చరిత్ర వక్రీకరణకే వారోత్సవాల్లో మార్పు..
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:24 AM
దేశంలో 75 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఒక గొప్ప చారిత్రక సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తెరదించింది. ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే జాతీయ సహకార వారోత్సవాలను..
దేశంలో 75 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఒక గొప్ప చారిత్రక సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తెరదించింది. ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే జాతీయ సహకార వారోత్సవాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయించడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. భారత తొలి ప్రధాని, ఆధునిక దేశ నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి అయిన నవంబర్ 14న ఈ వేడుకలు ప్రారంభం కావడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు వారోత్సవాల తేదీల మార్పు పూర్తిగా అసంబద్ధం. నెహ్రూ జ్ఞాపకార్థాన్ని, ఆయన పేరును ప్రజల మనసుల నుంచి పూర్తిగా తుడిచిపెట్టే దురుద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
భారత సహకార ఉద్యమానికి నెహ్రూ చేసిన సేవలు ఒక వారోత్సవానికి పరిమితమైనవి కావు. సహకార రంగాన్ని కేవలం రుణాలు ఇచ్చిపుచ్చుకునే ఆర్థిక వ్యవస్థగా కాకుండా గ్రామీణ ప్రజల జీవన వికాసానికి, సమసమాజ నిర్మాణానికి బలమైన సాధనంగా ఆయన భావించారు. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాత కూడా దేశంలో సహకార ఉద్యమానికి నెహ్రూ అరుదైన సేవలు అందించారు. ఆగ్నేయాసియా సహకార నాయకత్వంపై అంతర్జాతీయ సదస్సులో ఆయన చేసిన ప్రసంగం ఈ దార్శనికతకు నిదర్శనం. వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, మార్కెటింగ్, పంపిణీ, నీటిపారుదల తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పంచవర్ష ప్రణాళికల్లోనూ నెహ్రూ ప్రాధాన్యమిచ్చారు.
‘సహకార విధానం భారతదేశ సాధారణ ఆలోచనగా మారాలి’ అని కలలుగన్న మహనీయుడు నెహ్రూ. అందుకే దేశంలోని సహకారవాదులు, రైతులు ఆయన్ను ‘సహకార ప్రవక్త’గా కొలిచారు. అలాంటి మహానుభావుడి పేరుతో ముడిపడిన వారోత్సవాలను అర్ధంతరంగా రద్దుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం, అసంబద్ధం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త మంత్రిత్వశాఖ పేరుతో, జూన్ 29 నుంచి జూలై 6 మధ్య కొత్తగా వారోత్సవాలు జరపాలని నిర్ణయించడం కేవలం ఒక తేదీ మార్పు మాత్రమే కాదు, చరిత్రను వక్రీకరించే రాజకీయ కక్ష సాధింపు చర్యగా స్పష్టమవుతోంది. ఏడేళ్ల క్రితం ఏర్పాటైన ఒక మంత్రిత్వ శాఖ ఆవిర్భావ దినోత్సవాన్ని తెరపైకి తెచ్చి, దేశవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో భాగమైన 75 ఏళ్ల చారిత్రక సంప్రదాయాన్ని తుడిచేయాలని చూడటం. పాలకుల సంకుచిత మనస్తత్వాన్ని ఎత్తిచూపుతోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో దేశ నిర్మాణంలో భాగస్వాములైన నాయకుల ముద్రలను చెరిపేయాలని చూడటం చరిత్రను అవమానించడమే.
నెహ్రూ సహకార దృక్పథంలోని అసలైన గొప్పదనం దాని ప్రజాస్వామిక స్వభావంలో ఉంది. ‘సహకార సంఘాలను ప్రభుత్వ అధికారులు నిర్వహించకూడదు. అది పూర్తిగా ప్రజలు, సభ్యుల బాధ్యతగా ఉండాలి’ అని ఆయన దృఢంగా నమ్మారు. ప్రభుత్వాలు ఈ రంగంలో జోక్యం చేసుకుంటే సహకార సంఘాల ఆత్మ, స్వభావం, ప్రాథమిక విలువలు దెబ్బతింటాయని హెచ్చరించారు. గ్రామస్వరాజ్యం, గ్రామీణ పరిశ్రమలు, చిన్న రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం సహకారాన్ని శక్తిమంతమైన సాధనంగా చూశారు. సహకారం అంటే పై నుంచి విధించే పాలనా విధానం కాదు. కింది స్థాయి ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకునే వ్యవస్థ అనేది ఆయన విశ్వాసం. స్వచ్ఛందం, స్వయంప్రతిపత్తి, సామాజిక సమన్వయం, పరస్పర ఆర్థిక స్వావలంబన అనే నాలుగు మూలస్తంభాల పైనే సహకార ఉద్యమం నిలబడాలని నెహ్రూ ఆకాంక్షించారు.
