Share News

Naini Coal Block Scandal: బొగ్గు కోసం... నీచ కథనం!

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:14 AM

అసలేం జరిగింది? ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడానికి కారణమేమిటి? గతంలో ఎన్నడూ లేనంతగా అఖిల భారత సర్వీసు అధికారులు సదరు చానల్‌పై చర్యలు తీసుకోవాలనేంత పట్టుదల ఎందుకు ప్రదర్శిస్తున్నారు?

Naini Coal Block Scandal: బొగ్గు కోసం... నీచ కథనం!

సలేం జరిగింది? ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడానికి కారణమేమిటి? గతంలో ఎన్నడూ లేనంతగా అఖిల భారత సర్వీసు అధికారులు సదరు చానల్‌పై చర్యలు తీసుకోవాలనేంత పట్టుదల ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మంత్రి కోమటిరెడ్డిని, మహిళా ఐఏఎస్‌ అధికారులను ఈ వివాదంలోకి ఎన్టీవీ లాగడం వెనుక ఏం జరిగింది? ఈ వ్యవహారంలో మీడియా హద్దులు దాటిందా? ఈ మొత్తం వ్యవహారానికి సింగరేణి సంస్థకు చెందిన నైనీ బొగ్గు బావి నుంచి బొగ్గు తవ్వకానికి సంబంధించిన టెండర్‌ కారణమా? భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శిస్తున్నట్టుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మీడియాను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నదా? లేక మీడియానే ప్రభుత్వాన్ని లొంగదీసుకొనే ప్రయత్నం చేసిందా? ఈ వ్యవహారంపై బయట జరుగుతున్న ప్రచారమేమిటి? తెర వెనుక జరిగిందేమిటి? వ్యాపార ప్రయోజనాలకోసం మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సమర్థనీయమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే అసలేం జరిగిందో తెలుసుకోవాలి! ఎక్కడో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ కోసం టెండర్లు పిలవడమేమిటి? ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడమేమిటి? ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవడమేమిటి? ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంగంలోకి ఎలా వచ్చారు? ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోవలసి వచ్చింది? అని ప్రశ్నించుకుంటే మళ్లీ నైనీ బొగ్గు బ్లాక్‌ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది.


అప్పుడూ... ఇప్పుడూ...

నైనీ బ్లాక్‌ నుంచి బొగ్గు తవ్వి తీసే కాంట్రాక్టు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా వివాదాస్పదమైంది. అప్పట్లో అదానీని ముందుపెట్టి ప్రతిమా శ్రీనివాస్‌కు చెందిన సంస్థకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టాలని కేసీఆర్‌ ప్రభుత్వం యోచించింది. దీంతో అప్పట్లో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాటం చేశారు. తన సోదరుడికి చెందిన సుశీ హైటెక్‌ కంపెనీకి సదరు టెండర్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఎంపీగా రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఫిర్యాదులు చేశారు. దీంతో అప్పట్లో ఆ టెండరు ఖరారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. ప్రతిమా శ్రీనివాస్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన టెండర్‌ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో మళ్లీ నైనీ బ్లాక్‌ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఈ టెండర్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని... తాము తెరమీదకు తెచ్చిన సంస్థకు టెండర్‌ దక్కేలా టెండర్‌ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్‌లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్‌ను సందర్శించాలన్న వింత నిబంధనను విధించారు. బొగ్గు బ్లాక్‌ను ఎవరైనా సందర్శించవచ్చు కదా? అదేమి నిబంధన? క్షేత్ర స్థాయి పరిస్థితులు, ఓవర్‌ బర్డెన్‌ ఎంత అనేది నిర్ణయించుకోకుండా ఏ కంపెనీ అయినా రేట్‌ ఎలా కోట్‌ చేస్తుంది? అయినా, ఫీల్డ్‌ విజిట్‌ చేసి ఉండాలన్న నిబంధన విధించడం హాస్యాస్పదం కాదా? అస్మదీయులకు మాత్రమే టెండర్‌లో పాల్గొనే అవకాశం కల్పించడానికే ఇటువంటి సిల్లీ నిబంధన విధించారని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు.


