Share News

రూపు మారుతున్న గ్రామీణ భారతం

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:20 AM

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీని తెచ్చింది. దీనిపై పెద్దఎత్తున అనుకూల, వ్యతిరేక చర్చలు సాగుతున్నాయి.

రూపు మారుతున్న గ్రామీణ భారతం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీని తెచ్చింది. దీనిపై పెద్దఎత్తున అనుకూల, వ్యతిరేక చర్చలు సాగుతున్నాయి.

భారతదేశ గ్రామీణ సంక్షోభం అనేది వివాదం లేని అంశం. ఇది– వ్యవసాయం, ఉపాధి, అప్పులు, వలసలు, విద్య, ఆరోగ్యం, సామాజిక అసమానతలు వంటి అనేక అంశాల కలయికతో ఏర్పడిన బహుముఖ సమస్య.

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. ఇక్కడ చిన్న, సన్నకారు రైతులు అంటే– రెండు హెక్టార్లలోపు భూమి ఉన్నవారే అధికం. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ, పండించిన పంటలకు కనీస మద్దతు ధర మాత్రం లభించడం లేదు. దీనికి తోడు మార్కెట్‌లో ధరల అస్థిరత, వర్షాధార వ్యవసాయం, వాతావరణ మార్పుల ప్రభావం వంటి కారణాలు రైతుల అప్పులు పెరగడానికి, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. 1991 తరువాత మన దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో, 2014 తరువాత వ్యవసాయ రంగంపై ప్రభుత్వ పెట్టుబడులు భారీగా తగ్గాయి. ప్రభుత్వ రుణపరపతి తగ్గుతూ వచ్చింది. ప్రైవేట్ వడ్డీ, మార్కెట్ ఆధారిత విధానాలు పెరిగాయి. రైతులు గ్లోబల్ ధరల ప్రభావానికి గురవుతున్నారు. వీటితో రైతుల అప్పులు, యువత వలస, సామాజిక అసమానతలు వంటివి చోటుచేసుకుంటున్నాయి.


ఈ కాలంలోనే భూసంబంధాలలో అనేక మార్పులు జరిగాయి. కొద్దిమంది వద్ద భూమి కేంద్రీకృతమవడం, ఎక్కువ మందికి భూమి లేకపోవడం అతిపెద్ద మార్పు. 2018–19 నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నివేదిక ప్రకారం, గ్రామీణ ప్రాంతంలో 20శాతం ధనికుల వద్ద 76శాతానికి పైగా భూమి ఉంది. 41శాతం కుటుంబాలకు ఎటువంటి భూమీ లేదు. సెంటు భూమి కూడా లేని కుటుంబాలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 54.4 శాతం, తెలంగాణలో 42.5శాతం ఉన్నాయి. ఇదే నివేదిక ప్రకారం సామాజిక అసమానతలు కూడా బాగా పెరుగుతున్నాయి. 57.3శాతం మంది దళితులు, 32.8శాతం ఆదివాసీలు, 53.1శాతం ముస్లింలు భూమిలేని పేదలుగా ఉన్నారు. ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్‌ స్టడీస్‌’ అనే సంస్థ సర్వే ప్రకారం, గ్రామీణ ప్రాంతంలో కేవలం 5శాతం సంపన్నులు 60శాతం సంపదను కలిగి ఉన్నారు. సీలింగ్ భూములలో కూడా నేటికీ 18 లక్షల ఎకరాల భూమి వీరి నుంచి సేకరించలేదు. అలాగే 60 లక్షల ఎకరాల బంజరు భూమి అందుబాటులో ఉన్నా, అర్హులకు పంచలేదు. 5 లక్షల ఎకరాల భూదాన భూముల పంపకం ప్రశ్నార్థకంగా మిగిలింది. అందులో 1.4 లక్షల ఎకరాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం–2006కు అనుగుణంగా జూన్ 2025 నాటికి 51.2 లక్షల అర్జీలు రాగా, 25.1 లక్షలు అంటే సగం పరిష్కారం కాలేదు. వీటికి తోడు వివిధ ప్రాజెక్టుల పేరున పెద్దఎత్తున జరుగుతున్న భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ ద్వారా అనేక మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్న కొద్దిపాటి భూమినీ కోల్పోతున్నారు. క్రమంగా వ్యవసాయేతర కూలీలుగా మారిన వీరికి ఇస్తున్న వేతనాలు కూడా చాలా తక్కువ. ‘లేబర్ బ్యూరో’ జూన్ 2025 నివేదిక ప్రకారం, పురుషులకు రోజు కూలి రూ.418, మహిళలకు రూ.334 మాత్రమే ఉంది. అంటే, గ్రామీణ పేదరికం మరింతగా పెరుగుతోంది.


