Share News

నది అలలపై తెలుగు కవిత

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:51 AM

నది గలగలల కన్నా గొప్ప సంగీతం ఉంటుందా. అలల సవ్వడిలో తడిసిపోని కవీ ఉండడు. నది చేసే గాయాలకూ నది చుట్టూ రాజకీయాలకూ కొదువ లేదు. నదిని దోసిట్లోకి తీసు కుంటే ఎన్ని...

నది అలలపై తెలుగు కవిత

నది గలగలల కన్నా గొప్ప సంగీతం ఉంటుందా. అలల సవ్వడిలో తడిసిపోని కవీ ఉండడు. నది చేసే గాయాలకూ నది చుట్టూ రాజకీయాలకూ కొదువ లేదు. నదిని దోసిట్లోకి తీసు కుంటే ఎన్ని పాటలో! నది పాడే పాటల్లో జీవం, జీవనం, గమనం, గమ్యం.. ఎన్నెన్ని చరణాలో! కలం నిండా నదిని నింపుకుని కవిత్వమై ప్రవహించిన కొన్ని చరణాలనైనా వినిపించాలని ఈ ప్రయత్నం.

నదినీ జీవితాన్నీ ఒక తాత్విక చట్రంలో కలిపి చూపిన దాట్ల దేవదానంరాజు కవిత ‘నాలోకి నదిని ప్రవహించనీయండి’లోని పంక్తులతో మొదలుపెడతాను: ‘‘నదీతీరం వెంట నడుస్తున్నపుడు/ నిదురించే నదిలోకి పడవెళ్లిపోతున్న దృశ్యం/ నీటిదారిలో వెండి జలతారు ముక్కలు/ నేనే నురగైపోతాను చేపపిల్లై చిందులేస్తాను./ జలకాలాటల సయ్యాటలు.// అలల నదిలో కలల ఒడి/ తడిసి వణుకుతున్న చంద్రబింబం/ నేనూ తడవకుండా మునకలేస్తాను./ ఆరని చెమ్మ ఊరిస్తుంటే/ నదీ ఆకాశం కలిసేచోటును కనుగొన్నాను.’’

‘‘పుడితే నదిగానే పుట్టాలి’’ అంటారు బెల్లి యాదయ్య ‘నదీ.. చెట్టూ’ కవితలో: ‘‘నదీ చెట్టూ తోబుట్టువుల్లా కన్పిస్తాయి నాకు–/ ఘనాకార పచ్చదనం చెట్టు/ ప్రవహించే పత్రహరితం నది–// చెట్టుకూ నదికీ మధ్య దర్జాగా నడిచే వసంతమే మనిషి,’’ ఇలా నదినీ మనిషినీ అంటుకడతాడు కవి.

‘‘నదికీ ఒక భాష ఉంది’’ అన్నది గౌరునాయుడు మాస్టారి మాట: ‘‘నదికొక భాష ఉంది. నదికొక నాగరికత ఉంది. నదికొక బాధ్యతా ఉంది.// అక్షరాల్ని దిద్దినట్టు అలల్ని దిద్దుకోకపోతే, కెరటాలతో కరచాలనం చెయ్యకపోతే, లహరుల లయ విన్యాసాలను లోతుగా అధ్యయనం చేయకపోతే నది ఎప్పటికీ అర్థం కాదు’’. నాగావళి, వంశధారల యుగళ వేదన కంచరాన భుజంగరావు కవిత: ‘‘ఎక్కడెక్కడ ఏ రూపు చూపినా/ పారే నీళ్ళల్లో ప్రతిబింబాలన్నీ నాగధార కన్నీటి చారలే// అలల తూలికల్లోనే నిదురిస్తున్నా/ వలసదారుల రద్దు కలగంటూనే ఉంది నాగధార’’.

నదీ కేంద్రంగా నడిచే రాజకీయాల్ని ఆక్రోశిస్తారు కవి జూలూరు గౌరీశంకర్: ‘‘కవి లోతు, నది లోతు బైటకు కనపడదు/ నా పక్కనుంచే నా కాళ్ళ ముంగిటనుంచే/ గలగలా పాక్కుంటూ పోయినవు/ నన్ను సవతికొడుకునే చేసిండ్రు/ నీకు తెగిపడ్డ తల్లిపేగు రోదన తెలుసు/ ఈ బిడ్డకు పాలిచ్చిపోవే గోదావరీ// నువ్వు అవనికే అందానివే/ కానీ నాకు మట్టుకు/ మా నోటికి అన్నం పెట్టే/ నీళ్ళ కంచానివి కమ్మంటున్నా’’.


నీటి ప్రాజెక్టుల మీద ‘నీటి పువ్వు’ కవితను రాసారు ఒద్దిరాజు: ‘‘నది అంటే నడుస్తున్న సంపద/ నీటిని మూట గట్టి/ పొలాల్లో విప్పితే/ అది సీతాకోక చిలుకల గుంపవుతుంది,’’ అంటూనే నిధులు, నియామకాలు, నీళ్ళు నినాదాలుగా నడిచిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమస్ఫూర్తిని ఎగదోస్తారిలా: ‘‘నది ఒకప్పుడు మనకు ఎండమావి/ ఇప్పుడు మేడిగడ్డ నుంచి కన్నెపల్లి మీదుగా/ తరలివస్తున్న పాలపొదుగు/ నది ఒకప్పుడు చుట్టపు చూపు/ ఇవ్వాళ ఒట్టిపోయిన చెరువుల్లో/ జలసిరులు కురిపించే ప్రజల కలల నీటి పువ్వు’’.