దీంతో మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీని రంగంలోకి దించారు. మైనింగ్‌లో అనుభవం లేని మేఘా ఇంజనీరింగ్‌ కోసమే ఫీల్డ్‌ విజిట్‌ అనే నిబంధనను పెట్టారని అధికారులు చెబుతున్నారు. ఎన్టీవీ యజమాని చౌదరి అల్లుడికి చెందిన వెన్సర్‌ కంపెనీకి కూడా అర్హత లేనందున మేఘా, వెన్సర్‌లను కలిపి జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటుచేశారు. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగప్రవేశం చేశారు. తన సోదరుడికి చెందిన సుశీ హైటెక్‌ కంపెనీకి ఫీల్డ్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయవలసిందేనని ఆయన పట్టుబట్టారు. సుశీ హైటెక్‌ కంపెనీకి సర్టిఫికెట్‌ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్‌ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీని పోటీ నుంచి తప్పించడానికి చేసిన ఈ ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బొగ్గు బ్లాక్‌ కోసం ప్రధాన మంత్రిని సైతం కలిసి టెండర్లు రద్దు చేయించిన అనుభవం ఉన్న వెంకటరెడ్డి ఇప్పుడు కూడా సదరు బొగ్గు బ్లాక్‌ కోసం పట్టుబడుతున్నారు. దీంతో వివాదం రేవంత్‌రెడ్డి వద్దకు చేరింది. ఇదంతా కొంప ముంచే వ్యవహారంలా ఉందని భావించిన ముఖ్యమంత్రి సదరు టెండరును ఖరారు చేయకుండా వాయిదా వేయించారు. ఆ వెంటనే నల్లగొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి రాసలీలలు అని ఎన్టీవీలో కథనం ప్రసారమైంది. దీంతో మంటలు అంటుకున్నాయి. రాజకీయం–వ్యాపారం– జర్నలిజం అన్నీ కలగాపులగం అయ్యాయి.


వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధనే కారణం. క్షేత్ర స్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా? ఇంత సింపుల్‌ నిబంధన పెట్టారేమిటి? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసు అంతా ఉంది. కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ను అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికెట్‌ జారీ చేయరు. ఈ లొసుగును అడ్డుపెట్టుకొని కావాల్సిన కంపెనీకి నైనీ కోల్‌ బ్లాక్‌ను కేటాయించడానికి స్కెచ్‌ సిద్ధమైంది. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా! ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడైన అనిల్‌రెడ్డికి చెందిన సుశీ హైటెక్‌ కంపెనీ రంగంలోకి దిగింది. మైనింగ్‌ తవ్వకాల్లో ఈ కంపెనీకి అనుభవం ఉంది. పలు రాష్ర్టాలలో బొగ్గు తవ్వకాలు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క కంపెనీకే టెండర్‌లో పాల్గొనే అర్హతలు ఉన్నాయి. అయితే, ఫీల్డ్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడంలో అధికారులు తాత్సారం చేయడంతో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్‌కు ఆ కంపెనీ ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది. దీంతో సుశీ హైటెక్‌ కంపెనీకి కూడా ఫీల్డ్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయవలసిందిగా సదరు పత్రంపై సింగరేణి సీఎండీ ఎండార్స్‌ చేశారు. సీఎండీ ఆదేశాలు అమలైతే టెండర్లలో పోటీ ఏర్పడుతుంది. తాము అనుకున్న కంపెనీకి టెండర్‌ దక్కకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఎన్టీవీని రంగంలోకి దించారు. ఈ వ్యవహారంలో ఎన్టీవీ ఎందుకు తలదూర్చిందన్న సందేహం కలగడం సహజం. ఈ టెండర్‌ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందాలంటే పేరొందిన ఏదో ఒక కంపెనీ కావాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులకు మైనింగ్‌లో అనుభవం లేదు. ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి అల్లుడికి కూడా అనుభవం లేదు.


ఏమిటీ బొగ్గు బ్లాక్‌?

