Share News

జనహితం లేని సుందరీకరణ!

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:35 AM

మూసీ నది హైదరాబాద్ చరిత్రలో ఒక భాగం. ఇది నగర ఆత్మకు ప్రతిబింబం. ఈ నదిని పునరుజ్జీవింపజేయాలనే ఆకాంక్ష అందరిలోనూ ఉంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ‘మూసీ సుందరీకరణ’ ప్రాజెక్టు నగరంలో తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీస్తోంది.

జనహితం లేని సుందరీకరణ!

మూసీ అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన లక్షన్నర కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘నమామి గంగే’ వంటి భారీ ప్రాజెక్టుకు కొన్ని వందల కిలోమీటర్లకు రూ.42వేల కోట్లు ఖర్చవుతుంటే, కేవలం 55కి.మీ మూసీ నదికి లక్షన్నర కోట్లు ఎందుకు?

మూసీ నది హైదరాబాద్ చరిత్రలో ఒక భాగం. ఇది నగర ఆత్మకు ప్రతిబింబం. ఈ నదిని పునరుజ్జీవింపజేయాలనే ఆకాంక్ష అందరిలోనూ ఉంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ‘మూసీ సుందరీకరణ’ ప్రాజెక్టు నగరంలో తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీస్తోంది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగర మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మూసీని అభివృద్ధి చేయడానికి రూ.16,000 కోట్ల వ్యయంతో ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా, పర్యావరణానికి హాని కలగకుండా సుందరీకరణను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన లక్షన్నర కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘నమామి గంగే’ వంటి భారీ ప్రాజెక్టుకు కొన్ని వందల కిలోమీటర్లకు రూ.42వేల కోట్లు ఖర్చవుతుంటే, కేవలం 55కి.మీ. మూసీ నదికి లక్షన్నర కోట్లు ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం లక్షన్నర కోట్లు వెచ్చించి మూసీనది సుందరీకరణ చేస్తామంటే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో ఊహించలేకపోతున్నదా? బాధితుల ఇళ్ల విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తూ, మంత్రుల ఇళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అపార్ట్‌మెంట్ల విషయంలో మాత్రం బఫర్ జోన్ నిబంధనల అమలును సడలించటం ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపుతున్నది.


ఇది సుందరీకరణ కంటే 3,300 ఎకరాల భూమి సేకరణ లక్ష్యంగా జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారమని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని భూముల విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని, ఈ భూములపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఇదంతా నగరం కోసం, మూసీ ప్రక్షాళన కోసం చేస్తున్న పనే అయితే, గత ప్రభుత్వం రూపొందించిన రూ.16,000 కోట్ల ప్రణాళికను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందేమిటి? ఆ మోడల్ ఎందుకు పనికిరాదు?

గతంలో సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో నదీగర్భంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న మురికివాడల వారిని స్థానభ్రంశం చెందించి, మెరుగైన ఇండ్లు నిర్మించి ఇచ్చారు. నదీ గర్భం నుంచి సేకరించిన 202 హెక్టార్ల భూమిలో 14 శాతం భూమిని మాత్రమే ప్రైవేట్ డెవలపర్లకు అమ్మి, వచ్చిన ఆదాయంతో ప్రాజెక్టు ఖర్చులను భరించారు. ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండా ఆ ప్రాజెక్టు మొదటి దశను (11 కిలోమీటర్లు) పూర్తి చేశారు. పుణె నగరవాసుల చిరకాల స్వప్నమైన ‘ముల్లా-ముత్తా రివర్ ఫ్రంట్’ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.4,727 కోట్లు. 44 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం 11 విడతల్లో జరగనున్నది. ఈ ప్రాజెక్టులో ప్రధాన అభివృద్ధి పనులు, పాదచారుల కోసం వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు నది పొడవునా పచ్చదనం వెల్లివిరిసేలా భారీ స్థాయిలో ‘దేవ్రాయ్’ (పట్టణ అడవులు) నిర్మిస్తున్నారు. కాలానుగుణంగా వచ్చే వరదలను తట్టుకునేలా బహుళ అంచెల ‘గాబియన్’ (Gabion) టెర్రస్‌లను శాస్త్రీయంగా రూపొందిస్తున్నారు. ఇక మన మంత్రుల బృందం పర్యటించిన సీయో నగరంలోని రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పొడవు 10.9 కిలోమీటర్లు. నది ప్రవాహం, ఇరువైపులా నడక దారులతో కలిపి దీని వెడల్పు 20 నుండి 80 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సుమారు రూ.3,100 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు.


కానీ ఇక్కడ మూసీ ప్రాజెక్ట్‌ విషయంలో బఫర్ జోన్ పరిధిని పెంచి ఆధునికంగా నిర్మించుకున్న గృహాలు అన్నింటినీ తొలగించి వేసే పనికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూనుకొనడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నది. సుమారు 3300 ఎకరాల భూమిని సేకరించాలనుకోవడంతోనే ఇక్కడ సమస్య మొదలైంది. ఏ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకూ ఇంత మొత్తంలో భూమి సేకరణ జరగలేదు. అంత భూమి సేకరించి వారు నిర్మించబోయే వ్యాపార సామ్రాజ్యం కోసం ఇక్కడి ప్రజలు తమ భూములను ఇండ్లను వదులుకోవాలనడం గర్హనీయం.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు పట్ల పర్యావరణవేత్తలు, రాజకీయవేత్తలు తమ అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో సమస్య తీవ్రతను గుర్తించి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోణాలను పక్కన పెట్టి తక్కువ ఖర్చుతో కూడిన ప్రణాళికలను అమలు చేయాలి. బాధితులతో చర్చలు జరిపి, మధ్యే మార్గాన్ని వెతకాలి.

- ఎర్రోజు శ్రీనివాస్

అధ్యక్షులు, తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం

Updated Date - Mar 28 , 2026 | 12:47 AM