‘మట్టికాళ్ల మహారాక్షసి’కి బొద్దింకల సవాల్
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:28 AM
‘ఇట్ ఈజ్ రైట్ టు రెబెల్’ అనే ఈ వాక్యానికి కాలం చెల్లిందనుకునే వాళ్లకు, ఢిల్లీలో జూన్ 20న జంతర్ మంతర్ నుంచి భారత పార్లమెంట్ కొత్త భవనం మధ్య ఉన్న వీధులు గట్టి జవాబిచ్చాయి. సుమారు నెలరోజులుగా...
‘ఇట్ ఈజ్ రైట్ టు రెబెల్’ అనే ఈ వాక్యానికి కాలం చెల్లిందనుకునే వాళ్లకు, ఢిల్లీలో జూన్ 20న జంతర్ మంతర్ నుంచి భారత పార్లమెంట్ కొత్త భవనం మధ్య ఉన్న వీధులు గట్టి జవాబిచ్చాయి. సుమారు నెలరోజులుగా జంతర్ మంతర్ దగ్గర గుమిగూడిన వేలాదిమంది చాలా ప్రశాంతంగా జవాబిచ్చారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో, ప్రజాస్వామికవాదుల మద్దతుతో యువత గుమిగూడిన సందర్భం అది. ప్రశాంతంగా, ఏ రకమైన ఉద్రిక్తతలు లేకుండా మొదలైన ఈ ఆందోళన పార్లమెంట్ మార్చ్ రోజు ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. రాజ్య యంత్రాంగం, గోదీ మీడియా, అంధ భక్తుల సోషల్ మీడియా అన్నీ కుతుబ్ మినార్ పైకెక్కి– ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్నది పాకిస్థాన్ అని, సోరోస్ అనీ, అర్బన్ నక్సల్స్ అనీ దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమం ఇది.
చాలా కాలం తర్వాత ఢిల్లీ వీధుల్లో భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీచిన ఈ కొంచెం గాలి, కేవలం ఢిల్లీకే పరిమితం కాదని అర్థమవుతున్నది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగే ప్రదర్శనలు, సంసద్ మార్గ్ ప్రవేశించేముందే ఆగిపోయే దృశ్యాల్ని చూసిన మనకు.. కొత్త పార్లమెంట్ ముందు వరకు ప్రదర్శనకారులు చేరుకుని అధికార పీఠాన్ని సవాలు చేయడాన్ని చూడడం ఒక కొత్త అనుభవం. న్యూఢిల్లీ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేసి ఢిల్లీలో జరుగుతున్న నిరసన, దేశానికి తెలియకుండా చేసే ప్రయత్నం చేసినా, ‘దేశ్‌బంధు’ అనే చానెల్ లైవ్‌లో చూపించింది. మెట్రో స్టేషన్లను మూసివేసి ప్రదర్శనకారులు రోడ్లకెక్కొద్దని ఎన్ని చర్యలు తీసుకున్నా, సెంట్రల్ ఢిల్లీ వైపునకు ఢిల్లీలోని అన్ని వీధులు ప్రవాహంలా కదలడం రాబోయే కాలపు ప్రజా ఉద్యమాలకు సంకేతం.
మోదీ పొద్దున్నే పార్లమెంట్ ముందు నిలబడి ‘దేశం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ఎక్కింది’ అని చెప్పి లోపలికి వెళ్లి వర్షాకాల సమావేశాలు మొదలుపెట్టగానే, ఈ దేశ విద్యార్థులు, యువత ‘ఉద్యమాల ఎక్స్‌ప్రెస్’ ఎక్కి పార్లమెంట్‌కు చేరుకున్నారు. నాకు తెలిసి ప్రదర్శనకారులకు భయపడి పార్లమెంట్ గేట్లకు తాళాలు వేసిన సందర్భం ఇప్పటివరకు లేదు. పార్లమెంట్ భవనం లోపలి నుంచి పోలీసు బలగాలు తుపాకుల్ని బయటకు ఎక్కుపెట్టిన దృశ్యం కూడా కొత్తదే. పొద్దున్నే మోదీ మీడియాను ఉద్దేశించి ‘బలమైన వాదనలు, బలమైన వాస్తవాలు’ ఉంటే పార్లమెంట్ చర్చల్లో తుపానులు అవసరం లేదని చెప్పి వెళ్లగానే, భాజపా సర్కారుపై విద్యార్థి యువత ప్రదర్శన తుపానులా విరుచుకుపడింది.
