ప్రధానమంత్రివి ప్రజాకర్షక ప్రశ్నలే!
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:28 AM
రాయితీలన్నీ ధారపోసి ఈ రాగం ఎందుకు? (నవంబరు 24) అన్న వ్యాసంలో పి. వెంకటరామయ్య, కార్మికవర్గపు సమస్యల గురించి ఎంతో శ్రద్ధతో చర్చించారు. ‘పన్నులు తగ్గించాం, రాయితీలు ఇచ్చాం. మరి ఉద్యోగాలేవి?
‘రాయితీలన్నీ ధారపోసి ఈ రాగం ఎందుకు?’ (నవంబరు 24) అన్న వ్యాసంలో పి. వెంకటరామయ్య, కార్మికవర్గపు సమస్యల గురించి ఎంతో శ్రద్ధతో చర్చించారు. ‘పన్నులు తగ్గించాం, రాయితీలు ఇచ్చాం. మరి ఉద్యోగాలేవి? జీతాల పెంపు ఏది?’ అని పెట్టుబడిదారుల్ని మోదీ ప్రశ్నించడానికి బదులుగా, ‘విధాన రూపకర్తగా ప్రభుత్వం తనను తానే విమర్శించుకోవాలి’ అని సూచించారు వ్యాసకర్త.
ఆయన తన వ్యాసంలో ‘ఆర్థిక శాస్త్రం’, ‘శ్రమపై పెట్టుబడి ఆధిపత్యం’, ‘శ్రమ లేకుండా సంపద లేదు’, ‘సంపద సృష్టించే కార్మికులు’– వంటి కీలకమైన మాటలు వాడారు. కానీ, ఆ విషయాలను ఆయన సరిగా అర్థం చేసుకోలేకపోయారనిపించింది. అందువల్లనే, నిరుద్యోగం గురించీ, జీతాల గురించీ, కొన్ని పరస్పర విరుద్ధమైన, పొరపాటు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటిలో కొన్నిటిని చర్చించాలని నా ప్రయత్నం.
1) ‘బడా కార్పొరేట్ సంస్థల లక్ష్యం లాభాలే తప్ప, ఉద్యోగ కల్పన కాదనేది జగమెరిగిన సత్యం’ అని ఒక పేరాలో అంటూనే, దానికి విరుద్ధంగా, ‘లాభాలు వస్తున్న కంపెనీలైనా కొత్త ఉద్యోగాలను ఎందుకు సృష్టించడం లేదు, జీతాలు ఎందుకు పెంచటం లేదు?’ అని ఇంకోచోట అన్నారు.
2) ‘కొత్త కంపెనీల పెట్టుబడుల వల్లా, కొత్త ఫ్యాక్టరీల వల్లా, ఉద్యోగాలు పెరుగుతాయి’ అన్నారు. కొత్త పెట్టుబడుల వల్ల కొత్త ఉద్యోగాలు వచ్చేమాట నిజమే గానీ, అవి ఆ పెట్టుబడుల సైజుకి తగ్గట్టు రావు. అంటే– ఉద్యోగాలు పెరగవు. ఎలా అంటే, ఉత్పత్తి సాధనాల మీద పెట్టే పెట్టుబడులు 80గా ఉంటే, ఆ సాధనాలతో పనిచేసే కార్మికుల జీతాల మీద పెట్టే పెట్టుబడులు 20గా మాత్రమే ఉంటాయి. పెట్టుబడిదారీ విధానంలో, ఉత్పత్తి సాధనాల మీద పెట్టే పెట్టుబడి సైజు పెరిగే కొద్దీ ఉద్యోగావకాశాలు ఆ నిష్పత్తిలో తగ్గిపోతాయి. దానివల్ల, ఉద్యోగాల కోసం కార్మికుల మధ్య పోటీ పెరిగి, వ్యాసకర్త ప్రస్తావించిన ‘గ్యారంటీలేని ఉద్యోగాలలో గిగ్ వర్కర్లు’ పెరుగుతారు. మళ్లీ వాళ్ల మధ్య కూడా పోటీ పెరిగి పరిస్థితి దుర్భరమవుతుంది. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, గత పదేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 3,65,318 మంది, రోజువారీ జీతాల మీద పనిచేసే కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు (ది టైమ్స్ ఆఫ్ ఇండియా, మే 11, 2026).
