Share News

కాలానికి కత్తిరింపులు.. యుగాలకు కుదింపులు!

ABN , Publish Date - Aug 04 , 2026 | 02:31 AM

కాలాన్ని కత్తిరించవచ్చు! యుగాలను కుదించవచ్చు! వినటానికి ఇదంతా వింతగానూ అనిపించొచ్చు! కృతకంగానే కనిపించొచ్చు! కానీ ఈ కృతకత్వమే ఇప్పుడు మహాకార్యంలా సాగిపోతోంది. ఎన్సీఈఆర్టీ...

కాలానికి కత్తిరింపులు.. యుగాలకు కుదింపులు!

కాలాన్ని కత్తిరించవచ్చు! యుగాలను కుదించవచ్చు! వినటానికి ఇదంతా వింతగానూ అనిపించొచ్చు! కృతకంగానే కనిపించొచ్చు! కానీ ఈ కృతకత్వమే ఇప్పుడు మహాకార్యంలా సాగిపోతోంది. ఎన్సీఈఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) పాఠ్యపుస్తకాల్లో ఈ కృత్రిమ కత్తిరింపులు సాగిపోతూనే ఉన్నాయి. మరోవంక నగరాల పేర్లూ మారిపోతున్నాయి. ఎందుకు ఇదంతా జరుగుతోందని ప్రశ్నించుకుంటే ఒక దృష్టి కనపడుతుంది. చరిత్ర గురించి ఒక అంచనా స్పష్టమవుతుంది. కాలాల కత్తిరింపులకూ యుగాల కుదింపులకూ మూలాలన్నీ ఇందులోనే ఉన్నాయి. క్రీస్తుశకం 1200లకు ముందు మనకంతా స్వర్ణయుగమేననీ ఆ తర్వాతే బానిసయుగం మొదలైందనే అంచనాతోనే పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు జరుగుతున్నాయి. బానిసయుగం క్రీస్తుశకం 1200లోనే ఎందుకు ప్రారంభమైందన్న భావనకు అనూహ్యమైన కారణమేమీ లేదు. ముస్లిం సుల్తానుల పాలనతో (1206) బానిసయుగం మొదలైందనే ఆలోచనే దీని వెనుక ఉంది. ఈ బానిస యుగాన్ని ముస్లిం పాలనకే పరిమితం చేయలేదు. బ్రిటిషు పాలనకూ విస్తరించారు. కానీ ప్రధానంగా దాన్ని ముస్లిం నవాబులు, మొఘలు పాదుషాల పాలన చుట్టూ కేంద్రీకరించి, చరిత్ర పాఠాల్లో సంస్కరణలు మొదలుపెట్టారు. నవాబులు, పాదుషాల పాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చి మన చరిత్ర పాఠ్యపుస్తకాలను తయారుచేశారనీ.. అంటే బానిసయుగంపై అనుచితంగా దృష్టిపెట్టారనీ.. దీన్ని సవరించటమే తమ ఉద్దేశమని ఎన్సీఈఆర్టీ సమర్థించుకుంది. పాలకపార్టీ నేతలు కూడా దాన్నే పదేపదే చెప్పారు. మొత్తంమీద మన చరిత్రలో 700 సంవత్సరాల ‘బానిసత్వం’పై 2014 తర్వాత చర్చ బాగా మొదలైంది. ప్రధాని మోదీ దీని గురించి పలుచోట్ల విపులంగా మాట్లాడారు. ‘భారతదేశం సుమారు 700 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించింది. ఈ దీర్ఘకాల బానిసత్వం వల్ల మన ఆత్మవిశ్వాసం, మన సంస్కృతి, మన జాతీయ చైతన్యం దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ బానిస మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడాలి. స్వతంత్ర భారతదేశం తన వారసత్వంపై గర్వపడుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’. ఇవి ప్రధాని మోదీ అన్న మాటలు. ఇందులో ’మన ఆత్మవిశ్వాసం‘, ‘మన సంస్కృతి’, ‘మన జాతీయ చైతన్యం’ అన్న మూడు విషయాలు చాలా కీలకమైనవి. ఈ మూడు 700 సంవత్సరాల కాలంలో దారుణంగా దెబ్బతిన్నాయనటానికి చరిత్రలో మనకు ఆధారాలు దొరకవు. సంపద సృష్టించే శ్రామికవర్గాలు ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. రైతులు పంటలు పండిస్తూనే వచ్చారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటమూ మానలేదు. సంపదను పెంచటంలో అలసత్వాన్నీ ప్రదర్శించలేదు. పొగాకు, మిరపకాయ, మొక్కజొన్న, బంగాళాదుంప, టమాటా, బొప్పాయి, జీడిపప్పు, అనాసపండు, సీతాఫలం, పుచ్చకాయ, కర్బూజ, బాదం, పాలకూర, దానిమ్మ లాంటివన్నీ ‘బానిసత్వ’ కాలంలోనే విదేశాల నుంచి ఇక్కడకు వచ్చాయి. ఇవన్నీ రైతులు స్వీకరించి ఇక్కడ సాగుచేశారు. కొన్నిటిని విస్తృతంగానూ, కొన్నిటిని పరిమితంగానూ పండించారు. వస్త్రపరిశ్రమ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన చరఖా (స్పిన్నింగ్‌ వీల్‌), పత్తిని ఏకే విల్లు, తివాచీల అల్లిక, మెరుగుపూత పూసిన మట్టిపాత్రలు, బావుల నుంచి నీటిని తోడటాన్ని సులభతరం చేసిన పర్షియన్‌ చక్రం (ధున్కీ), కాగితం తయారీ, తుపాకులు, ఫిరంగుల నిర్మాణం, కమానులు, గుమ్మటాలు నిర్మించే శిల్పచాతుర్యం, సున్నపు గారా (లైమ్‌ మోర్టార్‌), ముద్రణ యంత్రం, ఇనుము–ఉక్కు పరిశ్రమల్లో నాణ్యతా ప్రమాణాలు పెరగటం లాంటివన్నీ ‘బానిసత్వ’ యుగంలోనే దేశంలో ప్రవేశించి విశేషమార్పులకు దోహదం చేశాయి. వ్యవసాయం, చేతివృత్తులు, పరిశ్రమల తీరును తీవ్రంగా ప్రభావితం చేసిన ఆ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఆత్మవిశ్వాసం కోల్పోయిన ప్రజలు అంత తేలికగా అందుకోలేరు. ప్రయోగశీలతే ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.