ఒక బొగ్గు బ్లాక్‌ను దక్కించుకోవడానికి ఇంతమంది పోటీపడటం ఏమిటి? అన్న అనుమానం ఏర్పడటం సహజం. 25 సంవత్సరాల పాటు అమలులో ఉండే ఈ కాంట్రాక్టు లభిస్తే పంట పండినట్టేనని మైనింగ్‌ రంగంలో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. ఈ కారణంగానే మైనింగ్‌లో తలపండిన కంపెనీలకు కూడా ఫీల్డ్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయకుండా కట్టడి చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి చెందిన కంపెనీకి మైనింగ్‌లో అపారమైన అనుభవం ఉంది. అయినా ఆయన కంపెనీకి ఫీల్డ్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ దక్కలేదు. మంత్రి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీదీ అదే పరిస్థితి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సింగరేణి సంస్థ ప్రధానంగా ముఖ్యమంత్రి అదుపాజ్ఞల్లోనే ఉండింది. ఇప్పుడు మాత్రం సింగరేణి సంస్థ అన్ని విధాలుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కిందే ఉంది. దీంతో సదరు సంస్థలకు ఫీల్డ్‌ విజిట్‌ సర్టిఫికెట్లు జారీ కాకుండా అధికారులను భట్టి విక్రమార్క కట్టడి చేస్తున్నారన్న భావం పోటీదారుల్లో ఏర్పడింది. ఈ పరిణామం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలకు కారణమైంది. వెంకటరెడ్డి సోదరుడి కంపెనీని పోటీ నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వివాదం ముదిరింది. వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటున్నదని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలలు అనే కథనం. ఈ కథనం ప్రసారమైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నల్లగొండ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు మహిళా ఐఏఎస్‌ అధికారులను ఇందులోకి లాగడంతో అఖిల భారత సర్వీసు అధికారులు భగ్గుమన్నారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దృష్టిలో పెట్టుకొని రాసలీలలు అనే కథనం ప్రసారం చేయడం కూడా వికటించింది. వెంకటరెడ్డి అటువంటివారు కాదన్న అభిప్రాయం బలంగా ఉండటంతో ఈ కథనంపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కుమారుడి మరణం తర్వాత రాజకీయాల్లో ఉంటూనే వెంకటరెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలతో ఆయన అనుచితంగా ప్రవర్తించిన దాఖలాలు కూడా లేవు. అదే సమయంలో ఎన్టీవీలో ప్రస్తావించిన మహిళా ఐఏఎస్‌ అధికారులకు కూడా మంచి పేరుంది. ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు తమ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. మానసికంగా కుంగిపోయారు. ఆ ఇద్దరిలో ఒక అధికారిణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో అఖిల భారత సర్వీసు అధికారులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. ఐఏఎస్‌ అధికారులతో ఐపీఎస్‌ అధికారులు కూడా చేతులు కలిపారు. ఆ వెంటనే సదరు కథనాన్ని ప్రసారం చేసిన చానల్‌పై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా అసోసియేషన్‌ తరఫున ఫిర్యాదు చేశారు.


అసాధారణ సిట్‌...

పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి శాంతించవలసిందిగా కోరారు. వివాదం ముదరకుండా ముగింపు పలకాలని అభ్యర్థించారు. అయితే, అధికారులు ఇందుకు తిరస్కరించారు. అధికారుల అవినీతిపై కథనాలు ప్రసారం చేస్తే సహించగలం కానీ మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో భట్టి విక్రమార్క నిస్సహాయంగా ఉండిపోయారు. సదరు సమావేశానికి హాజరైన అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్‌ ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. అధికారుల మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. పత్రికా స్వేచ్ఛ పేరిట మీడియా హద్దులు దాటితే ఏం జరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. సిట్‌ ఏర్పాటు నిర్ణయం తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. సిట్‌ అధికారులు ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేషన్‌ అధికారులకు లుక్‌ ఔట్‌ నోటీసులు పంపించారు. ఫలితంగానే ఎన్టీవీకి చెందిన దొంతు రమేశ్‌ను ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. తమ చానల్‌లో ప్రసారమైన కథనంతో తమకు సంబంధం లేదని, తమ చైర్మన్‌ నరేంద్ర చౌదరి ఆదేశాల మేరకే ఆ కథనాన్ని రూపొందించామని ఎన్టీవీకి చెందిన జర్నలిస్టులు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో సిట్‌ అధికారుల తదుపరి చర్యలపై పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్టు చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్‌ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టులు చెప్పినందున చర్యలంటూ తీసుకుంటే చైర్మన్‌పై తీసుకోవాలి. ఈ విషయమై జర్నలిస్టు నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు సమర్థనీయమే.