అనంత ‘నదీ నిర్వేదముద్ర’ను వినిపిస్తాడు యువ కవిత్వకెరటం కొత్తపల్లి సురేష్: ‘‘రోజూ నేనొక నదిమీద కన్నీరై ప్రవహిస్తుంటాను; అది ఖాయిలా పడ్డ నది! నీటిచుక్క జాడలేని శుద్ధ స్మశానవీధి! ఆ బీదనదీ ఎదసొద వింటూ రోజూ నేనొక నదిమీద బధిరగానమై సాగుతుంటాను// నీళ్లను చూడడం నా సీమ కన్నుల వేడుక/ ఈ నేలకొక అపురూప దృశ్యభంగురం/ బండ్లు కట్టుకొని వెళ్లిచూసే నిషా ఇక్కడ నీళ్లంటే!/ జాతర ముగిసిన మూణ్ణాలకి/ గుండెపగుళ్ళ తీరాల నిశ్శబ్ద స్వరాలను వినే నదిది యథా నిర్వేదముద్ర!’’

సీమ కవి కొత్తపల్లిది నది కోసం కలవరింపు కాదు. ‘‘పేజీ లుగా రోజులను తోసుకుంటూ వెళ్లిన/ గుండెలను తడుపుకుంటూ వెళ్లిన నదీ,/ నీ చూపుల అలల తీరాలను తాకని/ యుగాల చెమట పాదాలపై ఒక్క చినుకువై కురిసిపో!’’ అని పూటకో సారైనా చెప్పుకునే నదీ పాఠం. మరో సీమ కవి మల్లెల నరసింహమూర్తి ‘జల స్వప్నం’ ఇప్పుడు ‘మాకూ ఒక నది కావాలి’ అనే సామూహిక ఆకాంక్షగా, రాజకీయ డిమాండ్‌గా మారింది. ‘‘కొన్ని యుద్ధాల్ని స్వప్నిస్తా. కేవలం నీళ్ళ గురించి, కొన్ని ఉద్యమాల్ని నిర్మిస్తా. కేవలం నీళ్ళ గురించి’’.

వాన వచ్చి వెళ్ళిన తర్వాత ఊళ్ళ కన్నీటి గాథలతో బరువెక్కే నది హృదయాన్ని కవిత్వంలోకి తోడుతాడు బాలసుధాకర్: ‘‘దుఃఖపు తడి అంటుకున్న అలల పాటల్లో/ వానకి నీళ్ళపాలైన అన్నంగింజల శోకం/ ఆకలి నిప్పుల మీద కాగి కాగి ఆవిరౌతుంది’’. నదిని మురికి కూపంగా మార్చిన నిర్లక్ష్యం గురించి కూడా మాట్లాడుకోవాలి.

ముగింపుకు ముందు మళ్ళీ – నదీ ఆకాశం కలిసేచోటును కనుగొన్నాను అన్న కవి (దాట్ల) వాక్యం దగ్గరకొస్తాను.: ‘‘ప్రాకృతిక సంలీనం.. మనిషితనం/ నది కెరటాల చిరు సవ్వడులు/ కరచాలనాలు.. ఆత్మీయ ఆలింగనాలు// లోలోపలి వెలుగుల్ని తీరానికి చేరుస్తున్నపుడు/ బతుకు చెమ్మల హృదయం విశాలమౌతుంది/ నాలోకి నదిని ప్రవహించనీయండి/ కాలం తీరాన అలలుగా ఊరేగుతూ ఊగుతూ/ విలువల జగత్తులో భాగమౌతాను’’.


బిందువుగా మొదలై సింధువై సాగే నది ప్రతి మలుపునీ తెలుగు కవులు అక్షరాల్లో కూడబెట్టారు. కవి వాడ్రేవు చినవీరభద్రుడి వాక్యాలతో మిగిలిపోయిన ఒక్క మలుపునీ జోడిస్తాను: ‘‘నది ప్రవహిస్తూనే ఉంది. తీరాలు పంకిలాలై కంపుకొడుతున్నాయి. దూకితే నదీ గర్భంలోకి దూకాలి. వెచ్చగానో.. చల్లగానో.. అద్భుతమో.. అనుభవమో.. అది.. కాని ఈ నది వొడ్డున, ఈ దుమ్ములో.. దుర్గందంలో.. నది ఏమర్థమవుతుంది? ప్రవాహం ఏం సందేశానిస్తుంది..? అయినా.. ఆశ నిండిన కళ్ళతోనే నదిని చూస్తాను. ఇది నా విధి. బహుశా ఇది ఒక్కటే అన్ని విధుల్లోకి ఆనందకరమైన విధి అనుకుంటాను.’’

నది ఒక కవిత్వగని. తవ్వుతున్నకొద్దీ కవిత్వం కాల్వలు కడుతుంది. రూపాయి నాణెం విసిరి చేతులు జోడించే సగటు మనిషి నుండి నదిని నినాదంగా పిడికిట్లో పట్టుకున్న దార్శనిక కవి వరకూ, వల విసిరి బతుకును వెళ్లదీసే జాలరి మొదలు నదిని ఆర్తిగా గుండెల్లో పొదువుకునే తాత్వికుడి వరకూ.. ఎన్నో కవిత్వపాయలు.

సాంబమూర్తి లండ

96427 32008

ఈ వార్తలు కూడా చదవండి

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

సీసీ టీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫోటోలు విడుదల చేసిన ఇరాన్

Updated Date - Mar 30 , 2026 | 02:51 AM