First Social Reformer: దళిత సాహిత్య వేగుచుక్క
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:15 AM
ఆధునిక భారతదేశ చరిత్రలో కుసుమ ధర్మన్న, డా. బి.ఆర్. అంబేడ్కర్, డా. అన్నాభావు సాఠె, బోయి భీమన్న మొదలైనవారు తమ రచనల ద్వారా దళిత సాహిత్యం అనే సౌధాన్ని నిర్మించగా...
ఆధునిక భారతదేశ చరిత్రలో కుసుమ ధర్మన్న, డా. బి.ఆర్. అంబేడ్కర్, డా. అన్నాభావు సాఠె, బోయి భీమన్న మొదలైనవారు తమ రచనల ద్వారా దళిత సాహిత్యం అనే సౌధాన్ని నిర్మించగా, ఆ సాహిత్య భవనానికి పునాది వేసింది మాత్రం ఒక పాఠశాల విద్యార్థిని. ఆమె పేరు ముక్తా సాళ్వె. ఘనమైన చారిత్రక నేపథ్యం కలిగివున్న లహుజీ సాళ్వె వంశంలో పూణేలోని గంజ్‌పేఠ్‌లో 1840 జనవరి, 5న ఆమె జన్మించారు. అగ్రవర్ణాలు ఆధిపత్యం చెలాయించే అప్పటి సామాజిక వ్యవస్థలో బాలికలకు విద్య అనేది కలలో కూడా ఊహించుకోవడానికి ఆస్కారం లేదు.
మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో తన గురువు, క్రాంతిపిత లహుజీ సాళ్వె సహకారంతో, మహాత్మా జ్యోతిబారావ్ ఫూలే బాలికల కోసం మొదటి పాఠశాలను పూణేలోని భిడేవాడాలో 1848లో ప్రారంభించారు. ఇది పెను సంచలనానికి దారితీసింది. ఫూలే దంపతులు మాంగ్, మహర్ వంటి కులాల బాలికల కోసం ‘వెటల్‌పేఠ్’లో స్థాపించిన పాఠశాలలో చేరిన ఎనిమిది మంది అమ్మాయిలలో ముక్తా సాళ్వె మొదటి విద్యార్థి. ఆమె కుటుంబ సభ్యుల నుంచి సమాజం అనే విషయం గురించి తెలుసుకొని, పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనతో ఆ విషయాలను అక్షర రూపంలో నేర్చుకున్నది. అనుభవంతో నేర్చుకున్న అంశాలను అక్షరబద్ధం చేసిన ఆమె ‘మాంగ్ మహారాచి దుఃఖవిశాయి’ అనే పేరుతో ఒక వ్యాసం రాసి, బడుగు బలహీన వర్గాలు, స్త్రీల సమస్యలను, అప్పటి క్రూర సమాజ కట్టుబాట్లను కళ్లకు కట్టినట్లు వివరించింది. దీని మొదటి భాగం 1855, ఫిబ్రవరి 15న, రెండవ భాగం మార్చి 1న ‘జ్ఞానోదయ్’ అనే మరాఠీ పత్రికలో ప్రచురితమయ్యాయి.
తన వ్యాసం ద్వారా ‘ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి మాత్రమే ప్రత్యేక హక్కులు కల్పించి, మిగిలిన వారికి ఎలాంటి హక్కులూ కల్పించలేని ధర్మం ఈ భూమి నుంచి అంతరించిపోవాలి’ అని ముక్తా పేర్కొన్నది. ఈ వ్యాసంలో విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పడంతో పాటు, మహిళలు, బడుగు బలహీన పేద వర్గాల వారు కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే తమ న్యాయమైన హక్కుల్ని, గౌరవాన్ని పొంది, అభివృద్ధి మార్గంలో పయనిస్తారని చెప్పింది. అందరికీ కనిపించే విధంగా ప్రతి పాఠశాల దర్శనీయ ప్రదేశాల్లో ఈ వ్యాసం ప్రదర్శించాలని బొంబాయి విద్యాశాఖ 1855లో ఉత్తర్వులు జారీ చేసి, ఆమెను ఉత్తమ విద్యార్థిగా గౌరవించింది. అదే ఏడాది పూణా గెజిట్‌లో కూడా ముక్తా వ్యాసం ప్రచురితమయింది. అనేకసార్లు అనువాదమైన ఘాటైన ఆమె వ్యాసం, దళిత సాహిత్యంలో మొదటి రచనగా ఖ్యాతిగాంచింది. అందుకే ముక్తాను దళిత సాహిత్యానికి తల్లి అని పిలుస్తారు.
కేవలం మూడు సంవత్సరాల పాఠశాల విద్యాభ్యాసం ద్వారా 14 ఏళ్ల వయస్సులోనే వివక్ష, అణచివేత లాంటి విస్తృత భావనలను అర్థం చేసుకొని, బలహీనవర్గాలపై ఆధిపత్య వర్గాలు చేస్తున్న అకృత్యాలను బహిర్గతం చేసింది. విద్యా జ్ఞానమే అన్ని సమస్యలకు దివ్యౌషధం అని ప్రపంచానికి చాటిచెప్పి, ఆధునిక భారతీయ విద్యా విధానం ప్రక్షాళనకు కారకులైన మొదటి దళిత రచయిత ముక్తా సాళ్వె. ఆమె ఆశయాలను, కృషిని స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్
రాష్ట్ర అధ్యక్షులు, మాంగ్ సమాజ్ తెలంగాణ
(జనవరి 5: ముక్తా సాళ్వె జయంతి)