Share News

రాత్రి కోర్టులు పెండెన్సీకి పరిష్కారం కాదు !

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:41 AM

మనదేశపు న్యాయస్థానాల్లో 5 కోట్ల వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయనే విషయం పార్లమెంటు సాక్షిగా న్యాయశాఖ మంత్రులు వివిధ సందర్భాల్లో చెప్పిన విషయం, యావత్‌ దేశం అనేకసార్లు ఆలకించింది.

రాత్రి కోర్టులు పెండెన్సీకి పరిష్కారం కాదు !

మనదేశపు న్యాయస్థానాల్లో 5 కోట్ల వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయనే విషయం పార్లమెంటు సాక్షిగా న్యాయశాఖ మంత్రులు వివిధ సందర్భాల్లో చెప్పిన విషయం, యావత్‌ దేశం అనేకసార్లు ఆలకించింది. ఈ పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం రాత్రి కోర్టులు నడపాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు.

ప్రస్తుతం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నడుస్తున్న న్యాయస్థానాలను... ఈ రాత్రి కోర్టుల నిర్వహణలో భాగంగా తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడపాలని నిర్ణయించారు. అందుకోసం పైలట్‌ ప్రాజెక్టులుగా ఢిల్లీ, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. ఈ నెల 28న విజయవాడలో సమావేశమవ్వాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగించాలని న్యాయవాదులు నిర్ణయించుకున్నారు.

రాత్రి న్యాయస్థానాల ఏర్పాటు నిర్ణయం ఎంత అనాలోచితమో, ఎంత అసాధ్యమైనదో ప్రభుత్వవర్గాలకు తెలియకపోయినా, కనీసం ఉన్నత న్యాయస్థానాలైనా ఈ ఆలోచనను మొగ్గలోనే తుంచేయాల్సింది. మధ్య వర్తిత్వం లాంటి మార్గాలతో ఎన్ని లక్షల కేసులు పరిష్కారమవుతున్నప్పటికీ, అంతే సంఖ్యలో కొత్త కేసులు దాఖలు కావటంతో ఆ 5 కోట్ల పెండెన్సీ యథాతథంగానే ఉంటున్నది. సుప్రీంకోర్టులో ఉన్న 84వేల పెండింగ్‌ కేసులు, వివిధ హైకోర్టుల్లో ఉన్న 60 లక్షల కేసుల సంఖ్య దాదాపుగా అదే స్థాయిలో కొనసాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో రాత్రి న్యాయస్థానాలు ఈ సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తాయి.


సాధారణంగా న్యాయవాదుల రోజువారీ దినచర్య హడావుడిగా ఉంటుంది. కక్షిదారులతో మాట్లాడటం, ఆ రోజు జరిగే కేసులు చూసుకోవడం, కొత్తగా దాఖలు చేయాల్సిన కేసులు తయారు చేసుకోవటం, పగలంతా ఆ కోర్టుకు ఈ కోర్టుకు హడావుడిగా తిరగటం, వాదించటంతోనే సరిపోతుంది. చిన్న పట్టణాల్లో రెండు మూడు కోర్టులుంటే, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ లాంటి పెద్ద నగరాల్లో చాలా న్యాయస్థానాలుంటాయి. పగలంతా తమ కేసుల వ్యవహారాలు చూసుకుని, మళ్లీ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు పనిచేయటం న్యాయవాదులకు అసాధ్యమైన పని.

