రాయితీలన్నీ ధారపోసి ఈ రాగం ఎందుకు?
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:39 AM
‘పన్నులు తగ్గించాం, రాయితీలు ఇచ్చాం. మరి ఉద్యోగాలేవి? జీతాల పెంపు ఏది?’ అని కార్పొరేట్లను ప్రశ్నించారు ప్రధానమంత్రి మోదీ. నవంబర్ 19న న్యూఢిల్లీలో జరిగిన ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) వందేళ్ల వేడుకల్లో..
‘పన్నులు తగ్గించాం, రాయితీలు ఇచ్చాం. మరి ఉద్యోగాలేవి? జీతాల పెంపు ఏది?’ అని కార్పొరేట్లను ప్రశ్నించారు ప్రధానమంత్రి మోదీ. నవంబర్ 19న న్యూఢిల్లీలో జరిగిన ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) వందేళ్ల వేడుకల్లో ప్రధానమంత్రి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22శాతానికి తగ్గించామని, రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశామని గుర్తు చేశారు. ఇన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ పారిశ్రామికవేత్తలు కొత్త ఉద్యోగాలను కల్పించలేదని, ఉద్యోగుల జీతాలను పెంచలేదని, దేశాభివృద్ధికి తగినంతగా తోడ్పడలేదని నిలదీశారు. ప్రధాని ప్రసంగంలో ఈ మాటలపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?ఇది కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న లాలూచీ కుస్తీ కాదా?
ప్రధానమంత్రి అంటున్నట్టే– కార్పొరేట్ పన్నులను రికార్డు స్థాయిలో తగ్గించి, బడా వ్యాపారవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చినా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. సంపద సృష్టించే ఉద్యోగుల, కార్మికుల జీతాలు పెరగలేదు. అంటే, గత పన్నెండేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ప్రధానమంత్రే ఒప్పుకున్నారని అనుకోవచ్చా?
బడా కార్పొరేట్ సంస్థలు ఎప్పుడూ తమ లాభాలను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. కార్మిక సంక్షేమం, ఉద్యోగ కల్పన వాటి ప్రాధాన్యతల్లో ఉండవు. ఇది జగమెరిగిన సత్యమే. అయినప్పటికీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించింది. కొత్తగా ప్రారంభించిన మాన్యుఫాక్చరింగ్ రంగ సంస్థలకైతే ఇది 15శాతమే. కనీస ప్రత్యామ్నాయ పన్నును (మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్) 18.5శాతం నుంచి 15శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాల ఫలితంగా, ప్రభుత్వ అంచనాల ప్రకారమే సంవత్సరానికి రూ.3.03 లక్షల కోట్ల మేర పన్నుల ఆదాయం తగ్గింది. అంటే ఆ మేరకు ప్రజాధనం కార్పొరేట్ సంస్థలకు పోయినట్లేగా?
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వాతావరణం ఉన్నప్పుడే కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి ముందుకొస్తాయి. కొత్త ఫ్యాక్టరీల వలన ఉద్యోగాలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి. జీతాలు పెరిగితే ప్రజల్లో కొనుగోలుశక్తి పెరుగుతుంది. అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్‌ను బట్టి ఇంకా కొత్త పెట్టుబడులు పెరుగుతాయి. దీన్నే అర్థశాస్త్రంలో పాజిటివ్ ఎకనామిక్ సైకిల్ అంటాం. కానీ ఇందుకు భిన్నంగా గత కొన్నేళ్లుగా మన ఆర్థిక చక్రం తిరోగమనంలో ఉంది. నిరుద్యోగం, ఆర్థిక అంతరాలు, అసమానతలు పెరుగుతున్నాయి. అరకొర ఉద్యోగ కల్పన జరిగినా అది అసంఘటిత రంగంలోనే జరిగింది. భద్రత, గ్యారంటీ లేని ఉద్యోగాల్లో గిగ్ వర్కర్లు పెరుగుతున్నారు. తగినంతగా నిధులు కేటాయించకుండా గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రభుత్వమే నీరుగారుస్తున్నది. ఊళ్లలో నిరుద్యోగం పెరిగి, కొనుగోలు శక్తి దిగజారుతున్నది.
బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషణ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం (2026–27) రెండో త్రైమాసికంలో, అంటే గత మూడు నెలల్లోనే, స్టాక్ మార్కెట్లో నమోదైన 2,600కు పైగా కంపెనీలు సుమారు రూ.4.5 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. అయితే ఆ లాభాలు అందరికీ సమానంగా అందలేదు. మొదటి ఐదు కంపెనీలు (రిలయన్స్, ఎస్బీఐ, ఇండియన్ ఆయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ) దాదాపు 25శాతం లాభాలను ఖాతాలో వేసుకున్నాయి. తరువాతి ఐదు కంపెనీలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం పది కంపెనీలూ ఆ లాభాల్లో 38శాతాన్ని సొంతం చేసుకున్నాయి. మొదటి 50 కంపెనీలను తీసుకుంటే అవి ఈ లాభాల్లో ఏకంగా 55శాతాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఉదాహరణ ఒక్కటి చాలదా లాభాలన్నీ కొందరి చేతుల్లోనే పోగవుతున్నాయని అర్థం చేసుకోవడానికి? పోనీ ఈ లాభాలు వస్తున్న కంపెనీలైనా కొత్త ఉద్యోగాలను ఎందుకు సృష్టించడం లేదు, జీతాలు ఎందుకు పెంచటం లేదు?
