అత్యాశతోనే సైబర్ ఉచ్చులోకి..!
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:31 AM
ఎన్సీఆర్బీ నివేదిక–2024 ప్రకారం దేశవ్యాప్తంగా 1,01,928 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. 2023లోని 86,420 కేసులతో పోలిస్తే ఇది సుమారు 17శాతం వరకు పెరిగింది.
ఎన్సీఆర్బీ నివేదిక–2024 ప్రకారం దేశవ్యాప్తంగా 1,01,928 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. 2023లోని 86,420 కేసులతో పోలిస్తే ఇది సుమారు 17శాతం వరకు పెరిగింది. ప్రతి లక్ష జనాభాకు సైబర్ నేరాల రేటు 6.2 నుంచి 7.3కి పెరిగింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 27,230 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (21,993 కేసులు), ఉత్తరప్రదేశ్ (11,073 కేసులు) నిలిచాయి. మహారాష్ట్రలో 9,922 కేసులు, బిహార్‌లో 6,380 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2,528 సైబర్ నేరాల కేసులు నమోదై దేశంలో 8వ స్థానంలో నిలిచింది.
ఒంటరి మహిళలు, కుటుంబానికి దూరంగా ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒంటరితనం అవకాశంగా చేసుకుని అపరిచితులుగా పరిచయం అవుతున్నారు. వారికి మాయ మాటలు చెప్పి దగ్గరై, అందినకాడికి డబ్బులు లాగేసి ముఖం చాటేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాధితులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. పరువుకు సంబంధించిన విషయం కావడంతో చివరకు తమ బాధను బంధువులకు, దగ్గర వాళ్లకు చెప్పలేని పరిస్థితి. కరోనా తరువాత ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ మంది యువత ఆన్‌లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటై చిన్నతనంలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిండా 25ఏళ్లు నిండకుండానే జీవితాలు అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ఈ మధ్య డిజిటల్ అరెస్టులు ఎక్కువయ్యాయి. తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసి మీకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, మీ చిరునామాతో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బాధితులు భయపడి సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు.
సైబర్ నేరాలు అరికట్టడంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కొంత పురోగతి సాధించింది. ఆన్‌లైన్ మోసగాళ్ల నుంచి ఈ ఏడాది దాదాపు రూ.247 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ సైబర్ గార్డ్’ పేరుతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. సైబర్ మోసాలు రోజురోజుకు కొత్త అవతారాలు ఎత్తడంతో ‘ఏపీ సైబర్ గార్డ్’లో భాగంగా 6 పిల్లర్స్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, ఫేక్ యాప్స్, ఫిషింగ్ లింకులు, డిజిటల్ అరెస్టులు వంటి నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టి సైబర్ నేరాలు అరికడుతున్నారు. అయినా రోజూ ఎక్కడో ఒక చోట సైబర్ మోసాలు జరుగుతూ ఉండటం బాధాకరం. ఇప్పటికైనా యువత, ఉన్నత విద్యావంతులు కళ్లు తెరవాలి. అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవాలి. అపరిచితులు నుంచి ఫోన్ కాల్స్ లేదా ఈ మెయిల్ వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి వెంటనే ఫోన్ చేసి జరిగిన విషయం వివరించాలి. ఒక వేళ డిజిటల్ అరెస్ట్ అయితే వెంటనే నిర్భయంగా పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాలి.
– ఎన్. నీలం నాయుడు, విజయనగరం