పాలకులది ఇస్లాం మతం కాబట్టి, రాజకీయ కారణాలతో వారు కొన్నిచోట్ల గుళ్లుగోపురాలను ధ్వంసం చేసిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని 700 సంవత్సరాల కాలాన్ని మన సంస్కృతి బాగా దెబ్బతిన్న యుగంగా భావించలేం. కులంపై ఆధారపడిన మన సామాజిక వ్యవస్థను ముస్లిం పాలకులు విచ్ఛిన్నం చేయలేదు. అలా విచ్ఛిన్నం చేయాల్సిన రాజకీయ అవసరం వాళ్లకి కనిపించలేదు. ఆ అవసరం ఉండి ఉంటే దాన్ని చేసి ఉండేవాళ్లేమో. ఏ యుగంలోనైనా రాజకీయ అవసరం దేన్నైయినా చేయిస్తుంది. కులవ్యవస్థ వల్ల పన్నులను రాబట్టడం సులభం అయింది. శిస్తులు, పన్నులు వసూలుచేసే జమీందార్లూ రైతు కులాల నుంచే వచ్చారు. వాళ్లకు తోడుగా ఉండే మజుందార్లు, మున్షీలు, కరణాలు, కులకర్ణీలు, దేశ్‌పాండేలు బ్రాహ్మణ కులాల నుంచే వచ్చారు. వీళ్లపైనే ఆధారపడి ముస్లిం పాలకులు అధికారాన్ని చలాయించారు.

