Share News

శాస్త్రీయ విజ్ఞానంతోనే సమాజానికి వెలుగు

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:16 AM

కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌లో ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను 1928 ఫిబ్రవరి 28న డాక్టర్ సి.వి.రామన్ ఆవిష్కరించారు.

శాస్త్రీయ విజ్ఞానంతోనే సమాజానికి వెలుగు

కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌లో ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను 1928 ఫిబ్రవరి 28న డాక్టర్ సి.వి.రామన్ ఆవిష్కరించారు. అంటే, కాంతి పదార్థం గుండా వెళ్ళేటప్పుడు దాని తరంగదైర్ఘ్యం మారుతుందని నిరూపించారు. క్యాన్సర్ నిర్ధారణ, మందుల నాణ్యతను పరీక్షించి నకిలీ మందులను గుర్తింపు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొలవడం, బంగారం, వజ్రాల నాణ్యతను గుర్తించడం, నీటి కాలుష్యాన్ని గుర్తించడం, ఇంటర్నెట్ వేగాన్ని పెంచడం... వంటి వాటికి ఈ ఆవిష్కరణ ఉపయోగపడింది. ఈ ఆవిష్కరణకు గానూ 1930లో సర్ సి.వి.రామన్‌కు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన మొదటి ఆసియా శాస్త్రవేత్త, మొదటి భారత శాస్త్రవేత్త ఆయనే.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A (h) ప్రకారం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం ప్రతి పౌరుడి మౌలిక విధి. జాతీయ సైన్స్ దినోత్సవం ఈ విధిని గుర్తుచేస్తుంది. దేశం సుస్థిర అభివృద్ధి సాధించడంలో సైన్స్ కీలకపాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, ఆహార భద్రత వంటి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అవసరం. భారతదేశంలో విజ్ఞానశాస్త్ర పురోగతిలో భాగంగానే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), రక్షణ పరిశోధన–అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ), శాస్త్రీయ–పారిశ్రామిక పరిశోధనా మండలి, భారతీయ విజ్ఞాన సంస్థ, బాబా అణు పరిశోధన కేంద్రం వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ సంస్థలు అనేక పరిశోధనల్లో విజయాలు సాధించాయి. 2023లో చంద్రయాన్–3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్‌ కావడం, అదే సంవత్సరం ఆదిత్య–L1 సౌర పరిశీలన మిషన్, అంతకుముందు కోవిడ్–19 వ్యాక్సిన్ పరిశోధన కోవాక్జిన్ అభివృద్ధి, 5G సాంకేతిక పరిజ్ఞానం... వంటివన్నీ ఈ సంస్థల కృషివల్లే భారత ప్రజలకు మరింత చేరువయ్యాయి.


కానీ సైన్స్‌ పరిశోధనలు, విజ్ఞానం పెంపుపై మన ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపడం లేదు. మన జీడీపీలో పరిశోధనల అభివృద్ధికి 0.7శాతం మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు (అభివృద్ధి చెందిన దేశాలలో ఇది కనీసం 2–3 శాతంగా ఉంది). మరోవైపు, మన దేశంలో అవకాశాల్లేక నిపుణులైన శాస్త్రవేత్తలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో శాస్త్రీయ విద్యా బోధన కరువైంది. మహిళా శాస్త్రవేత్తలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం కేవలం ఒక శాస్త్రవేత్తను స్మరించడానికి మాత్రమే కాదు, ఇది భారత సమాజంలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందింపజేయడానికి ఒక అవకాశం.

సి.వి.రామన్ ఇచ్చిన ‘కష్టపడి పనిచేయండి, ఆలోచించండి, కొత్తవి కనుగొనండి’ అనే సందేశాన్ని నేటి యువత ఆచరణలో పెట్టాలి. విజ్ఞానశాస్త్రం ద్వారా మాత్రమే సుస్థిర, సమతుల్య అభివృద్ధి సాధ్యం. ఫండింగ్ కొరత, డిజిటల్ డివైడ్, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనలేకపోవడం... వంటివి కూడా సైన్స్ రంగం అభివృద్ధికి ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి.

సామాజికపరంగా కొన్ని అంశాలను పరిశీలిస్తే, మార్క్సిజం సైన్స్‌ను సమాజ మార్పునకు సాధనంగా చూసింది. కానీ, బూర్జువా రాజకీయ ఆధిపత్యం సైన్స్‌ను రోజురోజుకూ దెబ్బతీస్తున్నది. కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థ తన లాభం కోసం ప్రకృతిని నాశనం చేస్తోంది. ఈ వినాశనం సైన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఔషధ పరిశోధనకు కీలకమైన వృక్ష సంపద కూడా నానాటికీ కనుమరుగవుతోంది.

సైన్స్‌ మరింతగా వృద్ధి చెందాలంటే, విద్యార్థులకు హ్యాండ్స్–ఆన్ ప్రాజెక్టులు, ల్యాబ్ సదుపాయాలు పెంచాలి. పర్యావరణం, ఆరోగ్యం వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి పరిశోధనలను ప్రోత్సహించాలి. స్టూడెంట్ యూనియన్ల భాగస్వామ్యంతో సైన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. నేటి సమాజంలో మూఢత్వం రోజురోజుకూ పెరిగిపోతోంది. సైన్స్‌తో ఆ మూఢత్వాన్ని జయించడమే నేడు మన ముందున్న కర్తవ్యం.

-బి.వీరభద్రం

(రేపు జాతీయ సైన్స్ దినోత్సవం)

Updated Date - Feb 27 , 2026 | 01:19 AM