Share News

ప్రేమలో కులాన్ని చర్చించేందుకే ‘నీలి గులాబీలు’

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:35 AM

‘‘మా రహస్యపు చావుల్ని అక్షరీకరిస్తే/ పత్రికలనిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి./ ఈ దేశంలోని ఏ నేలను తవ్విచూసినా మా అస్థిపంజరాలు మట్టి గొంతుకల్లో సాక్ష్యమిస్తాయి’’ – అని కవి ఎండ్లూరి సుధాకర్ అన్నట్లుగా...

ప్రేమలో కులాన్ని చర్చించేందుకే ‘నీలి గులాబీలు’

‘‘మా రహస్యపు చావుల్ని అక్షరీకరిస్తే/ పత్రికలనిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి./ ఈ దేశంలోని ఏ నేలను తవ్విచూసినా మా అస్థిపంజరాలు మట్టి గొంతుకల్లో సాక్ష్యమిస్తాయి’’ – అని కవి ఎండ్లూరి సుధాకర్ అన్నట్లుగా ఆధునికానంతర దళిత స్త్రీల సాహిత్యానికి దిక్సూచిగా మానస ఎండ్లూరి, అరుణ గోగులమండ సంకలనాలు సాగుతున్నాయి. ‘మార్జిన్స్ ప్రచురణ’ల ద్వారా ఆధునిక సమాజంలో దళితుల వేదనను, ముఖ్యంగా దళిత స్త్రీల పట్ల వివక్షను, అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలుగా నిలబడి, మనోనిబ్బరంతో ముందుకు సాగుతున్నారు వీరిద్దరూ. నిత్య గాయాల నెలవంకల జీవిత కథలను ‘ముళ్ల చినుకులు’గా కథా సంకలనం చేసి పాఠకలోకాన్ని ఆలోచింపచేశారు. ఇప్పుడు తమ సంపాదకత్వంలో మరోకొత్త కథాసంకలనం ‘నీలిగులాబీలు’ వెలువరించారు. ఈ కథలు ప్రేమి‘కుల’వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ పుస్తకం విడుదల సందర్భంగా సంపాదకులు ఇద్దరితోనూ చిరు సంభాషణ.


ప్రేమ, ప్రేమికులు అంటే తెలుసు. ప్రత్యేకంగా దళిత ప్రేమకథలు సంకలనం తీసుకురావడంలో మీ ఉదేశ్యం ఏమిటి?

దళిత ప్రేమేంటి? అనే ఉద్దేశపూర్వకమైన అమాయకపు ప్రశ్నలు మాకు వస్తూనే ఉన్నాయి. ఇక మీదట కూడా వస్తాయి. మన దేశంలో ప్రతి ప్రేమకి కులం ఉండడమో లేకపోకవడమో కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ దేశంలో గాలికీ కులముందని పట్టింపులు పాటిస్తున్న వాళ్ళు కూడా ప్రేమ దగ్గరికి వచ్చేసరికి నీతులు వల్లిస్తూ ప్రేమనేది విశ్వజనీనమైనదని కులాలకీ వర్గాలకీ అతీతమైనదని నమ్మిస్తుంటారు. నిజజీవితం వేరుగా ఉంటుంది. దళిత ప్రేమలని కాసేపు పక్కన పెడితే, ఇతర కులాంతర ప్రేమల్లో కూడా ఈ చర్చ జరగాలి. వేరు వేరు పెద్ద కులాలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నా మావి ఆదర్శ వివాహం అని చెప్పుకున్నప్పుడు అక్కడ కులం లేదా? ఇక ప్రేమకి జాతి లేదు మతం లేదు అని పాటలు పాడుకోడం దేనికి? ఇప్పుడు queer ప్రేమను కూడా అంగీకరిస్తున్న రోజులకు వచ్చేశాం. ఇంకా ముందే రావాల్సింది కూడా. కానీ ప్రేమకి కులం ఉందన్న విషయంపై ఎందుకు నోరు మెదపం? Queer కమ్యూనిటీలో ఉండే విలక్షణత్వం, జండర్‌ బయాస్‌, స్టిగ్మా, ఫోబియా గురించి మాట్లాడినంత ఉత్సాహంగా అక్కడ ఉండే కులం గురించి ప్రస్తావన ఉండదు. కార్పొరేట్, బ్యూరోక్రసీ, పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్, సాహిత్యం, సంగీతం, సినిమా, విద్యా సంస్థల్లో ప్రతి చోటా కులముంటుంది గానీ దాని ప్రస్తావించడం, ప్రశ్నించడం ఉండదు. ఇలా ప్రేమకథలలోను, ప్రేమికుల మధ్య ఉండే కులాన్ని గురించి చర్చ జరగాలి అన్న తృష్ణతో తెచ్చిన పుస్తకమే ఇది.