రెగ్యులర్‌ న్యాయమూర్తుల స్థానంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల్ని, కొత్త న్యాయమూర్తుల్ని ప్రభుత్వం నియమించుకోవచ్చేమోగానీ కక్షిదారుడు రాత్రి న్యాయస్థానం కోసం మరో న్యాయవాదిని నియమించుకోవటం సాధ్యం కాదు. న్యాయవాదుల జీవితం పైకి చూడటానికి బాగానే కన్పించవచ్చు గానీ, తొంభై శాతం మంది న్యాయవాదులకు నెలకు కనీసం ఐదు వేల రూపాయల ఆదాయం కూడా ఉండదనేది ఒక చేదు నిజం. ఇక మహిళా న్యాయవాదుల పరిస్థితి మరీ దారుణం. రెండు లా డిగ్రీలు చదివి, న్యాయవాదులుగా వేల సంఖ్యలో ఈ వృత్తిలోకి వస్తున్న మహిళలు రోజూ స్కూటీ పెట్రోలు కోసమో, ఆటో చార్జీల కోసమో తమ తండ్రి పైనో, భర్త పైనో ఆధారపడటం కూడా ఒక కఠోర వాస్తవమే. జూనియర్‌ న్యాయవాదులకు పైసా కూడా ఇవ్వని సీనియర్లు ఎంతోమంది ఉన్నారు!

ఈ రాత్రి కోర్టుల నిర్ణయం అమలైతే, న్యాయవాదులు ముఖ్యంగా మహిళా న్యాయవాదులు కోర్టుల నుంచి వారి నివాసాలకు రాత్రి సమయంలో ప్రయాణించడం ఎంత ఇబ్బందికరమో ఆలోచించాలి. శారీరకంగా, మానసికంగా న్యాయవాదులు భరించాల్సిన ఈ ఒత్తిడి వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. న్యాయవాదులకు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా, న్యాయమూర్తుల్లాగా రీయింబర్స్‌మెంట్‌ అవకాశాలు కూడా లేవు.


కాబట్టి పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం రాత్రి న్యాయస్థానాలు వంటి ఆలోచనలు మానుకొని, అర్థవంతమైన ఇతర పరిష్కార విధానాలను అటు ప్రభుత్వమూ, ఇటు ఉన్నత న్యాయస్థానాలూ ఆలోచించాలి. వివిధ హైకోర్టుల్లో 1114 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, వాటిలో ఇంకా 360 ఖాళీలున్నాయి! కింది కోర్టుల్లో ఈ సంఖ్య వేలల్లోనే ఉంది. కొత్తగా న్యాయమూర్తులను నియమించటంతోపాటు ఉన్న న్యాయ మూర్తుల పని విధానాన్ని హైకోర్టులు పర్యవేక్షించాలి. రాత్రి కోర్టుల మాట అటుంచితే, భోజన విరామం తర్వాత పనిచేసే న్యాయమూర్తులు చాలా అరుదు. వారిని పగలంతా సక్రమంగా పనిచేయించే పర్యవేక్షణ విధానం రావాలి. కోర్టులు నిరర్థకమైన సెలవులు తగ్గించుకోవాలి. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా కింది కోర్టుల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు దాన్ని బేఖాతరు చేస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నారు. న్యాయవాది శనివారం చనిపోతే దాని కారణంగా చూపించి సోమవారం కోర్టు విధులను బహిష్కరించటం, ఎక్కడో ఏదో పేపర్లో వార్త వస్తే నిజానిజాలు నిర్ధారించుకోకుండా, దానికి నిరసనగా కోర్టు విధులను బహిష్కరించడం వంటివి చేస్తున్నారు. వీటిని మానుకోవాలి. పని దినాలు పెంచటం, మొత్తం కోర్టు సమయమంతా పనిచేసేలా చూడడం, కాల్‌ వర్క్‌ పేరుతో జరిగే సమయం వృథా కాకుండా చూడడం, కోర్టుల్లో ఇతర ఉద్యోగుల నియామకాలు చేపట్టడం, ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం వంటివి చేస్తే రాత్రి న్యాయస్థానాలకు బదులు పదింతల పెండెన్సీని తగ్గించుకోవచ్చు. ఈ పనులను చేయడానికి బదులుగా ప్రభుత్వ పెద్దలు.. రాత్రి న్యాయస్థానాల వంటి చిట్కా పరిష్కారాలు ప్రయోగించి న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని తగ్గించకూడదు.

- చెరుకూరి సత్యనారాయణ

Updated Date - Nov 28 , 2026 | 12:45 AM