నా పార్థివ దేహమ్మీద సీతాకోక చిలుకలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:47 AM
నేనిప్పుడు ఎచ్చి పచ్చిగా పడివున్న పార్థివ దేహాన్ని అనాత్మ వస్తువును కొంచె శక్తి సరస్సును పాట వాక్యం కంటే...
నేనిప్పుడు
ఎచ్చి పచ్చిగా పడివున్న
పార్థివ దేహాన్ని
అనాత్మ వస్తువును
కొంచె
శక్తి సరస్సును
పాట వాక్యం కంటే
ముందే పడి వున్న
అనాది మూల జీవానుభవాన్ని
ఎండిపోతున్న తాటిచెట్ల
పురావాసనను
ఓటమి
ఇప్పటెప్పటికీ
నా
విజయస్తూపం
స్వప్న ప్రవాహం
నా చెదిరిపోని నవ్వు కూడా...
చందమామ ఎపుడూ
కాస్మిక బాయి నుంచి నన్నే
తొంగిచూస్తుంటుంది
నన్ను తనలో సమాధి చెయ్యడానికే...
నా కోసమే
నిరీక్షణలో మునిగిపోయి వుంది
నుదురు మీద అరచేతిని
పుట్టఛత్రిలాగ పెట్టి
కాచుకునే వుంది
చూడంర్రి నాయనా...
నేనింకా సన్నగానే
పచ్చగానే రేకులింకా విప్పుకుంటనే వున్న
ఎండిపోని ఉట్టి వంటి పార్థివ దేహాన్ని...
ఎపుడూ
నాపైకి చేరే గుంపుల గుంపుల
సీతాకోకచిలుకలు
వందల వేల పూల జాతుల సీతాకోకచిలుకలు
భూమిని వదిలి వాలకుండా
నిజాస్తిత్వ పాఠశాలల దవాఖానాల
విఫల తత్త్వపట్వల మీద ఎగిరెగిరీ
నా జీవ అజీవ శవమ్మీద
పటమేస్తూ పాడుతూ
ఎగుర్తునే వున్నాయి
నిజబొంత చెట్ల గొంగడి పురుగుల
సీతాకోకచిలుకలు
ఇవి
నా నిశ్శబ్ద ఖననం కంటే
ముందే పుట్టినవి
లోయ వాగుల కంటే ముందే పుట్టినవి
నదులకు పేర్లు పెట్టడానికంటే
ముందే పుట్టినవి
AI బీటలూ తూటాల నెత్తుటి
మూటలవ్వకముందే పుట్టినవి
ఇండ్లు తెరిచినవీ, కూలిన గూళ్ళవీ
కండ్లు చిమ్మటించినవీ
సర్వవిచ్ఛిన్న ప్రాంత దేశాలవీ
నా దేహ చెదల పొదల కట్టె దేహమ్మీద
ఎప్పట్నుంచో ఎగుర్తున్న
సీతాకోకచిలుకలు
సీతాకోకచిలుకలు
నేను
అతిపురాతన
అజరామర పార్థివ దేహాన్ని.
సిద్ధార్థ
73306 21563
ఈ వార్తలు కూడా చదవండి
పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
సీసీ టీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..
మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫోటోలు విడుదల చేసిన ఇరాన్