వెన్నెల బాటలో...
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:00 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి, భారత్–-అమెరికా సంబంధాల ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నా, అంతరిక్ష రంగంలో సహకారం మాత్రం స్థిరంగానే సాగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి, భారత్–-అమెరికా సంబంధాల ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నా, అంతరిక్ష రంగంలో సహకారం మాత్రం స్థిరంగానే సాగుతోంది. ప్రతిష్ఠాత్మక ‘మూన్‌బేస్’ కార్యక్రమంలో భాగస్వామిగా చేరాలంటూ ఇటీవల ఇస్రోకు నాసా నుంచి అధికారిక ఆహ్వానం అందడం మంచి పరిణామం. వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై నివసిస్తూ, పరిశోధనలు కొనసాగించే ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిది. నాసా మూడు దశల్లో ఈ ‘ఆర్టెమిస్ బేస్ క్యాంప్’ను నిర్మించబోతోంది. మొదటి దశలో, 2028 నుంచి రోవర్లు, రోబోలు, ఇతర పరికరాలను దక్షిణ ధ్రువప్రాంతం అన్వేషణకు పంపుతారు. అక్కడ నీటి ఉనికి ఘనంగా ఉన్నదంటున్న శాశ్వత నీడ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆ మరుసటి ఏడాదినుంచి మరో మూడేళ్ళ మధ్య దశలో శాశ్వత స్థావరం ఏర్పాటుకు ప్రాథమిక కార్యాచరణ సమకూరుతుంది. 2032 తరువాత మూడోదశలో, సూర్యరశ్మిని వినియోగించుకునే కొండ-శిఖర నివాసాల ఏర్పాటు జరుగుతుంది. రేడియేషన్ ముప్పు తగ్గించే ప్రత్యేక వ్యవస్థలతో, సిబ్బంది సుదీర్ఘకాలం అక్కడే ఉండే ఏర్పాట్లు జరుగుతాయి.
మాతో కలిసిరండి అంటూ ఇస్రోను నాసా ఇలా ఆహ్వానించడం వెనుక, భారత్ చంద్రయాత్రల ప్రస్థానం బాగా పనిచేసిందని నిపుణులు అంటున్నారు. 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరిన తొలి విజయంగా చంద్రయాన్–-3 రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఎవరూ అటుగాపోని ప్రాంతమిది. ఇప్పుడు, ఆర్టెమిస్ కార్యక్రమాన్ని తలపెట్టింది అక్కడే. చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించడమే కాక, విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్‌రోవర్ ద్వారా కీలక పరిశోధనలు నిర్వహించింది. ఇక, గగన్‌యాన్ ద్వారా భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం, సొంత 52-టన్నుల అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం తొలిగా ఓ 10 -టన్నుల మాడ్యూల్‌ను ప్రయోగించడం, 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం వంటి లక్ష్యాలతో ఇస్రో ముందుకు సాగుతోంది. ఆ లోగా సొంత మూన్‌బేస్, చంద్రకక్ష్యలో అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్నది భారత్ లక్ష్యం. ఆర్టెమిస్ ఒప్పందాలపై మూడేళ్ళక్రితమే భారతదేశం సంతకం చేసింది. 47 దేశాల్లో 27వ దేశంగా వచ్చి చేరినా, నాసా నేతృత్వంలోని నిర్దిష్ట ఆర్టెమిస్ మిషన్లలో ప్రత్యక్ష భాగస్వామ్యం భారత్‌కు దక్కలేదు. ప్రస్తుత ఆహ్వానం ఆ లోటును పూడ్చుతుంది. నాసాతో ఈ విషయంలో సహకారం ద్వారా మనకు ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని, సంక్లిష్టమైన మానవసహిత మిషన్ల నిర్వహణలో ప్రత్యక్ష అనుభవానికి అవకాశం ఇస్తుందని, టెక్నాలజీ అందుబాటు సాధ్యపడుతుందని అంటున్నారు. భవిష్యత్తులో అంగారకుడితో సహా భారత్ చేపట్టబోయే పలురకాల యాత్రలు, పరీక్షలకు ఇది వేదికగా ఉపకరిస్తుందని అంచనా.
చంద్రుని మీద పరిశోధనలు, అన్వేషణలు వేగంగా సాగుతున్నాయి. కీలకదశలన్నీ దాటి, రాబోయే దశాబ్దాల్లో ఈ గని నుంచి వనరుల వెలికితీత మొదలైతే, అది వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ అత్యంత కీలకమవుతుంది. ఖగోళం సమస్తం సర్వమానవాళికీ చెందుతుందని, చందమామ మీద, అక్కడి వనరులమీద ఏ దేశానికీ ప్రత్యేకహక్కులు లేవని, ఆ సుదూర వనరులను వినియోగించుకొనేందుకు అన్నిదేశాలూ కలసికట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంటూ 1979నాటి మూన్ అగ్రిమెంట్ చెబుతోంది. చైనా, రష్యా భాగస్వామ్యం లేని ఈ ఆర్టెమిస్ ఒప్పందం పూర్తిగా అమెరికా నేతృత్వంలోని కొన్ని దేశాల కూటమి. అంతరిక్ష అన్వేషణలో ఇలాంటి కూటమిలో చేరకుండా ఇంతకాలం దూరంగా ఉన్న భారత్, అమెరికాతో పెరిగిన సాన్నిహిత్యం కారణంగా ఆర్టెమిస్ ఒప్పందాల్లో భాగస్వామి అయింది. నాసాతో అప్పటికే ఉన్న సహకారం దీని కారణంగా మరింత విస్తరించింది. చంద్రస్థావరం కోసం చేతులు కలపండి అన్న ఈ పిలుపు సంతోషకరమైనదే అయినా, అమెరికాతో ఉన్న గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం అవసరం. నాసా టెక్నాలజీ మీద అమితంగా ఆధారపడినపక్షంలో గతంలో మాదిరిగా సహాయనిరాకరణకు గురయ్యే ప్రమాదం ఎప్పటికైనా ఉండవచ్చు. నాసాతో సహకారం ఇస్రో లక్ష్యాలను వేగవంతం చేయడానికి తోడ్పడాలే తప్ప, దాని ప్రణాళికలు వెనక్కుపోకూడదు. అంతరిక్షరంగంలో అతివేగంగా అడుగులువేస్తున్న భారత్ తన సామర్థ్యాలను పెంచుకుంటూనే, అమెరికాతో సహకారాన్ని మరింత వృద్ధిచేసుకోవడం ప్రయోజనకరం.