పార్లమెంట్ స్ట్రీట్‌లో, ఇంకొన్ని ప్రాంతాల్లో లాఠీచార్జీలో పదుల సంఖ్యలో ప్రదర్శనకారుల తలలు పగిలాయి. ఎన్నోచోట్ల బాష్పవాయు గోళాల్ని పేల్చినా విద్యార్థులు, యువత వెనక్కు తగ్గలేదు. అమిత్ షా ఆదేశాలతో నడిచే ఢిల్లీ పోలీసులు సోనమ్ వాంగ్‌చుక్‌ను దీక్షా స్థలం నుంచి మూటలా కట్టి ఎత్తుకుపోయి, ఏ శాంతిభద్రతల్ని మెరుగుపరుస్తున్నారో ప్రజలకు అర్థమైంది. దేశానికి అధికార కేంద్రమైన సెంట్రల్ ఢిల్లీ వీధులన్నీ పోలీస్, పారా మిలిటరీ బలగాలతో యుద్ధరంగంలా కనిపించాయి.
సోనమ్ వాంగ్‌చుక్‌ను ఎత్తుకుపోయిన తర్వాత జంతర్ మంతర్ దీక్షా స్థలంలో అప్పటివరకున్న విద్యామంత్రి ‘ప్రధాన్’ రాజీనామా డిమాండ్ ‘ప్రధాని’ మోదీ రాజీనామా డిమాండ్‌గా మారింది. విద్యామంత్రి ప్రధాన్ ఇప్పటివరకు రాజీనామా ఇవ్వకపోవటానికి కారణం మోదీ–షాల అపరిమిత అధికార అహంకారమనేది స్పష్టం. ఎందుకంటే, నేటి భారతదేశంలో నిర్ణయాలు చేసే ద్వయం వీళ్లే. తనది ‘ఛప్పన్ ఇంచ్ కా సీనా’ (యాభై ఆరు అంగుళాల విశాలమైన ఛాతీ) అని చెప్పుకునే మోదీ మనసులో నీట్ బాధితులపై కనికరం లేదు. ఈ పార్లమెంట్ మార్చ్ అనేది మోదీ, అమిత్ షాలకు ఈ దేశ విద్యార్థి, యువత చేసిన ధిక్కారం. ఈ మధ్యే చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన అభిజీత్ దీప్కే... కాక్రోచ్ జనతా పార్టీని మొదలుపెట్టిన రోజుల్లో కొందరు ప్రజాస్వామిక వాదులు సైతం వాళ్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యామంత్రి రాజీనామా డిమాండ్‌పై గట్టిగా నిలబడి, పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ తన విశ్వాసాన్ని నిలుపుకున్నట్టే. ఎందుకంటే ఈ పన్నెండేళ్ల బీజేపీ పాలనలో ఆదివాసీ, దళిత, విప్లవ పోరాటాలతో సహా అన్నిటినీ అణచివేసి, ఒక ఫాసిస్ట్ పాలనను నెలకొల్పిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ‘బొద్దింకలు’ పార్లమెంట్ వరకు వెళ్లడం ఒక ఆశాకిరణం కాక మరేమిటి?
ఢిల్లీ వీధులు నిరసనకారుల నినాదాలతో మార్మోగుతూ ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే... ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో తుపానులు, దేశంలో ఉప్పెనలు వస్తాయి. ఇప్పటివరకు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు సైతం, వారితో కలిసి ఉద్యమిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక రాజకీయాన్ని ఎదుర్కోలేవు. ఇది ప్రతిపక్షం తెలుసుకోకపోతే వారికే నష్టం.
జంతర్ మంతర్ ఒక ఖగోళశాస్త్ర వేధశాల. అక్కడ ఉన్న సామ్రాట్ యంత్రం అనే ఒక నిర్మాణం, కాలాన్ని లెక్కించేందుకు ఏర్పాటైంది. మెటఫరికల్‌గా చూస్తే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ ఎన్నో ఉద్యమాలను భారత రాజకీయ కాలమానంలో రికార్డు చేసింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు చేసిన పోరాటాన్ని మోదీ యంత్రాంగం, మీడియా సహాయంతో అణచివేసింది. ప్రజా ఉద్యమాలకు మళ్లీ సమయం వచ్చిందని సామ్రాట్ కాలయంత్రం ఇప్పుడు చెబుతున్నది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
చరిత్ర పరిశోధకులు, సామాజిక విశ్లేషకులు