యూత్ పెట్టే పరీక్షలో మోదీ పాసవుతారా?
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:19 AM
హార్దిక్ పటేల్ ఎవరికైనా గుర్తున్నాడా? ఒక దశాబ్దం క్రితం వార్తా పత్రికల ఫ్రంట్ పేజీలలోను, టెలివిజన్ ప్రైమ్–టైమ్ ప్రసారాలలోనూ అతడికి చాలా ప్రాధాన్యం లభించింది. 2015లో గుజరాత్లో పాటీదార్ సామాజికుల ఆందోళనకు..
హార్దిక్ పటేల్ ఎవరికైనా గుర్తున్నాడా? ఒక దశాబ్దం క్రితం వార్తా పత్రికల ఫ్రంట్ పేజీలలోను, టెలివిజన్ ప్రైమ్–టైమ్ ప్రసారాలలోనూ అతడికి చాలా ప్రాధాన్యం లభించింది. 2015లో గుజరాత్లో పాటీదార్ సామాజికుల ఆందోళనకు పటేల్ నాయకత్వం వహించినప్పుడు అతడి వయసు 22 సంవత్సరాలే. హార్దిక్ ర్యాలీలు ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కుదిపివేశాయి. దానికి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. అవి చివరకు 2016లో ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ నిష్క్రమణకు దారితీశాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీని సవాల్ చేసిన ఆ యువకుడు ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే! తిరుగుబాటు నుంచి పాలకపక్షం శ్రేణుల్లోకి హార్దిక్ ప్రస్థానం ‘గుజరాత్ మోడల్ ఆఫ్ మేనేజింగ్ డిసెంట్’ (భిన్నాభిప్రాయాలు, నిరసనలను అణచివేయడంలో గుజరాత్ విధానం)ను విశదం చేస్తుంది. ఒక ఉద్యమాన్ని రాజ్యాధికారంతో అణచివేసేందుకు మీరు ప్రయత్నించవచ్చు లేదా ఆ ఉద్యమ ప్రధాన నాయకులను అధికార రాజకీయ వ్యవస్థలో భాగస్వాములుగా చేసుకోవచ్చు. నిరసనకారుడు ఒక భాగస్వామిగా మారవచ్చు, ఆందోళనకారుడు అస్మదీయుడు కాగలడు. అయితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఇప్పుడు ఎదుర్కోవలసిన ప్రశ్న– బలవంతపెట్టడం లేదా కలుపుకుపోవడం, లేక ఆ రెండు పద్ధతుల కలగలుపుతో గుజరాత్‌ను పాలించిన రీతిలో విశాల భారత్‌ను పరిపాలించడం సాధ్యమేనా?
ఢిల్లీలో ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనకారులపై దమనకాండ ఆ సవాల్‌కు ఒక దృష్టాంతంగా నిలుస్తుంది. భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన నిరసనలను భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ముందస్తుగా సీజేపీ నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రజలు నిరసన ప్రదేశానికి చేరకుండా అవరోధాలు కల్పించారు. వందలాది యువజనులను అదుపులోకి తీసుకుని తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. ఈ పరిణామాలను కవర్ చేస్తున్న జర్నలిస్టులు కూడా పోలీసు ప్రతాపాలకు గురయ్యారు. సాధారణంగా ద్వైధీభావంతో వ్యవహరించే సుప్రీంకోర్టు సైతం నిరసన తెలిపే స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు అని మరోసారి నొక్కి చెప్పిందంటే పోలీసులు వ్యవహరించిన తీరు ఎంత అప్రజాస్వామికంగా ఉన్నదో అర్థమవుతుంది.
ప్రతిపక్షాల మరో అరాచక ఆందోళనను తాము ఎదుర్కొంటున్నట్టు మోదీ సర్కార్ విశ్వసించి ఉండవచ్చు. విపక్షాల నిరసనను పోలీసులతో అదుపుచేయవచ్చని, రాజకీయ దురుద్దేశాలతో ఆ నిరసనకు పూనుకున్నాయని కొట్టివేయవచ్చని కూడా పాలకులు భావించి ఉండవచ్చు. నిరసనల నిర్వాహకులను అరెస్ట్ చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నివారించవచ్చని వారు అనుకుని ఉండవచ్చు. అయితే ఆ అంచనా పూర్తిగా ప్రమాదకరమైన తప్పుడు ఆలోచనే. ఢిల్లీ పరిణామాలు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి.