దళిత సంకలనాలు అనగానే రచయితలూ దళితులే అయి ఉండాలన్న నియమంపై పుస్తకాలు వస్తుంటాయి. కానీ ఈ పుస్తకంలోని 24 మంది రచయితలలో దాదాపు అన్ని సామాజిక వర్గాల రచయితలు కనిపిస్తున్నారు? కేవలం దళితులే రాయలన్న నియమాన్ని మీరు ఎందుకు ఎంచుకోలేదు?

మేం ఇదివరకు తెచ్చిన ‘ముళ్ళ చినుకులు’ దళిత కథా సంకలనంలో కూడా అన్ని వర్గాల వారి నుంచీ కథలను ఆహ్వానించాం. సమస్య, వస్తువు దళితులది అయినప్పటికీ మాట్లాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందని సంపాదకులుగా మేం నమ్మాం. దళితులు, శూద్రులు అనేవారు తమంతట తాముగా ఆయా కులాలని ఎంచుకోలేదు. మరొకరు ఎంచుకున్నారు. ఇంకెవరో వీళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. అటువంటప్పుడు కేవలం దళితులే వారి వెతలని వెళ్లబోసుకోవడంతో పాటు దళితేతర రచయితలు కూడా తమ దృక్పథం, కోణం నుంచి దళిత కథలను చెప్పాలని, చర్చించాలని కోరాం. ముఖ్యంగా పైకులాల రచయితలు దళితుల పట్ల సానుభూతి సాహిత్యం రాసే రోజులు పోయాయన్న నమ్మకంతోనే అందరినీ ఆహ్వానించాం. కథా వస్తువు దళిత ప్రేమ అన్నాం కానీ రచయితల పట్ల గిరి గీయాలని అనుకోలేదు.


ఈ ‘నీలి గులాబీలు’ దళిత ప్రేమకథల సంకలనం ద్వారా, అచ్చమైన ప్రేమతత్వాన్ని పాఠకులకు అందించారనుకోవచ్చా?

ఇది కేవలం ప్రేమకథా సంకలనం కాదు. కుల అహంకారంతో పూవులాంటి సున్నితమైన ప్రేమను కొన్ని వేలసార్లు హత్య చేసిన ఎన్నో నిజమైన గాథలు ఇవి. మనం రోజూ బ్రేకింగ్ న్యూస్‌లో వినీ వినీ సాధారణమైన విషయాలుగా మారిపోయిన ఛిద్రమైన ప్రేమికుల సాక్ష్యాలు ఇవి. ఈ పుస్తక ఉద్దేశం కూడా ప్రేమను ప్రేమలానే ఉండనివ్వండి, దానికి కులం మతం అంటగట్టకండి అని చెప్పడమే.


అస్తిత్వవాద ప్రేమల గురించి ప్రేమ కథలు, కవిత్వం తెలుగులో ఇదివరకు కూడా వచ్చాయి. వాటికి మీరు సంపాదకత్వం వహించిన ఈ ‘నీలిగులాబీలు’ ఎలా భిన్నం?

అవును. ఇదివరకు పలు సంకలనాలలో ప్రేమను రకరకాల కోణాలలోంచి, సామాజిక నేపథ్యాల నుంచి పరిచయం చేశారు, చర్చించారు. ‘నీలిగులాబీలు’ కేవలం ప్రేమలో కులాన్ని మాత్రమే కాదు, జెండర్‌, ప్రాంతం, దళితుల మధ్యన కూడా ఉండే బేధాలు... ఇలాంటివి ఎన్నో చదివిస్తుంది. చర్చ రేపుతుంది. ఈ ప్రేమకథలలో వర్గాలకి, కులమతాలకి అతీతంగా ప్రతి స్త్రీ బాధితురాలిగా ఉంటుందా లేక వర్గం మారే కొద్దీ స్త్రీ పరిస్థితి మారుతుందా అన్నదానికి ఒక్కో కథ ఒక్కో చర్చగా నిలుస్తుంది. రాయలసీమ, తెలంగాణ నుంచి అధికంగా కథలు వచ్చాయని చెప్పవచ్చు. సీనియర్ రచయితలైన జ్వలిత దెంచనాల, జి. వెంకటకృష్ణ నుంచి నీలిగులాబీల కోసమే మొట్ట మొదటి కథ రాసిన మేరెడ్డి రేఖ వరకూ ఇరవై నాలుగు మంది ఇందులో రాశారు.

ఇంటర్వ్యూ :

కట్టూరి వేంకటేశ్వర రావు

Updated Date - Apr 13 , 2026 | 01:39 AM