చరిత్ర మరిచిన కేసీఆర్‌, జగన్‌

విచిత్రం ఏమిటంటే, తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను, అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్‌ అండ్‌ కో, జగన్‌ అండ్‌ కో ఇప్పుడు ఎన్టీవీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు. ఎన్టీవీ విషయంలో జరగరానిదేదో జరిగిపోయినట్టుగా కేసీఆర్‌ సొంత పత్రికలో పేజీల కొద్దీ కథనాలు వండి వార్చారు. ఇదే కేసీఆర్‌ తాను అధికారంలో ఉన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు ప్రకటనలు ఇవ్వకుండా వేధించిన విషయం తెలిసిందే. ఏబీఎన్‌ ప్రసారాలను తెలంగాణలో అకారణంగా నిలిపివేయించారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోమని ప్రకటించిన తెంపరితనం కేసీఆర్‌ సొంతం. అలాంటి కేసీఆర్‌ అండ్‌ కో ఇప్పుడు దెయ్యాలు వేదాలను వల్లిస్తున్నట్టుగా ఎన్టీవీ విషయంలో ప్రకటనలు చేస్తున్నారు. ఇక.. జగన్‌రెడ్డి విషయంలో ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. జర్నలిస్టులు, మీడియా సంస్థల అధిపతులపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టించిన ఘనత ఆయన సొంతం. గిట్టని మీడియాపై ఆయన ఇప్పటికీ నిషేధం అమలు చేస్తున్నారు. తన ఇల్లు, పార్టీ పరిసరాల్లోకి కూడా ఆయా మీడియా సంస్థల ప్రతినిధులను రానివ్వరు. తమాషా ఏమిటంటే, చెడును సమర్థించడంలో కేసీఆర్‌, జగన్‌లది ఒకే మాట ఒకే బాటగా ఉంటుంది.


స్వేచ్ఛ... బాధ్యత!

ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ విషయానికి వద్దాం! మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో హద్దులు కూడా అంతే ముఖ్యం. ప్రింట్‌ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతతో పనిచేస్తోంది. ఎలక్ట్రానిక్‌ మీడియా, అది కూడా యూట్యూబ్‌ చానళ్లు వచ్చిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రజల్లో కూడా ఈ ధోరణిపై ఏహ్యభావం ఏర్పడింది. ఈ కారణంగానే ఎన్టీవీ విషయంలో పోలీసుల చర్యపై వ్యతిరేకత ఏర్పడకపోగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, సదరు కథనంలోకి లాగబడిన మహిళా అధికారులపై సానుభూతి ఏర్పడింది. వారికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభించింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడి మరణంతో సగం చచ్చిపోయానని, ఇప్పుడు ఈ కథనంతో మిగతా సగం కూడా చచ్చిపోయానని వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై సానుభూతి అమాంతంగా పెరిగిపోయింది. ఎన్టీవీలో ప్రసారమైన కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. ఇలాంటి కథనాన్ని ప్రసారం చేయడానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు! యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు? ఎలా ప్రచురిస్తారు? ఇది ఆత్మవంచనే అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుందని, ఉండాలని మేం నమ్ముతున్నాం.


మా సంస్థలలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం! ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. అంతెందుకు! నేను ప్రతివారం రాసే వీకెండ్‌ కామెంట్‌/ కొత్త పలుకును కూడా తప్పొప్పుల పరిశీలనకోసం ఐదారుగురు సీనియర్లకు పంపుతాను. నా దృష్టిలో ఒప్పు అనుకున్నది ఇతరుల దృష్టిలో తప్పు కావచ్చు. అందుకే సీనియర్ల పరిశీలనకు పంపుతాను. ఎన్టీవీ విషయంలో అసలేం జరిగిందో ఇప్పుడు స్పష్టమైంది కనుక ప్రభుత్వం తరఫున తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. మీడియా రంగంలో ఉన్నవారు ఇతరత్రా వ్యాపారాలు ఏవీ చేయకూడదన్న నియమం ఏమీ లేదు. ప్రభుత్వంలోని పెద్దలతో ఏర్పడే సాన్నిహిత్యం వల్ల మీడియా రంగంలో ఉండేవారికి ఇతరత్రా వ్యాపారాల్లో కొన్ని వెసులుబాట్లు కూడా లభించవచ్చు. అనుకున్నదాన్ని సాధించడం కోసం మీడియాను దుర్వినియోగం చేసినప్పుడే సమస్యలు వస్తాయి. నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల విషయంలో తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎన్టీవీ యాజమాన్యం హద్దు మీరింది. తమ మీడియా సంస్థను దుర్వినియోగం చేశారు. ఇక్కడ జర్నలిస్టులు బలిపశువులు అయ్యారుగానీ, పత్రికా స్వేచ్ఛకు ఏర్పడిన ముప్పు ఏమీ లేదు. పర్సనల్‌ వ్యవహారాల్లో అది నిజమైనా అబద్ధమైనా తలదూర్చే అధికారం ఎవరికీ ఉండదు. సమాజానికి నష్టం జరగనంత వరకు వ్యక్తిగత వ్యవహారాల్లో వేలుపెట్టే అధికారం మీడియాకు కూడా ఉండదు.


తస్మాత్‌ జాగ్రత్త...