ఏ సంస్కృతీ మార్పుచెందకుండా ఉండదు. 700 ఏళ్లల్లో భారత్‌ అనేక సంస్కృతుల ప్రభావానికి లోనైంది. అన్యమతాల ప్రభావంతో సర్వం నాశనమైందనుకుంటే అంతా చీకటిగానే కన్పిస్తుంది. ఎంతో గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమం ఆ 700 ఏళ్ల కాలంలోనే బలపడి ప్రజలపై విశేష ప్రభావాన్ని కలగచేసింది. బలవంతపు మతమార్పిడులు పెద్దఎత్తున జరిగి ఉంటే మన సమాజ ముఖచిత్రమే మారిపోయి ఉండేది. ఇక మధ్యయుగాల్లో జాతీయ చైతన్యం గురించి ఎక్కువగా చెప్పుకోటానికి ఉండదు. మనమందరం ఒక జాతికి చెందినవారమనే భావన మధ్యయుగాల్లో ఎక్కడా లేదు. ఇది భారతదేశానికే పరిమితమైంది కాదు. యూరపులోనూ ఆనాడు జాతీయ భావన లేదు. దేశమంతా అనేక రాజ్యాలుగా విడిపోయి ఉన్న కాలంలో మనమంతా భారతీయులమనే భావననే ఊహించలేం. జాతీయ భావన ఉంటే హిందూ పాలకులు ఏకమై ఉండేవారు. విదేశాల నుంచి వచ్చిన పాలకులకు వ్యతిరేకంగా సంఘటితం అయ్యేవారు. అదెప్పుడూ జరగలేదు. హిందూ పాలకులు ముస్లిం సైన్య విభాగాలను ఏర్పాటుచేసుకుని శత్రువులపై దండెత్తిన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఆనాడు విధేయత కులాలకు, తెగలకు, చిన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది.


ప్రతి యుగంలోనూ మంచీచెడులు ఉంటాయి. ఒక మతానికి చెందిన పాలకులందరినీ ఒకేగాటన కట్టటం సంకుచితమే అవుతుంది. మతదృష్టితో 700 సంవత్సరాల చరిత్రను కుదించివేసి, ఆ కాలంలో వచ్చిన మార్పులను విద్యార్థులకు సమగ్రంగా పరిచయం చేయకపోతే జరిగే నష్టమే ఎక్కువ. మనకు ఇష్టమున్నా లేకపోయినా మొఘలు సామ్రాజ్యకాలంలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాలకుల మతం ఏదైనా పాలన జనరంజకంగా ఉందా? జనవినాశనంగా ఉందా? అన్నదే ప్రధానంగా చూడాలి. ప్రపంచ వస్తుసేవల ఉత్పత్తిలో (జీడీపీ) మొఘల్‌ పాలన ఉచ్ఛదశలో ఉన్నకాలంలో (1700) భారత్‌ వాటా 25శాతం ఉండేది. చైనా వాటా కూడా ఇంచుమించు అంతే. రెండు దేశాల జనాభా కూడా సమానంగానే ఉండేదని చరిత్రకారులు లెక్కలు కట్టారు. వస్త్ర ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానాన్ని సంపాదించింది. మసాలాదినుసులు, నీలిమందు, పట్టు, చేతివృత్తుల ఉత్పత్తులను విస్తృతంగా ఎగుమతి చేసేది. పర్షియా, మధ్య ఆసియా, యూరపు, ఆగ్నేయాసియా దేశాల్లో భారత ఉత్పత్తులకు విపరీతంగా గిరాకీ ఉండేది. ఇంతటి వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థ ఉండి, వెండి నగదు చలామణి అధికంగా ఉన్న మొఘల్‌ పాలనాకాలానికి చరిత్రలో ప్రాధాన్యాన్ని తగ్గించి వేయటం మన చరిత్రను మనమే తక్కువ చేసుకోవటం అవుతుంది. హిందూ రాజుల పాలనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదనే వాదనతో మొఘల్‌ చరిత్రకు కత్తెర వేయటాన్ని సమర్థించుకుంటున్నారు గానీ అది వాస్తవాల ముందట నిలబడదు. సంగమ సాహిత్యం, చోళ, పాండ్య రాజుల ప్రస్తావన లేకుండా తమిళనాడులో చరిత్ర బోధన ఉంటుందా? అలాగే శాతవాహన, కాకతీయ, విజయనగర తదితర సామ్రాజ్యాలకు అగ్రస్థానం లేకుండా తెలుగు చరిత్ర పాఠాలు ఉంటాయా? ప్రతి భాషా రాష్ట్రమూ సొంత ప్రాంతంలో స్థానిక రాజ్యాలకు పెద్దపీట వేసింది. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో మొఘల్‌ చరిత్రను కుదించటానికి ఇతర రాజ్యాలకు ఎక్కువ చోటు ఇవ్వటం అసలు కారణం కాదు. 700 సంవత్సరాల బానిసత్వం అనే సూత్రీకరణతో చరిత్రను అపసవ్య దృష్టితో చూడటంలోనే మూలం ఉంది.