3) ‘పరిశ్రమల పని విధానాన్ని నిర్ణయించేది ప్రభుత్వ విధానాలే’ అని ఒక పక్క చెపుతూ, దానికి విరుద్ధంగా ఇంకోపక్క, ‘ప్రభుత్వ విధానాల రూపకల్పనలో’ కార్పొరేట్ల ‘గొంతు’ వినిపిస్తున్నదని చెప్పారు.
4) ‘ఉద్యోగాలు పెరగటం లేదని కార్పొరేట్లను నిందించే బదులు, ప్రభుత్వమే తనేం చేస్తున్నదో సమీక్షించుకోవాలి’ అని ఒక పక్కన చెపుతూ, దానికి విరుద్ధంగా ఇంకో పక్కన, ‘ఇది కార్పొరేట్ సంస్థలూ, ప్రభుత్వమూ కలిసి ఆడుతున్న లాలూచీ కుస్తీ’ అని చెప్పారు.
5) కార్మికుల గొంతును చిత్తశుద్ధితో వినిపించడానికి ప్రయత్నించిన వ్యాసకర్త, ప్రభుత్వ వర్గ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. అందుకే ఆయన, ‘ప్రశ్నించాల్సింది కార్పొరేట్లను మాత్రమే కాదు, విధాన రూపకర్తగా ప్రభుత్వం తనను తానే విమర్శించుకోవాలి’ అని అన్నారు. కానీ, వాస్తవం ఏమిటంటే, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ వర్ణించినట్టు, ‘ఆధునిక రాజ్యంలో, ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్) అనేది మొత్తం పెట్టుబడిదారీ వర్గపు ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే ఒక కమిటీ మాత్రమే.’ ఈ వాస్తవాన్ని స్పష్టంగా గ్రహించి, కార్మిక జనాలు కూడా గ్రహించేలా చేసినప్పుడే, ప్రభుత్వానికీ, కార్పొరేట్లకీ మధ్య జరుగుతున్నది ‘లాలూచీ కుస్తీ’ అనీ; ప్రధానివి నాటకీయమైన ప్రజాకర్షక ప్రశ్నలనీ అర్థమవుతుంది.
చివరిగా: చరిత్రను గమనిస్తే, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటి ప్రజాకర్షక విమర్శలు కొత్తేమీ కాదు. ‘చార్లెస్–లూయీ నెపోలియన్ బోనపార్టే’ 1848లో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నించీ 1851 వరకూ అన్ని వర్గాలకూ తానే పెద్దదిక్కు అన్నట్టు వ్యవహరించాడు. (‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అన్నట్టా?) సంపన్నులూ, వ్యాపారులూ కేవలం తమ స్వార్థ ప్రయోజనాలే చూసుకుంటున్నారనీ, పేదరికాన్ని తగ్గించి సామాన్య ప్రజలకూ, రైతులకూ ఉపాధి కల్పించాలన్నట్లుగా ప్రజాకర్షక ప్రకటనలూ, ఆర్భాటపు వాగ్దానాలూ చేసేవాడు. కానీ ఆచరణలో మాత్రం కార్మిక సంఘాలను అణచివేస్తూ, పారిశ్రామికవేత్తల, బ్యాంకర్ల లాభాలకు రక్షణ కవచంగా నిలిచాడు. ఈ ద్వంద్వ వైఖరినే మార్క్స్ ఇలా విమర్శించాడు: ‘‘బోనపార్టే అన్ని వర్గాలకూ ఒక పెద్దదిక్కులా (పితృస్వామ్య దాతలా) కనిపించాలని కోరుకుంటాడు. కానీ ఒక వర్గం నుంచి లాక్కోకుండా, మరో వర్గానికి అతను ఏమీ ఇవ్వలేడు’’ అని.
- బి.ఆర్. బాపూజీ