నితీశ్ కొత్త మజిలీ
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:55 AM
ఎంతకాలం ఈ శత్రుసంకీర్తన, ఎప్పుడు మనకు రాజ్యాధికారం అంటూ అనాదిగా లోలోన మధనపడుతున్న బిహార్ బీజేపీ నాయకులకు ఇన్నేళ్ళకు ఊరట దక్కింది.
ఎంతకాలం ఈ శత్రుసంకీర్తన, ఎప్పుడు మనకు రాజ్యాధికారం అంటూ అనాదిగా లోలోన మధనపడుతున్న బిహార్ బీజేపీ నాయకులకు ఇన్నేళ్ళకు ఊరట దక్కింది. ఆధునిక మగధ రాజ్యాన్ని ఏలుకోవడానికి వారికి మార్గం సుగమమైంది. నితీశ్‌కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోబోతున్నామని, ఆయన సారథ్యంలో సాగుతామని బీజేపీ అధినాయకులు ప్రకటించడానికి ఎంతోముందునుంచే బిహార్‌లో ఒక చిన్నస్థాయి నాటకం ఒకటి ఎప్పుడూ మొదలవుతుంది. అధికస్థానాలు గెలుచుకున్నపార్టీకే అధికారం దక్కాలని చోటామోటా నేతలంతా అసమ్మతి గొంతులు తెరుస్తారు. ఆ తరువాత ఢిల్లీ పెద్దల పర్యటనలు, భేటీల అనంతరం గొడవ సద్దుమణిగి, ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ అదే నాటకం సాగి, చివరకు పదవుల సర్దుబాటుతో ముగుస్తుంది. ఇకపై బిహార్‌లో ఇటువంటి జనరంజక కార్యక్రమాలు ఉండవు.
పదోసారి సీఎంగా ప్రమాణం చేసిన నాలుగు నెలల్లోనే నితీశ్‌కుమార్ రాజ్యసభ సభ్యుడుగా నామినేషన్ దాఖలు చేసి, ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. పెద్దలసభకు వెళ్ళాలన్న ఆయన నిర్ణయానికి డెబ్బయ్ ఐదేళ్ళ వయసు కారణం కాదు. ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించకుండా రెండు దశాబ్దాల పాటు తిమ్మినిబమ్మిని చేసి సీఎంగా కొనసాగిన ఈయన గుండెలోతుల్లో ఒక బలమైన కోరిక ఉన్నదని మనకు తెలియనే లేదు. ఇటు బిహార్‌లోనూ, అటు ఢిల్లీలోనూ ఉభయసభల్లోనూ కూచోవాలన్న కోరిక ఆయనలో రగిలిపోతోందట. రాజ్యసభకు పోవాలన్న నిర్ణయంద్వారా ఇంతకాలానికి తాను అనుకున్నది జరుగుతోందట. శాసనసభలో బీజేపీ–జేడీయూ కూటమికి సరిపడినంత బలం ఉన్నందున ఆయన విజయం తథ్యం. ఆయన ఖాళీ చేసిన సీటును బీజేపీనుంచి ఎవరు భర్తీచేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటి నవంబరులో జరిగిన ఎన్నికల్లో బిహార్‌లో అత్యధికస్థానాలు గెలుచుకున్నపార్టీ బీజేపీ. జేడీయూ కూడా మెరుగుపడి, సంఖ్యాబలం పెంచుకోవడంతో మరోమారు నితీశ్‌కు అవకాశం వచ్చిందని అంతా అనుకున్నారు. మాటకు కట్టుబడి బీజేపీ ఎంతో పెద్దమనసుతో నితీశ్‌కు అధికారం అప్పగించిందని కూడా అన్నారు. అయితే, ఆ అధికారం శాశ్వతం కాదనీ, సీఎం కుర్చీమీద అమితప్రేమ ఉన్న ఆయన తనకు తానుగా వదులుకోరని, ఒత్తిడిమేరకే దానిని ఖాళీచేస్తున్నారని ఈ హఠాత్పరిణామం అర్థం.
మై హూ నా అని తన పార్టీ కార్యకర్తలకు ఆయన భరోసా ఇస్తున్నప్పటికీ, భవిష్యత్ చిత్రం వాళ్ళకు కనిపిస్తూనే ఉంది. వచ్చేనెల రాజ్యసభ ద్వారాలు తెరుచుకోగానే ఆయన ఢిల్లీ తరలిపోవడం, బిహార్‌లో బీజేపీ తొలిసారిగా అధికారాన్ని చేపట్టడం జరిగిపోతాయి. ఉత్తరాదిలో బీజేపీ గుప్పిట్లో లేని ఏకైక రాజ్యం ఇప్పుడు దాని వశం కాబోతోంది. నితీశ్ కుమారుడు నిశాంత్ రాజకీయప్రవేశానికి కూడా రంగం సిద్ధమైందనీ, ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వవచ్చునని అంటున్నారు. ఇక బీజేపీ తరఫున ఎవరు సీఎం కావచ్చునన్న అంచనాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇకమీదట బిహార్‌లో జేడీయూ పాత్ర రెండోస్థానానికి పరిమితం కాబోతున్నదని ఈ పరిణామాల అర్థం. ఇటీవలికాలంలో ఆయన ఓ రెండుమూడు సందర్భాల్లో విచిత్రంగా, విపరీతంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. మరీముఖ్యంగా, ఒక మహిళ హిజాబ్ తొలగించిన ఘట్టం అత్యంత వివాదాస్పదమైంది. పదవిలో కొనసాగాలని ఆయనకు ఎంతగా ఉన్నా, పట్టుబట్టే అవకాశాలు సహజంగానే తగ్గిపోతాయి.
మళ్ళీ ఆర్జేడీకి దూరమై, మళ్ళీ బీజేపీ దగ్గరై.. ఒక దశాబ్దంలోనే నితీశ్ ఐదుసార్లు విన్యాసాలు చేసినా, పల్టూబాబు అంటూ విమర్శలు ఎదుర్కొన్నా, కూటమిని గెలిపించారు, సీఎం కుర్చీని నిలబెట్టుకోగలిగారు. కానీ, రాజకీయ అనుభవం లేని ఆయన కుమారుడు పార్టీని సమర్థంగా నడిపించగల అవకాశాలు లేనందున నితీశ్ అనంతరం పార్టీ క్రమంగా బలహీనపడటం ఖాయమని విశ్లేషకుల అంచనా. నితీశ్ మంచి జోరుమీద ఉన్నప్పుడే బీజేపీ తన మతరాజకీయాలతో జేడీయూ కంచుకోటలను సైతం కొల్లగొట్టి నానాటికీ విస్తరిస్తూ, బలపడుతూ వచ్చింది. ఈ సామ్యవాద నాయకుడు తరలిపోయిన రాజ్యంలో సంక్షేమం అదేవిధంగా సాగుతుందా, రేపటి రోజుల్లో ఆ రాష్ట్రాన్ని సంపూర్ణంగా తన వశం చేసుకోవడానికి బీజేపీ ఎటువంటి విధానాలను అనుసరించవచ్చు అన్నటువంటి ప్రశ్నలు అనేకం ముందుకు వస్తున్నాయి. నితీశ్‌కు ఉన్న సమర్థత ఆయన వారసుడికి లేనిపక్షంలో బిహార్‌లో ఆయన పార్టీ నామమాత్రంగా మిగిలిపోవడం ఖాయం.