శ్వేతవిప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ సైతం నెహ్రూ సహకార దార్శనికతను కొనియాడారు. దేశంలో లక్షలాది సంఘాలు ఉండటం ముఖ్యం కాదని, ప్రజల ఆలోచనా విధానమే సహకారమయం కావాలని నెహ్రూ కోరుకున్నారని కురియన్ ఒక సందర్భంలో గుర్తు చేశారు. మహాత్మాగాంధీ గ్రామస్వరాజ్యం కల సాకారానికి సహకార రంగమే ఉత్తమ మార్గమని విశ్వసించిన నెహ్రూ ఆశయాలను నేడు అధికారంలో ఉన్నవారు కాలరాస్తున్నారు. వికేంద్రీకరణను బలపరచాల్సిన ప్రభుత్వమే, సహకార రంగాన్ని కేంద్రీకృతం చేసి రాజకీయ ఆయుధంగా మలచుకోవాలని చూడటం సమాఖ్య స్ఫూర్తికే ముప్పుగా పరిణమించింది. సహకార ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి, నాయకుడికి చెందినది కాదు. అది ప్రజలది, రైతులది, కార్మికులది, మహిళలది, గ్రామీణ పేదలది. పరస్పర విశ్వాసం, సమానత్వం, ప్రజాస్వామ్యం, స్వచ్ఛంద భాగస్వామ్యం అనే విలువలపై నిర్మితమైన వ్యవస్థ ఇది.
నెహ్రూ ఆలోచనలను గౌరవించడం అంటే ఆయన రాజకీయ విధానాలన్నింటినీ అంగీకరించడం కాదు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన చారిత్రక కృషిని నిష్పాక్షికంగా గుర్తించడం. అదే ప్రజాస్వామిక సంస్కృతి. సహకార రంగాన్ని విస్తరించాలని, ‘సహకార్ సే సమృద్ధి’ సాధించాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నప్పుడు, ఆ ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన నెహ్రూ సేవలను విస్మరించడం పరస్పర విరుద్ధమైన వైఖరి కాదా? జూన్ 29 నుంచి జూలై 6 వరకు కొత్త సహకార వారోత్సవాలను నిర్వహించడంతో పాటు నవంబర్ 14 నుంచి 20 వరకు నెహ్రూ స్మారక జాతీయ సహకార వారోత్సవాలను కూడా కొనసాగించవచ్చు. అందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి? చరిత్రను చెరిపివేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించలేరు. గతాన్ని గౌరవించకుండా భవిష్యత్తును నిర్మించలేరు.
సహకార ఉద్యమం పట్ల నిజమైన గౌరవం ఉంటే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, రెండు వారోత్సవాలనూ కొనసాగించాలి. నెహ్రూ ఒక వ్యక్తి మాత్రమే కాదు, భారత సహకార ఉద్యమ చరిత్రలో ఒక నిండైన ఆలోచన. ఆ ఆలోచనను ఒక ప్రభుత్వ నిర్ణయంతో చెరిపివేయడం సాధ్యం కాదు! దేశంలో సహకార స్ఫూర్తిని నింపిన నెహ్రూ లాంటి మహనీయుల ఆశయాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కేరళం వంటి రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి నవంబర్ 14 నుంచి సంప్రదాయ సహకార వారోత్సవాలను స్వయంగా నిర్వహిస్తామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. ప్రజాస్వామికవాదులు, సహకారవాదులు అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణులను ప్రతిఘటించాలి. చరిత్రను వక్రంగా తిరగరాయాలని చూసే శక్తులకు ప్రజలే తగిన సమయంలో తగిన సమాధానం చెబుతారని చాటిచెప్పాలి.
- కృష్ణ కానూరి (జర్నలిస్ట్)