Share News

ముసాఫిర్ ముక్తగీతం

ABN , Publish Date - Oct 26 , 2026 | 02:24 AM

ఖాళీ చేతులతో తల్లి గర్భం నుండి వలస వచ్చిన నువ్వు కొన్ని ప్రేమలనీ, నిందలనీ, మరెన్నో ద్వేషాలనీ సమూహాల మధ్య వెలివేతలనీ, శిథిల జ్ఞాపకాల...

ముసాఫిర్ ముక్తగీతం

ఖాళీ చేతులతో తల్లి గర్భం నుండి వలస

వచ్చిన నువ్వు

కొన్ని ప్రేమలనీ, నిందలనీ, మరెన్నో ద్వేషాలనీ

సమూహాల మధ్య వెలివేతలనీ, శిథిల జ్ఞాపకాల

వగపోతలనీ పోగుచేసుకున్నాక

ఉద్విగ్నతల ఉధృతి తగ్గి అన్నీ వలసపోయాక

నిదానించి నదివయ్యాక

ఇది నీ చోటు కాదు, చాలిక నిష్క్రమించు

ఈ జీవితాన ఎన్ని వలసలు,

ఎవరెవరివో కాందిశీక శిబిరాలు

నువ్వు పోగు చేసిన సామాన్ల మధ్యనే

అనేక విచ్ఛిత మానవుల జాడలు

యుద్ధానంతర క్షతగాత్ర మరుభూముల నడుమ

శర శయ్యపై కలత నిద్రల కలవరపాట్లు

నువ్వు నీ నుండీ, వాళ్ళ నుండీ,

వాళ్ళు నీ నుండీ వలస పోయాక

ఇది నీ చోటు కాదు చాలిక నిష్క్రమించు

నీలో నుండి ఖాళీ చేసి, నిచ్చెన మెట్లెక్కి

వెళ్ళిపోతారు మనుష్యులు

నీ ఊహలు కూడా వలసపోయిన

సంగతే నీకు తెలియదు

కనపడని గాయాల నొప్పిని మోస్తూ

అక్కడక్కడే ఎందుకో ఇంకా,

ఇంకా తచ్చాడుతావు

ఇది నీ చోటు కాదు చాలిక నిష్క్రమించు

మరణానంతర జీవితం ఏదీ లేదని తెలుసుకున్నాక

సకల లావాదేవీల, అమ్మకము, కొనుగోళ్ల

ధన, కీర్తుల విపణి వీధుల వ్యాపారాల

వేలం పాటల నుండి

కీర్తిశేషురాలివై, ఏమీ గడించక, నువ్వొక సరకు కాక

సగర్వంగా వెనక్కి తిరుగు

ఇది నీ చోటు కాదు, చాలిక నిష్క్రమించు

పొందిన, పొందని, పొందాలని కలలు కన్నవి

అన్నీ వలసపోయిన పక్షులై ఎగిరిపోతాయి

ఏ దిగులు, కాంక్ష, కోల్పోవడం, ఎదురుచూపుల

నొప్పే మిగలని క్షణమొకటి వచ్చాక

ఇది నీ చోటు కాదు, చాలిక నిష్క్రమించు

ఈ కాందిశీకుల లోకంలో నీ చివరి మజిలీకై

ఆఖరి సుఖనిద్రకై ఒక కుటీరాన్ని వెతుక్కుని

నిశ్శబ్దంగా ప్రయాణమై వెళ్ళు

విమల

ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 26 , 2026 | 02:35 AM