Share News

ఎల్లలోకములొక్క ఇల్లయి...

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:31 AM

పూవులకు సంగీతాన్ని వినిపించి చరణాల స్పర్శతో గిలిగింతలు రేపి కోల్పోవటాన్ని మధురానుభూతిగా ఎదకెత్తి నొప్పి తెలీకుండా తేనెబొట్టును...

ఎల్లలోకములొక్క ఇల్లయి...

పూవులకు సంగీతాన్ని వినిపించి

చరణాల స్పర్శతో గిలిగింతలు రేపి

కోల్పోవటాన్ని మధురానుభూతిగా ఎదకెత్తి

నొప్పి తెలీకుండా తేనెబొట్టును

దోసిళ్లతో తెచ్చి కూడేస్తుంది తేనెటీగ...

మనిషీ! నీకా నేర్పరితనం లేకనే కదా

తుట్టెను ఛిద్రం చేసి ఈగల్ని హింసించేది

భూమిని ఒళ్లంతా తడివి బుజ్జగించి

నీళ్లతో పాదాభిషేకం చేసి ప్రేమించి

ఇవ్వటాన్ని అమ్మదనంగా ఒడికెత్తి

పైరుగా మారిన మట్టిని గాఢంగా కౌగిలించి

పంటగా తెచ్చుకొంటాడు రైతు...

సమాజమా! నీకంతటి పోషించే తత్వం లేకనే కదా

సేద్యాన్ని ఉరితాళ్లకు వేలాడేసేది.

అక్షరాలను మునివేళ్ల మీద అంటించి

జ్ఞానంతో మెదడు రగులుకొనేలా చేసి

వెలగటాన్ని జీవికగా తలకెత్తి

దీపస్తంభంగా మారిన విద్యార్థి నీడకింద

ఒత్తిలా నిలుచుంటాడు ఉపాధ్యాయుడు...

దేశమా! నీకా ఇంధనతత్వం లేకనే కదా

దీపాల్ని విదేశాల వీధులపాలు చేసేది.

ఖండాలన్నిట్నీ పిడికెడు గింజలుగా వొడికెత్తి

సముద్రాలన్నిట్నీ పుడిసెడు నీటిగా ముక్కునబట్టి

సరిహద్దుల్లేని ఆకాశదారుల్ని రెక్కలకింద వొంచుకొని

ఎల్లలోకములొక్క ఇల్లుగా మార్చుకొని

విశ్వగీతాన్ని పాడుతూ ప్రయాణిస్తుంది పిడికెడు పిట్ట...

ప్రపంచమా! నీకా ఎల్లలెరుగని చూపుల్లేకనే కదా

విధ్వంస గీతాల్ని వినిపిస్తూ వున్నావు

- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

Updated Date - Apr 13 , 2026 | 01:32 AM