ఒకప్పుడు ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయం ఇప్పుడు మార్కెట్ ఆధారితం అయింది. విత్తనాలు, ఎరువులు, యంత్రాలు వంటివి కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి వెళ్లాయి. రైతు ఉత్పత్తిదారుడు అయినా, లాభం ఎక్కువగా మధ్యవర్తులు, కంపెనీలకే వెళ్తోంది. చిన్న ఉత్పత్తిదారులు అప్పుల వల్ల భూమి కోల్పోతూ కూలీలవుతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో చిన్న రైతుల శ్రామిక వర్గీకరణ ఏర్పడింది. రైతు శ్రమ ద్వారా సృష్టించిన విలువలో సింహభాగాన్ని మార్కెట్, వడ్డీ వ్యాపారస్థులు, వాణిజ్య కంపెనీలు తీసుకుంటాయి. ఇది ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్ష దోపిడీ రూపం. అందువల్ల గ్రామీణ సంక్షోభం అనేది ‘నయా ఉదారవాద అభివృద్ధి విధానం’ సృష్టించిన అంతర్గత వైరుధ్యం. గ్రామీణ ప్రాంతంలోని ఈ విధానాల వల్ల 1997–2022 మధ్య అధికారిక లెక్కల ప్రకారమే మూడు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఉదారవాద విధానాల కాలంలో కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ పరిశోధనలు, విత్తనాల తయారీ, ఎరువుల అమ్మకం, ఫ్యూచర్ ట్రేడింగ్ వంటి వ్యవసాయ రంగాలలో ప్రవేశించడం, ప్రభుత్వం క్రమేణా వాటన్నింటి నుంచీ వైదొలగడంతో కార్పొరేట్ వ్యవసాయ ప్రోత్సాహం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వంటివి రైతును మార్కెట్ ఆధీనంలోకి మరింతగా నెట్టాయి. 2014 తరువాత ప్రభుత్వ రంగంలో ఎరువుల తయారీ తగ్గి, దిగుమతులపై ఆధారపడడంతో ఈ సంక్షోభం మరింత పెరిగింది.

2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రైతుల కష్టాలను మరింత పెంచింది. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించడానికి శత విధాలా ప్రయత్నించి, అది సాధ్యం కాకపోవడంతో, అనేక విధాలుగా తూట్లు పొడుస్తోంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల కనుగుణంగా కనీస మద్దతు ధరను ఇవ్వడానికి నిరాకరిస్తూ, మరో పక్క కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేలా మూడు నల్ల చట్టాలను చేసింది. రైతుల సుదీర్ఘ పోరాటంతో వాటిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించినా, ఆచరణలో అవే విధానాలను కొనసాగిస్తోంది. ఈ పోరాటం బలంగా సాగిన దేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 2024 పార్లమెంటు ఎన్నికలలో మోదీ ప్రభుత్వం భారీ మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది.


శ్రామికులకు ఏ హక్కులూ లేకుండా చేసి, కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చడమే నయా ఉదారవాద ఆర్థిక విధానాల సారం. దానికనుగుణంగానే లేబర్ కోడ్‌లు, గ్రామీణ ఉపాధి హామీ రద్దు వంటివి. ఈ విధానాలు దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి పరిష్కారంగా సమాన భూ పంపిణీ, పంటలకు మద్దతు ధర హామీ, నీటిపారుదల విస్తరణ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, సహకార వ్యవస్థ బలోపేతం, విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం, ఉపాధి గ్యారంటీ వంటి చర్యల ద్వారా మాత్రమే నవ భారత్ నిర్మాణం సాధ్యం.

- ఎ. అజశర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - Feb 27 , 2026 | 01:23 AM