పరిశ్రమల పని విధానాన్ని నిర్ణయించేది ప్రభుత్వ విధానాలే. 2018 నుంచి ప్రతి బడ్జెట్లో దిగుమతి సుంకాలు పెంచారు. నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల (క్యూసీవోలు) పరిధిలోకి పాలిస్టర్ దారం నుంచి పాదరక్షల వరకు వందలాది ఉత్పత్తులను చేర్చారు. ఫలితంగా చౌకగా దిగుమతి అయ్యే ముడి సరుకులు రావడం లేదు, దేశీయ సరఫరాదారులకు తగినంత రక్షణ దొరుకుతోంది. కానీ పోటీ లేనప్పుడు నూతన ఆవిష్కరణలకు ఒత్తిడి ఉండదు. ఇక్కడ సుంకాలనూ, క్యూసీవోలనూ నిర్ధారించేది పరిశ్రమలు కాదు. ఆ బాధ్యత ప్రభుత్వానిదే.
శ్రమ లేకుండా సంపద లేదు. ఇది ఆర్థికశాస్త్ర మౌలిక సూత్రం. వస్తుసేవల ఉత్పత్తి జరగాలంటే అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు చేసే శ్రమే ప్రధానం. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం పెట్టుబడే సంపదను సృష్టిస్తుందన్న తిరోగమన అవగాహనతో నడుస్తోంది. అందుకే దాని విధానాలన్నీ కార్పొరేట్ అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు శ్రమపై పెట్టుబడి ఆధిపత్యం స్థిరపడింది.
ప్రధాని ప్రసంగంలో గమనించాల్సిన మరొక విషయం ఉన్నది. తదుపరి సంస్కరణలు ఏ దిశగా జరగాలన్న అంశంలో ఫిక్కీ రాతపూర్వక సూచనలు ఇవ్వాలని ప్రధానమంత్రి స్వయంగా ఆహ్వానించారు. కార్పొరేట్లకు ఇంత సులభంగా తలుపులు తెరిచి వారి నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నారే, మరి శ్రామికుల, ఉద్యోగ సంఘాల సూచనలను ఇలా ఎప్పుడైనా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయా? దీన్నిబట్టే ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎవరి గొంతు వినిపిస్తున్నదో, ఎవరి గొంతు దాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతున్నదో అర్థమవుతోంది.
అసలు ఉద్యోగాలు పెరగటం లేదని కార్పొరేట్లను నిందించే ముందు ప్రభుత్వం ఈ విషయంలో తనేం చేస్తున్నదో కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. అంచనాల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 30 లక్షల శాశ్వత ఉద్యోగ ఖాళీలు భర్తీ కాలేదు. ఆ ఖాళీల్లో తాత్కాలిక, దినసరి, కాంట్రాక్టు, అప్రెంటిస్, ఔట్సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారు. వారికి అరకొర జీతాలే తప్ప సమాన పనికి సమాన వేతనం లేదు. ప్రభుత్వమే ఉద్యోగ భద్రత కలిగిన, సరైన జీతాలు ఉన్న వ్యవస్థను నిర్మించలేనప్పుడు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలని ఆశించడం ఎంతవరకు సబబు?
కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన వేజ్ కోడ్‌లో కనీస వేతనాల ప్రస్తావనే లేదు. దానికి బదులు ‘ఫ్లోర్ రేట్’ అంటూ రోజుకు రూ.176 అని కొత్తగా నిర్ణయించారు. ఇలా ఒకపక్క వేతన విధానాన్నే బలహీనపరిచిన ప్రభుత్వం, మరోపక్క ‘జీతాలు ఎందుకు పెంచలేదు’ అని కార్పొరేట్లను నిలదీయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తన విధానపరమైన లోపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాదా ఇది? అమెరికన్ తత్వవేత్త, భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ సంస్థలకు ప్రతినిధులుగా పనిచేస్తున్నాయని సూత్రీకరించారు. మన దేశంలో జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉందా?
‘సంపద పెరుగుతున్నప్పటికీ అది శ్రమజీవులకు చేరడం లేదు’ అని ప్రధానమంత్రి చెప్పింది అక్షరాలా నిజమే. కానీ అందుకు ప్రశ్నించాల్సింది కార్పొరేట్లను మాత్రమే కాదు, విధాన రూపకర్తగా ప్రభుత్వం తనను తానే విమర్శించుకోవాలి. ఖాళీలను భర్తీ చేయడం, కనీస వేతనాన్ని చట్టబద్ధం చేయడం, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వ్యవస్థకు ముగింపు పలకడం, సంపదపై న్యాయమైన పన్ను విధించడం ప్రభుత్వం చేతుల్లో పనులు. వేదికపై నిలబడి కార్పొరేట్ సంస్థలను నిలదీసినంత మాత్రాన కొత్త ఉద్యోగాలు రావు. మాటలతో వేతనాలు పెరగవు. ప్రభుత్వం తగిన విధాన రూపకల్పన చేయాలి. నిబద్ధతతో ఆ విధానాల్ని అమలు చేయాలి.
- పి. వెంకటరామయ్య