ఎన్టీవీ సదరు కథనాన్ని ప్రసారం చేయడం వెనుక ఎవరున్నారు? ఏం జరిగింది? ఎవరి ప్రయోజనాలు అందులో ఇమిడి ఉన్నాయి? వంటి ప్రశ్నలు ఇప్పుడు బహిరంగ రహస్యాలుగా మారాయి. నైనీ బొగ్గు బ్లాక్‌ను సొంతం చేసుకొనే క్రమంలోనే ఇదంతా జరిగిందని తేటతెల్లమైంది. ఈ కేసులో జర్నలిస్టులు బలిపశువులు అయ్యారని చెప్పడంలో తప్పు లేదుగానీ సదరు కథనంలో పేర్కొన్న మహిళా ఐఏఎస్‌ అధికారుల పరిస్థితి ఏమిటి? వారి మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా! వారికి కూడా సంసారాలు ఉంటాయి. వారిని కూడా బలి పశువులను చేశారు కదా? ఆడపిల్లలను బజారుకు ఈడ్చడం నేరమే కాదు పాపం కూడా! వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో ఏమైనా చేయవచ్చునని అనుకుంటే కుదరదని ఈ సంఘటనతో స్పష్టమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక తప్పులు జరిగాయి. ఎందరికో భాగస్వామ్యం ఉంది. నైనీ బొగ్గు బ్లాక్‌ను సొంతం చేసుకోగలిగితే పాతికేళ్లలో కొన్ని వందల కోట్లు వెనకేసుకోవచ్చునని దానికోసం పోటీపడుతున్నవారు లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారం బయటకు పొక్కడంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఒక మీడియా సంస్థ మితిమీరిన అహంభావంతో ప్రసారం చేసిన కథనం వల్ల డామిట్‌ కథ అడ్డం తిరిగిందని లబోదిబోమనే పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇప్పుడు వివాదంలోకి లాగబడ్డారు. ఇప్పుడీ వ్యవహారం వ్యక్తుల మధ్య వివాదం ఎంత మాత్రం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇది కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారం కూడా కాదు. మంత్రుల మధ్య ఏర్పడిన వివాదం ఇవాళ కాకపోతే రేపు సమసిపోవచ్చు.


సింగరేణి సంస్థ ప్రయోజనాల మాటేమిటి? గతంలో అధికారంలో ఉన్నప్పుడు నైనీ బ్లాక్‌ను తన వాళ్లకు కట్టబెట్టడానికి ప్రయత్నించి కేసీఆర్‌ విఫలమయ్యారు. ఇప్పుడు అదే బ్లాక్‌ నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించిన భట్టి విక్రమార్క, ఎన్టీవీ నరేంద్ర చౌదరి అల్లరిపాలయ్యారు. కాంగ్రెస్‌ హై కమాండ్‌కు కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితులలో టెండర్లు రద్దు చేసి పారదర్శక నిబంధనలతో మళ్లీ టెండర్లు పిలిచి వీలైనంత ఎక్కువ మంది పోటీపడేలా చర్యలు తీసుకోవడం వాంఛనీయం. బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా ఇలాగే చేస్తుంది. తెలుగునాట మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంతో మీడియాపై ప్రజల్లో మరింత చులకనభావం ఏర్పడుతుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు తమ హద్దుల్లో ఉంటే మంచిది. అధికారం ఉందికదా అని ఏమైనా చేయవచ్చునని రాజకీయ నాయకులు, పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చునని మీడియా సంస్థలు భావించినా కుదరదని ఈ ఉదంతంతో స్పష్టమవుతోంది. తస్మాత్‌ జాగ్రత్త! పొరపాటు చేశామని అంగీకరించి ఎన్టీవీ యాజమాన్యం మొక్కుబడిగా కాకుండా బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. అలా చేయకపోగా ‘నిజం చెబితే కేసులు పెడతారా?’ అని హూంకరించడం ఆత్మవంచనే అవుతుంది. చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్లకు మరక అంటించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అధికారులు చేతులు ముడుచుకొని ఉంటారా? తప్పుచేసినవాళ్లు ఎవరైనా పర్యవసానాలకు సిద్ధం కావాల్సిందే. మినహాయింపులు ఉండవు. ఈ మొత్తం వ్యవహారం అన్ని మీడియా సంస్థలకు ఒక హెచ్చరిక అని చెప్పడంలో తప్పు లేదు!

Updated Date - Jan 18 , 2026 | 01:14 AM