నెల్లూరును అతలాకుతలం చేసిన పెద గాలివాన
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:48 AM
గాలివాన ఒక ప్రకృతి వైపరీత్యం. ఒక భయంకరమైన అనుభవం. వందేళ్ల క్రితం సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో రేడియో వార్తలే ఆధారం. వార్తల్లో తుఫాను అని చెపితే గుండెల్లో గుబులు.
గాలివాన ఒక ప్రకృతి వైపరీత్యం. ఒక భయంకరమైన అనుభవం. వందేళ్ల క్రితం సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో రేడియో వార్తలే ఆధారం. వార్తల్లో తుఫాను అని చెపితే గుండెల్లో గుబులు. సరిగ్గా వందేళ్ల నాటి నెల్లూరు పెద గాలివాన చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతూనే ఉంటారు.
నవంబరు ఒకటి, 1927న నెల్లూరును తుఫాను కాటేసింది. అక్టోబరు 30వ తేదీ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తుఫానుగా మారి నవంబరు 1, 2 తేదీల్లో నెల్లూరు వద్ద తీరం దాటింది. 12గంటల పాటు నెల్లూరును వణికించింది. ఒకటో తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన తుఫాను రెండో తేదీ అర్ధరాత్రి ఒంటిగంట వరకు బలమైన ప్రభావం చూపింది. 25 మైళ్ల రేడియస్తో కోవూరు నుంచి గూడూరు డివిజన్ వరకు ప్రతాపాన్ని చూపింది. కడప జిల్లా వరకు ఈ ప్రభావం ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా మాత్రం పూర్తిగా అతలాకుతలమైంది.
ఒకటో తేదీన జిల్లా యంత్రాంగం సైతం నిర్వేదంలో ఉండిపోయింది. ఏమి జరుగుతుందో కూడా చూడలేని భయానక స్థితి. అధికారులు సైతం బయటకు రాలేని ప్రచండ తుఫాను అది. ఆ విధ్వంసం రోజున నెల్లూరు పట్టణంలో వేల ఇళ్ల కిటికీలు, ద్వారబంధాలు గాలికి ఊడి పడిపోయాయి. రెండో తేదీన అధికారులు బయటకు వచ్చి చూసేటప్పటికి నెల్లూరు స్వరూపమే మారిపోయింది. వందలాది చెట్లు పడిపోయాయి. రోడ్లు, వీధులు కూలిన చెట్లతో నిండి ఉన్నాయి. పెంకుటిళ్లు పడిపోయాయి. ముత్తుకూరు, కోవూరు, గూడూరు తాలూకా ఆఫీసు, పబ్లిక్ భవనాలు నిట్టనిలువుగా కూలిపోయాయి. కలెక్టర్ ఇంటి భవనం, ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు కూలిపోయాయి. కలెక్టర్ కార్యాలయ కాంపౌండులో మర్రిచెట్లు వేళ్లతో సహా నేలకూలింది. టౌను హాలు, జూబ్లీ హాస్పిటల్ బాగా దెబ్బతిన్నాయి. అప్పటికే పక్కాభవనాలు నిర్మించుకున్న చర్చిలు, ప్రైవేటు ఆస్పత్రులు, మిషన్ స్కూలు భవనాలు కూలిపోయాయి. మునిసిపాలిటీ వాటర్ వర్క్స్, ఆయిలుతో ఏర్పాటుచేసిన పట్టణంలోని వీధి దీపస్తంభాలు, వాషింగ్టన్ లైట్స్ కూడా దెబ్బతిని చాలాకాలం నెల్లూరును అంధకారంలో ఉంచాయి. పెద్ద పడుగుపాడు వద్ద గూడ్సురైలు పడిపోయింది.
పెన్నా వరదల వల్ల ఉత్తర, దక్షిణాలకు సంబంధాలు తెగిపోయాయి. టెలిగ్రాఫ్ వ్యవస్థ ధ్వంసమైంది. మామిడి, కొబ్బరి, తాటిచెట్లు లక్షల్లో పడిపోయాయి. దీంతో కొంతకాలం వరకు ఇంటిని కప్పుకొనేందుకు తాటి ఆకులు కూడా దొరకని పరిస్థితి. పశువులు, కోళ్లు, మేకలు కూడా వందలాదిగా చనిపోయి పల్లెలు దుర్గంధపు కేంద్రాలయ్యాయి. ఈ గాలివానకు 629 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో 378మంది నెల్లూరు తాలూకాలో, నెల్లూరు పట్టణంలో 22మంది, కోవూరు తాలూకాలో 113మంది మృతిచెందారు. భవనాలు, పైకప్పులు, జింక్ షీట్లు కూలటం నెల్లూరులో ప్రమాదాలకు కారణం అయింది. మరికొంతమంది గాలికి కొట్టుకుపోతూ మృతిచెందారు. ఇంకొందరి అచూకీ లేదు. 50,324 పశువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కోవూరు, రావూరు, నెల్లూరు తాలూకాలలో ఈ ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి.
పశువులు, మనుషులు మృతిచెందటం, మృతదేహాలు కుళ్లిపోవటం, పారిశుధ్యానికి సిబ్బంది కూడా లేని భయానక పరిస్థితిలో కలరా వ్యాపించింది. నెల్లూరులో 1880 మందికి కలరా సోకి, 876మంది మృత్యువాత పడ్డారు. కోవూరు తాలూకాలో 700 మందికి కలరా సోకి అందులో 190మంది మృతి చెందారు. గాలివాన తర్వాత కూడా పదిరోజుల పాటు వర్షాలు పడుతూనే ఉండటం జిల్లాకు శాపమైంది. నష్టాన్ని చూసేందుకు మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి రెవెన్యూ అధికారి హెచ్.జి. స్టోక్స్ నెల్లూరొచ్చారు. మద్రాసు గవర్నరు లార్డ్ గోషన్ జిల్లాలో పర్యటించి 20వేల రూపాయలను తుఫాను బాధితుల సహాయార్థం అందజేశారు. కలరా బాధితులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ముత్తుకూరు, సర్వేపల్లి, కొడవలూరు, ఫిర్యాలలో రామకృష్ణమిషన్ అమోఘమైన సేవలు అందించింది. బియ్యం, బట్టలు మాత్రమే కాక, ఇళ్లు కూడా ఈ సంస్థ నిర్మించింది. జాలర్లకు పడవలు చేయించింది. చిన్న ఉద్యోగులకు వంద రూపాయలు వడ్డీలేకుండా రుణం ఇచ్చింది.
గాలివాన, కలరా వల్ల చాలామంది పిల్లలు అనాథలయ్యారు. ఆరు అనాథాశ్రమాలు కూడా వీరి కోసం ఏర్పాటు చేశారు. గాలివాన వచ్చిన ఐదురోజుల తర్వాత కూడా పెన్నాకు వరదలు వస్తున్నాయనే భయాందోళన పట్టణంలో నెలకొంది. ఇళ్లు, గూళ్లు వదిలేసి ప్రజలంతా ఎత్తు ప్రాంతంలో ఉన్న (ప్రస్తుతం దర్గామిట్ట) జిల్లా కలెక్టర్, ఎస్.పి బంగళాలకు చేరుకున్నారు. అధికారులు విచారించి, ఇది కేవలం పుకారు అని, ఎద్దుల బండ్లు ఏర్పాటుచేసి ప్రజలను ఇళ్లకు పంపారు.
- ఈతకోట సుబ్బారావు