పాటలా సాగేనా పాలన?
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:08 AM
మీ నాయకత్వంలో ఉభయదేశాల సంబంధాలు బలోపేతం కావాలి, ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరగాలి, ఇరుదేశాకూ మేలు జరగాలి అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్ కొత్త పాలకుడికి ఎంతో ఆత్మీయంగా అభినందనలు తెలియచేశారు.
మీ నాయకత్వంలో ఉభయదేశాల సంబంధాలు బలోపేతం కావాలి, ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరగాలి, ఇరుదేశాకూ మేలు జరగాలి అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్ కొత్త పాలకుడికి ఎంతో ఆత్మీయంగా అభినందనలు తెలియచేశారు. శుక్రవారం బాలేంద్ర షా ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. బ్రాహ్మణుల వేదమంత్రాలు, శంఖనాదాలు, బౌద్ధ లామాల గ్రంథపఠనాలతో హిందూ బౌద్ధమత సంప్రదాయాల సమ్మేళనం మధ్య నేపాల్ 47వ ప్రధానిగా 35ఏళ్ళ బాలెన్ బాధ్యతలు స్వీకరించారు. హిమాలయ దేశంలో ఈ పదవిని చేపట్టిన పిన్నవయస్కుడాయన. ఒక మధేశీ ప్రధాని కావడం కూడా తొలిసారి. నేపాల్ యువత మహోద్యమంతో కె.పి.శర్మ ఓలీని గద్దె దించేసిన ఆర్నెల్లకు, ఆ స్థానంలోకి బాలెన్ రావడం భారత్‌కు ఉపశమనం కలిగించే అంశమని, సత్సంబంధాలకు ఇక ఢోకా ఉండదని విశ్లేషకుల నమ్మకం.
పాతతరాన్ని గద్దెదించిన నేపాల్ జెన్‌జీ ఉద్యమం ప్రధానంగా అవినీతి వ్యతిరేక పోరాటం కాబట్టి, మనదేశంలో కొందరికి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీ తొలిసారిగా అధికారం చేపట్టిన నేపథ్యం గుర్తుకు వస్తోంది. బాలెన్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో నాలుగేళ్ళక్రితమే పుట్టిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పి), దశాబ్దాలుగా నేపాల్‌ను ఏలిన సంప్రదాయ పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించి, ప్రతినిధుల సభలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించగలిగింది. అంతర్గత కుమ్ములాటల మధ్య పద్దెనిమిదేళ్ళలో పన్నెండు ప్రభుత్వాలు కుప్పకూలిన నేపాల్‌లో, ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికీ, ఆగ్రహానికి ఇది నిదర్శనం. కమ్యూనిస్టుల కంచుకోటలో, కె.పి.శర్మ ఓలిని సవాలు చేసి, చిత్తుగా ఓడించి, బాలెన్ సైతం హీరో అనిపించకున్నాడు. నేపాల్ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈయన పార్టీ సభ్యులే చట్టసభను ఆక్రమించుకోవడం ప్రజలు పెట్టుకున్న ఆశలకు నిదర్శనం.
ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పెద్దగా పాల్గొన్నది లేదని, ఎక్కడా పట్టుమని పదినిముషాలు కూడా ప్రసంగాలు దంచలేదని, ఓటుచేయమని కూడా అడిగేవారు కాదని అంటారు. కుశల ప్రశ్నలు వేస్తూ స్టేజిమీద ఆయన కనిపిస్తే చాలు జనం ఊగిపోయేవారట. ఏ సోషల్ మీడియా మీద నిషేధం నేపాలీ యువతను ఆగ్రహానికి గురిచేసి, గత పాలకులను రోడ్లమీద పరుగులు తీసేట్టు చేసిందో, అదే సోషల్ మీడియా ఆధారంగా ఈ ర్యాపర్ అధికారంలోకి వచ్చారు. గతపాలకులను గద్దెదించే ఉద్యమంలో ప్రత్యక్షంగా కంటే, సామాజిక మాధ్యమాలద్వారా చేసిన ఈ పరోక్ష యుద్ధం బలమైనది. అవసరమైన చోట కాస్తంత భక్తి కలగలిసిన ఆయన పాటలు, మాటల ద్వారా అవినీతి పాలకులను తుదముట్టించేందుకు అపరకాళిలాగా వస్తున్నాడని ప్రజలు నమ్మారు. నేపాల్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ, ఏకత్వాన్ని గుర్తుచేస్తూ, దృఢసంకల్పంతో, మరుగుతున్న రక్తంతో, గుండెలు నిండిన ధైర్యంతో తాను ప్రజాసేవకు వస్తున్నానంటూ ఎన్నికల ఫలితాల అనంతరం విడుదలైన ఆయన పాట ఒకటి ఇప్పటికీ నేపాలీలను కదిలిస్తూనే ఉంది.
దుష్టపాలనతో విసిగిపోయిన జనం రోడ్లమీదకు రావడం, రక్తపాతంతో అధికారాన్ని కూల్చడం, అంతిమంగా వారి ఆశలూ, ఆశయాలతో సంబంధం లేని వారే తిరిగి గద్దెనెక్కడం చాలా దేశాల్లో చూస్తున్నాం. కానీ, నేపాలీలు తాము కోరుకున్నవాడిని ఆర్నెల్లలోనే అధికారంలో కూచోబెట్టుకున్నారు. నాలుగేళ్ళ వయసున్న ఒక పార్టీని, పాలకుడిగా అనుభవంలేని ఒక పాటగాడిని గద్దెనెక్కించారు. ఖాట్మండూ మేయర్‌గా ఆయన ఎన్నికైనప్పుడు కూడా పాతతరం పెదవివిరిచింది. ఆయన దూకుడు నిర్ణయాలమీద విమర్శలు వచ్చినా, వినూత్నవిధానాలతో నగరాన్ని చక్కదిద్దారు. నేపాల్ యావత్తూ ఒక్కమాటగా ఆయనను ఎన్నుకోవడానికి ఇదే కారణం కాకపోవచ్చు కానీ, ఆయన హామీలను జనం విశ్వసించారు. ఏడుశాతం అభివృద్ధిరేటు, తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం, అనేక ఐటీపార్కుల ఏర్పాటుతో, ఈ రంగంలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించడం, విదేశాలకు వలసపోతున్న యువతరం కోసం దేశంలోనే పదిలక్షల ఉద్యోగాలు కల్పించడం వంటి హామీలు అనేకం ఉన్నాయి. బండలైన బతుకులు, గుంతలు పడ్డ రోడ్లమీద గేయాలు అల్లి అధికారంలోకి వచ్చిన బాలెన్ షా, ప్రజల్లో తాను పెంచిన ఆశలకు అనుగుణంగా పాలన సాగించాల్సి ఉంటుంది. దశాబ్దాల పాలనా అనుభవం ఉన్న నాయకులను కాదుపొమ్మని, మార్పు కోరిన జనం, ఎంతకాలం ఓర్పుగా ఉంటారో చూడాలి.