Share News

మూసీ శాశ్వత వరం!

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:30 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుద్ధరణను కేవలం ఒక సుందరీకరణ ప్రాజెక్టుగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధి, ప్రజా జీవన ప్రమాణాల మెరుగుదలకు సంబంధించిన సమగ్ర కార్యక్రమంగా రూపుదిద్దుతోంది.

మూసీ శాశ్వత వరం!

గోదావరి జలాలతో మూసీకి నీటి ప్రవాహం పెంచే చర్య అమలైతే మూసీ శుద్ధీకరణకు దీర్ఘకాలిక పరిష్కారం లభించినట్టే. నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి, పేదలకు పునరావాసం కల్పిస్తూ, నదిని కాపాడే సమతుల్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుద్ధరణను కేవలం ఒక సుందరీకరణ ప్రాజెక్టుగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధి, ప్రజా జీవన ప్రమాణాల మెరుగుదలకు సంబంధించిన సమగ్ర కార్యక్రమంగా రూపుదిద్దుతోంది. తెలంగాణ అసెంబ్లీలో సమర్పించిన ప్రణాళికల ప్రకారం సుమారు 55 కిలోమీటర్ల మేర విస్తరించే మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. మొదటి దశకు దాదాపు రూ.5,812 కోట్ల వ్యయం అంచనా వేయగా, ఇటీవలి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లను ప్రత్యేకంగా కేటాయించడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేసింది.

మూసీ చరిత్ర ఎంతో గొప్పది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి దాదాపు 267 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఒకప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా సాగు జరిగేది. అనేక రకాల చేపలు, జీవ వైవిధ్యం ఈ నదిలో కనిపించేవి. నగర అభివృద్ధి వేగంతో ఈ సహజ సంపద క్రమంగా నశించింది. ప్రస్తుతం మూసీ కాలుష్యం నగర ప్రజల ఆరోగ్యానికి కూడా సవాలుగా మారింది.

మూసీ చరిత్రలో 1908 వరద ఒక పెద్ద మలుపు. ఆ విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నగరాన్ని రక్షించేందుకు ఓస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలాశయాల నిర్మాణం జరిగింది. ఈ జలాశయాలు నగరానికి తాగునీరు అందించడమే గాక, వరద నియంత్రణలో కూడా కీలకపాత్ర పోషించాయి. అయినప్పటికీ తరువాతి దశాబ్దాల్లో కూడా పలుసార్లు వరదలు సంభవించడం మూసీ పరివాహక ప్రాంతాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉంది.


మూసీ పునరుద్ధరణకు గతంలో కూడా పలు ప్రయత్నాలు జరిగాయి. వివిధ ప్రభుత్వాలు పలు పథకాలు ప్రకటించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కాలేకపోయాయి. నిధుల కొరత, పరిపాలనా సమస్యలు, స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వంటి కారణాలతో ఆ ప్రణాళికలు నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం స్పష్టమైన లక్ష్యాలు, సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ దిశగా తీసుకుంటున్న చర్యలు నగర భవిష్యత్తుపై కొత్త ఆశలను కలిగిస్తున్నాయి.

మూసీని కేవలం శుద్ధి చేయడం మాత్రమే గాక, బాపుఘాట్ ప్రాంతాన్ని సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడం, గాంధీ సరోవర్ నిర్మాణం, పచ్చదనంతో కూడిన పార్కులు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, వినోద స్థలాల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు నగర సౌందర్యాన్ని పెంచేలా ఉన్నాయి. బాపుఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం, మ్యూజియం, అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం వంటి ప్రతిపాదనలు మూసీని ఒక సాంస్కృతిక సమన్వయ కేంద్రంగా మార్చే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

మరో ముఖ్య అంశం మూసీకి శాశ్వత నీటి ప్రవాహాన్ని కల్పించడం. గోదావరి జలాలతో మూసీకి నీటి ప్రవాహం పెంచే చర్య అమలైతే మూసీ శుద్ధీకరణకు దీర్ఘకాలిక పరిష్కారం లభించినట్టే. అదే సమయంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అక్రమ కబ్జాలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పేదలకు పునరావాసం కల్పిస్తూ, నదిని కాపాడే సమతుల్య విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.


ప్రపంచంలోని అనేక నగరాలు తమ నదులను పునరుద్ధరించి నగర అభివృద్ధికి మార్గదర్శకంగా మార్చుకున్నాయి. లండన్‌లో థేమ్స్ నది, దక్షిణ కొరియాలో సియోల్ నగరంలోని చియోంగ్‌జియోన్ నది ఇందుకు మంచి ఉదాహరణలు. ఒకప్పుడు కాలుష్యానికి గురైన ఆ నదులు ఇప్పుడు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మారాయి. అదే తరహా మార్పు మూసీకి కూడా సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నదిని కాపాడటం అంటే కేవలం ఒక జలవనరును సంరక్షించడం మాత్రమే కాదు నగర భవిష్యత్తును భద్రపరచడం. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నాలతో హైదరాబాద్ తన సహజ వైభవాన్ని తిరిగి పొందగలదు.

-అమరవాజి నాగరాజు

టీపీసీసీ ప్రెసిడెంట్ పీఆర్ఓ

Updated Date - Mar 28 , 2026 | 12:32 AM