‘మహిళా సాధికారత’ పేరిట మరో రాజకీయం!
ABN , Publish Date - Apr 16 , 2026 | 01:11 AM
రాబోయే సార్వత్రక ఎన్నికల నాటికి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ (మహిళా రిజర్వేషన్ చట్టం) అమలును వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే లక్ష్యంతో నేటి నుంచి మూడు రోజుల పాటు...
మహిళా రిజర్వేషన్లను ముందుకు తీసుకువెళ్లే ముఖ్యమైన బిల్లుపై చర్చించి ఆమోదించేందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ డీలిమిటేషన్ ప్రక్రియను ముందస్తుగా అమలుపరచడమే ప్రభుత్వ లక్ష్యం. అసోం, కశ్మీర్ రాష్ట్రాల్లో ఇటీవల నియోజకవర్గాల పునర్విభజన అనుభవాల ఆధారంగా చూస్తే.. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దుల మార్పు 2029 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేలా జరుగుతుందనడంలో సందేహం లేదు.
రాబోయే సార్వత్రక ఎన్నికల నాటికి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ (మహిళా రిజర్వేషన్ చట్టం) అమలును వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే లక్ష్యంతో నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను మోదీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక సమావేశాల సమయ సందర్భాలను గమనిస్తే.. ఎక్కువ మంది ఓటర్లను సంపాదించుకోవడానికి మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక ఎత్తుగడగా వాటిని భావించక తప్పదు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను 2029 సార్వత్రక ఎన్నికలలోగానే పూర్తి చేసేందుకే చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యాన్ని ముందస్తు పెంపుదలకు మోదీ ప్రభుత్వం పూనుకున్నది. ఎందుకీ వేగిరపాటు? ఎన్నికలలో విజయావకాశాలను పెంపొందించుకుని, అధికారాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకోవడానికే కాదూ? ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రక్రియలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాలకపక్షం చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ఈ ప్రత్యేక సమావేశాలు. భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యం లేదని, అది లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవడం కష్టమని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవలసిన అవసరమున్నది.
అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. 2011 జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ అమలును ఈ మహిళా రిజర్వేషన్‌తో ముడిపెట్టారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 816కు పెంచడం ద్వారా ప్రస్తుతం పురుషులు కలిగివున్న మొత్తం సీట్ల సంఖ్యను తగ్గించకుండానే 33 శాతం, అంటే ఇంచుమించు 273 సీట్లను మహిళలకు రిజర్వ్ చేసేందుకు నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి.
‘మహిళా రిజర్వేషన్లను ముందుకు తీసుకువెళ్లే ముఖ్యమైన బిల్లుపై చర్చించేందుకు, ఆమోదించేందుకు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవనున్నది. దీనిని ఓ శాసన సంబంధమైన కార్యక్రమంగా భావిస్తే ఈ బిల్లు ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే! కోట్లాది భారతీయ మహిళల ఆకాంక్షలకు ఆ బిల్లు ఒక ప్రతిబింబం. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందనే మన చిరకాల నాగరికతా స్ఫూర్తికి ఇది నిదర్శనం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే కోట్లాది మహిళల ఆకాంక్షలను వ్యక్తీకరించిన బిల్లును వారి పరిశీలనకు ఎందుకు నివేదించడం లేదో ఆయన చెప్పలేదు. ‘మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ సందర్భం మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనది. ఇది ఇంకెంత మాత్రం వాయిదా వేసేందుకు వీల్లేని విషయం’ అని ప్రధాని మోదీ అన్నారు. అయితే మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించడాన్ని 2024 సార్వత్రక ఎన్నికల్లో ఎందుకు అమలుపరచలేదో, 2029 లోక్‌సభ ఎన్నికల్లో విధిగా అమలుపరిచేందుకు ఎందుకు సంకల్పించుకున్నారో ఆయన చెప్పలేదు.
