టిన ఈ సంస్థ, రద్దు నిర్ణయాన్ని మాత్రం వెంటనే తీసుకుందని కాలేజీ అధ్యాపకులు, అధికారుల వాదన. లైబ్రరీలో పుస్తకాలు, ఆపరేషన్‌ థియేటర్లు, ఆడామగా వార్డులు, లేబరేటరీలు ఇత్యాది ప్రతీవిషయంలోనూ తనిఖీ బృందం తప్పుడు లెక్కలు రాసిందని వారు పోల్చిచూపిస్తున్నారు. ఆరేళ్ళుగా పనిచేస్తున్న బ్రహ్మాండమైన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి అనుబంధంగా, సిబ్బంది నుంచి లేబరేటరీలవరకూ దేనికీ లోటన్నదిలేకుండా, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఈ కాలేజీ ఏర్పడిందని, ఇక్కడి సదుపాయాలు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న మిగతా పన్నెండు మెడికల్‌ కాలేజీల్లోనూ లేవని విద్యార్థులంతా ఒక్కమాటగా అంటున్నారు. అడ్మిషన్‌ ప్రక్రియలో వీసమెత్తు దోషం లేకుండా ‘నీట్‌’ ర్యాంకుల ఆధారంగానే ఆ యాభై సీట్లూ భర్తీ చేసినా, మైనారిటీ రిజర్వేషన్‌ అంటూ వేరుగా లేకున్నా నలభైరెండుమంది ముస్లిం కుర్రాళ్ళు ఈ కాలేజీలోకి ప్రవేశించడం బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు ఒక ఆయుధంగా ఉపకరించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిళ్ళు పనిచేశాయో తెలుస్తూనే ఉంది. మెరిట్‌ కాదు, మతం చూడాలి అంటున్నవారి వాదనే పైచేయి అయింది. పోటీపరీక్షలో మంచిర్యాంకుతో సీటు తెచ్చుకున్నవారిని కశ్మీర్‌కు తరిమేయాలన్న సంఘర్ష్‌ సమితి డిమాండుకు వ్యవస్థలన్నీ దిగివచ్చాయి. ఒక మతానికి చెందినవారిని తరగతి గదినుంచి గెంటివేయాలన్న ఉన్మాదుల ఒత్తిడికి లొంగిపోయి, రాజ్యాంగ విలువలను వమ్ముచేయడానికి కూడా కేంద్రప్రభుత్వమూ, దాని సంస్థలూ సిద్ధపడ్డాయి. మతద్వేషానికి చేయూతనిచ్చి ఏకంగా ఒక జాతీయస్థాయి అడ్మిషన్ల ప్రక్రియను అపహాస్యం చేశారు. మిగతాదేశంతో కశ్మీర్‌ విలీనం సంపూర్ణంగా జరగడానికే ప్రత్యేకప్రతిపత్తిని లాగేసుకున్నామని పాలకులు ఎప్పుడూ అంటూంటారు. యువతరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఇటువంటి చర్యలు పాలకపెద్దలు ప్రవచిస్తున్న ‘నయా కశ్మీర్‌’కు దోహదం చేయకపోగా లోయప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసి, వారిని దేశానికి మరింత దూరం చేస్తాయి.

Updated Date - Jan 10 , 2026 | 03:49 AM