అనేక ప్రభావాలతో దేశంలో ఏర్పడిన ఉమ్మడి సంస్కృతిని కృత్రిమంగా కత్తిరించి తమకు ఇష్టమైన ముక్కలను మాత్రమే చూపించటానికి ఎన్ని విన్యాసాలు చేసినా సఫలీకృతం కాలేరు. దేశంలో చరిత్ర పరిశోధనలను పటుత్వం లేకుండా చేయొచ్చు. పాఠ్యాంశాలను మతదృష్టితో సంకుచితం చేయొచ్చు. కానీ ప్రతిష్ఠాత్మక ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో భారత చరిత్రపై సాగే పరిశోధనలను ఆపలేరు. సుదీర్ఘ చరిత్రలోని మంచిచెడులపై నిష్పాక్షిక అంచనాలను అరికట్టలేరు. ఇంటర్నెట్‌ యుగంలో, సోషల్‌ మీడియా ఉధృతిలో ఏకపక్ష దృష్టితో చరిత్రను శాసించటం కుదరదు. దీన్ని గ్రహించటానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలుగుభాషను చూస్తేనే 700 ఏళ్ల కాలం ప్రభావం ఎంత ప్రగాఢంగా ఉందో అర్థమవుతుంది. పర్షియన్‌, అరబ్బీ, ఉర్దూ నుంచి వచ్చిన అనేక పదాల్లేకుండా ఈనాటి తెలుగును ఊహించలేం. అవి లేకుండా సంభాషణలను చేయలేం.


దుకాణం, బజారు, ఖర్చు, ఖరీదు, నగదు, బాకీ, కిస్తీ, గోదాం, తుపాకీ, బురుజు, వకీలు, జరిమానా, ఖైదీ, దస్తావేజు, సర్కార్‌, ఖజానా, ఖాతా, రసీదు, శిస్తు, పట్వారీ, తహసీల్దార్‌, తాలూకా, జమీందార్‌, పరగణా, ఇనాం, జాగీరు, కౌలు, పట్టా, రైతు, సర్దార్‌, సిపాయి, బయానా, నాజూకు, దర్జా, దర్జీ, గులాబీ, ఖరారు, జమానా, రివాజు, మజా, హుషారు, జోష్‌, ఖతం, పునాది, కబురు, జాగా, అసలు, మామూలు, తయారు, రోజు, హుకుం, బందోబస్తు, ఫిర్యాదు, అర్జీ, మంజూరు, దలాల్‌, మాల్‌, జవాబు, ఖుషీ, దోస్తు, మెహందీ, హల్వా, పులావు, బిర్యానీ, అత్తరు, కుర్చీ, పైజామా, పరదా, రుమాలు, గల్లీ, దర్వాజా, నకిలీ, సవాల్‌, ముక్తసరి, తారీఖు, తర్జుమా, కాగితం, కలం, సిరా, హైరానా, జల్సా, మైదానం, టోపీ, తమాషా, హద్దు, సరిహద్దు, జిల్లా, రవాణా, జమాబందీ, తరాజు, తనఖా, జమ, జెండా, వసూలు, రద్దు, దావా, రాజీనామా, దఫా, జప్తు, జామీను, కబ్జా, ఫైసలా, హాజరు, గైరుహాజరు, మాఫీ, హక్కు, మున్షిఫ్‌, దఖలు, దగుల్బాజీ, హవాలా, ఖరీఫ్‌, రబీ, సబబు, సరంజామా, భర్తీ, భరోసా, హోదా, సరఫరా, సదరు, సతాయించు, సంజాయిషీ, షరతు, బేష్‌, హంగామా, హడావుడి, ఉడాయింపు, షరా, ఆసామీ, ఆలుగడ్డ లాంటి పదాలెన్నో తెలుగులో చేరిపోయాయి. సీపీ బ్రౌన్‌ మిశ్రమభాషా నిఘంటువు చూస్తే ఇంకా ఎన్నో పదాలు ఇలాంటివి కనపడతాయి.

సంస్కృతుల మధ్య ఇచ్చిపుచ్చుకోటాలు ఉండవనే దృష్టితో చూస్తే భారతీయతే అర్థంకాదు. బయట నుంచి వచ్చిన పాలకులు అన్యమతస్థులైనా ఇక్కడ ప్రజల్నీ సమాజాన్నీ అధోగతి పాలుచేశారా, పురోగతివైపు నడిపించారా? అన్నది చూడటమే చరిత్రలో ముఖ్యం. మధ్య ఆసియా నుంచి ఇక్కడకు వచ్చిన ఆర్యులకైనా, మరొకరికైనా ఇదే వర్తిస్తుంది.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 02:31 AM