‘చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న అంశంలో మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఈ ఏకాభిప్రాయ స్ఫూర్తితోనే 2023 సెప్టెంబర్‌లో నారీ శక్తి వందన్ అధినియమ్‌ను పార్లమెంటు ఆమోదించింది’ అని కూడా మోదీ అన్నారు. మరి ఆ ఏకాభిప్రాయ స్ఫూర్తితోనే ప్రతిపాదిత కొత్త సవరణ బిల్లు విషయమై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్న విపక్షాల సూచనను ప్రధానమంత్రి ఎందుకు అంగీకరించలేదు? తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నది కూడా ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమ రాజకీయ లక్ష్యాలకు మహిళా రిజర్వేషన్ అంశాన్ని ఉపయోగించుకునేందుకే ఈ ప్రత్యేక సమావేశాలను తలపెట్టారనడం సత్యదూరమేమీ కాదు. ప్రతిపక్షాల అభ్యంతరాలను తిరస్కరించడం ద్వారా, అవి మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజలకు చెప్పడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని చెప్పవచ్చు. ఇంకా ఘోరమైన విషయమేమిటంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణ ద్వారా ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు లేకుండా చేయాలనే యోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎవరూ తనను ప్రశ్నించకూడదని, ప్రశ్నించినా సమాధానమివ్వాల్సిన అవసరం తమకు లేదనే దురహంకార వైఖరి ఒకటి ప్రభుత్వంలో బాగా ద్యోతకమవుతోంది.
మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వ్ చేయాలని నిర్దేశిస్తున్న నిబంధన ఒకటి ఇప్పటికే మన రాజ్యాంగంలో ఉన్నది. అయితే ఆ నిబంధనలో చాలా లొసుగులు ఉన్నాయి. ఈ రిజర్డ్వ్ సీట్లను రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఎలా ఉండాలో ఆ నిబంధన స్పష్టంగా పేర్కొనలేదు. నియోజకవర్గాల భౌగోళిక రిజర్వేషన్ గురించి మాత్రమే ఆ నిబంధన నొక్కి చెప్పింది. అయితే ఈ రిజర్వేషన్ విధానం చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు ఉత్తమ మార్గం కాదు. అది మహిళా రాజకీయ సాధికారతకు దోహదం చేయదు. 2024 లోక్‌సభ ఎన్నికలలోనే ఆ భౌగోళిక రిజర్వేషన్ విధానాన్ని అమలుపరిచి ఉండవల్సింది. ప్రతిపక్ష నాయకులు అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు కూడా. అయితే ప్రభుత్వం ఒక వింతైన, అనవసరమైన నిబంధననొకదాన్ని 2023 నాటి సవరణ చట్టంలో చేర్చింది. మహిళా రిజర్వేషన్లు తదుపరి జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పిమ్మట అమల్లోకి రావాలని ఆ నిబంధన పేర్కొంది. 2026 అనంతరం జరిగే జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ అమలవుతుందని మరొక రాజ్యాంగ సవరణ స్పష్టం చేసింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే తొలుత కొత్త జనాభా గణన జరగాలి, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. 2023లో ఈ నిర్ణయం జరిగినప్పుడు 2026 అనంతర జనాభా గణన అంటే అది 2031లో జరిగేదయి ఉంటుందనేది అందరి భావన. నియోజకవర్గాల పునర్విభజనకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పట్టవచ్చు. ఈ దృష్ట్యా మహిళా రిజర్వేషన్ అమలు అనేది 2039 సంవత్సరానికి ముందు జరిగే అవకాశం లేదని విదితమయింది. 2023 నాటి రాజ్యాంగ సవరణ ద్వారా అంతిమంగా ‘చట్ట సభలలో మూడింట ఒక వంతు సీట్లు మీకు రిజర్వ్ అవుతా’యని మహిళలకు, ‘మీ రాజకీయ జీవితకాలంలో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావు’ అనే హామీని పురుష రాజకీయవేత్తలకు మోదీ ప్రభుత్వం ఆ సవరణ ద్వారా ఏకకాలంలో హామీ ఇచ్చింది!
చట్టసభలలో మహిళలకు న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు పూనుకోవడం హర్షణీయమే. ప్రభుత్వ సంకల్పంలో పరిపూర్ణ చిత్తశుద్ధి ఉన్నట్టయితే రాజ్యాంగానికి ఒక సాధారణ సవరణతో ఆ లక్ష్యం నెరవేరుతుంది. మహిళా రిజర్వేషన్‌ను జనాభా గణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టిన అధికరణ 334ఎ(1)ను రద్దు చేయడమే ఆ సవరణ. లాటరీ ద్వారా మహిళలకు సీట్ల రిజర్వేషన్‌ను నిర్ణయించడానికి వీలు కల్పించే ఒక నిబంధనను ఆ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలో చేర్చాలి. తద్వారా 2029 సార్వత్రక ఎన్నికలలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలుచేసే వెసులుబాటు లభిస్తుంది. ఈ రిజర్వేషన్ లబ్ధిని ఓబీసీ మహిళలకు సైతం సమకూర్చేందుకు పాలక, ప్రతిపక్షాలు నిబద్ధమైతే మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీలకు మూడింట ఒక వంతు సమాంతర రిజర్వేషన్ సదుపాయాన్ని ఓబీసీ మహిళలకూ విస్తరింపజేయాలి. బహుశా, మన రాజకీయపక్షాలు ఇందుకు సుముఖత చూపకపోవచ్చు. ప్రభుత్వ అసలు లక్ష్యం కొత్త డీలిమిటేషన్ ప్రణాళికకు అంగీకరించేలా ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకురావడమే అన్నది మనం విస్మరించకూడదు. 2027 జనాభా గణన వివరాలు అధికారికంగా లభ్యమయ్యేంతవరకు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలన్న రాజ్యాంగ నిబంధనను పక్కన పెట్టి ప్రభుత్వం కొత్త డీలిమిటేషన్‌ను ప్రతిపాదించింది.
మరింత స్పష్టంగా చెప్పాలంటే మహిళా రిజర్వేషన్‌ను సత్వరమే అమలుపరిచేందుకే కాకుండా 2029 లోక్‌సభ ఏర్పాటు నాటికే నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకునేందుకు డీలిమిటేషన్ అత్యంతావశ్యకమని బీజేపీ గట్టిగా భావిస్తున్నది. వివిధ రాష్ట్రాల్లోని ప్రస్తుత సీట్లకు అదనంగా మరో యాభైశాతం పెంపుదలకు విస్తరింపజేయడం వల్ల హిందీ, హీందీయేతర రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్యా బలాల్లో తేడా మరింత పెరిగే అవకాశమున్నది. అసోం, కశ్మీర్ రాష్ట్రాల్లో ఇటీవల నియోజకవర్గాల పునర్విభజన అనుభవాల ఆధారంగా చూస్తే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దుల మార్పు వచ్చే లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేలా జరుగుతుందనడంలో సందేహం లేదు. అందుకే డీలిమిటేషన్‌ను సత్వరమే అమలుపరిచేందుకు మోదీ సర్కార్ ఆతురత చూపుతున్నదని చెప్పక తప్పదు. ప్రతిపాదిత కొత్త బిల్లును 2011 జనాభా గణన లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ను అమలుపరిచేందుకు ఉద్దేశించినట్టయితే అది, ఈ సువిశాల దేశాన్ని సమైక్యంగా ఉంచుతున్న అలిఖిత సమాఖ్య ఒప్పందాన్ని రద్దుచేయడమే అవుతుంది. ఇది మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు మేలు చేయదు. అధికారంలో ఉన్న రాజకీయ పక్షం తనకు శాశ్వత మెజారిటీని సమకూర్చుకునేందుకై ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలు, పద్ధతులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చేస్తోన్న ప్రయత్నాలలో భాగంగానే ఇదంతా జరుగుతోందని నిక్కచ్చిగా చెప్పక తప్పదు.
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)