ఇది సీఏఏ (పౌరసత్వ చట్ట సవరణ) వ్యతిరేక ఆందోళన కాదు. ఆ సందర్భంలో నిరసనకారులను జాతి వ్యతిరేకులు అని అధికార వర్గాలు నిత్యం నిందించాయి. వారిలో ఒకరైన ఉమర్ ఖలీద్ 2020 నుంచి జైలులో ఉన్నాడు. ఇది మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రజ్వరిల్లిన రైతుల ఉద్యమం కూడా కాదు. ఉద్యమించిన రైతులను ప్రభుత్వం తొలుత ప్రతిఘటించింది. వారిలో కొందరు ఖలిస్థానీలు అని కూడా ఆరోపించింది. అంతిమంగా నవంబర్ 2021లో ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకోవడం మోదీ సర్కార్‌కు అనివార్యమయింది. ఈ ఉదంతాలు అన్నీ ప్రజా ఉద్యమాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సంసిద్ధతను తెలియజేశాయి. ప్రస్తుత ఉద్యమం విసురుతున్న సవాల్ స్వభావాన్ని ప్రభుత్వం అర్థం చేసుకున్నదా లేదా అన్నది ఈ నాటి ఒక ముఖ్యమైన ప్రశ్న.
ఎందుకంటే ఇది కాంగ్రెస్, రాహుల్‌గాంధీ లేదా కొన్ని ప్రాంతీయ రాజకీయ పక్షాలతో వ్యవహరించడమంత తేలికైన విషయం కాదు, బీజేపీకి ఒక శక్తిమంతమైన ఎన్నికల యంత్రాంగం ఉన్నది. గత పదేళ్లుగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్నికలలో అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడు సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఉన్నా, లేకపోయినా తమ ప్రత్యర్థులతో సమర్థంగా పోటీ పడేందుకు అవసరమైన సమస్త వనరులు తమకు ఉన్నాయనే ధీమా బీజేపీ నాయకులకు ఉన్నది.
అయితే ప్రస్తుత సవాల్ ఒక సంప్రదాయ రాజకీయ పక్షం నుంచి వచ్చింది కాదు. రాజకీయ నాయకుల తీరుతెన్నుల పట్ల ఏ మాత్రం సహనం లేని యువ భారతీయులు విసిరిన సవాల్ అది. సంప్రదాయ రాజకీయ ప్రత్యామ్నాయాలను కూడా వారు విశ్వసించరు. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే పాలకులతో ఘర్షణపడినప్పుడు వారు కోల్పోయేది కూడా ఏమీ లేదు. మరి ఇటువంటి యువ భారతీయుల నుంచి సవాల్ ఎదురయినప్పుడు పాలకులు ఎలా ప్రతిస్పందించాలి? వారి ఆగ్రహం పాలకులకు పూర్తిగా ఒక భిన్నమైన రాజకీయ సవాల్‌ను విసిరింది, సందేహం లేదు. ప్రతిస్పందన కూడా భిన్నమైన రీతిలో ఉండితీరాలి. అయితే తాము ఎదుర్కొంటున్న శక్తిని మోదీ ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందని భావించేందుకు ఆస్కారమున్నది.
గత మేలో సీజేపీ తొలుత ప్రజాజీవితంలో ప్రత్యక్షమయినప్పుడు ప్రభుత్వమూ, దాని మద్దతుదారులు దానిని కొట్టివేశారు, తేలికగా తీసుకున్నారు. గౌరవప్రదంగా లేని పేరు, మీమ్స్ ఆధారిత రాజకీయాలు దానిని దూషణ భూషణలకు గురిచేశాయి. సీజేపీతో వచ్చే ముప్పు ఏమీ లేదని భావించినందునే జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు దానిని అనుమతించారు. అయితే నీట్ ప్రశ్నపత్రాల లీక్ విషయంలోను, తమ భవిష్యత్తు విషయంలోనూ యువ భారతీయుల వ్యాకులత, ఆగ్రహావేశాలు అంత తేలిగ్గా సమసిపోయేవి కావు. సీజేపీ ఉద్యమం విద్యార్థులు, యువజనులకే పరిమితం కాకుండా విశాల ప్రజాశ్రేణుల మద్దతును పొందింది. నీట్ ప్రశ్నపత్రాల వివాదంపై ప్రభుత్వ ప్రతిస్పందన రాజకీయ పర్యవసానాలకు దారితీసింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనివార్యమయింది.
ప్రస్తుత ఉద్యమం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతోంది. ప్రతిపక్షాలు ఉద్యమించీ ఉద్యమించీ అలసిపోయి మిన్నకుండి పోతాయని ప్రభుత్వం భావిస్తుందేమో. కానీ నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన దృశ్యాలు ప్రజల మనః ఫలకాల నుంచి అంత త్వరగా చెరిగిపోతాయా? యువ నిరసనకారులపై హిందూ రక్షాదళ్ అనే హిందుత్వ బృందం దాడుల విషయమేమిటి? అటువంటి సంఘటనలపై విచారణ తప్పనిసరి. వాటికి జవాబుదారీతనం లేకపోతే ఎలా? మౌనం వహించడం సరికాదు. యువజనులపై పోలీసుదాడుల దృశ్యాలు డిజిటల్ విశ్వంలో వెన్వెంటనే వ్యాపించాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే టీవీ చానెళ్లు సైతం ఆ ఉదంతాలకు సంబంధించిన వార్తల ప్రసారాన్ని ఉపేక్షించలేకపోయాయి.
ఇక్కడ తరాల అంతరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న మంత్రులు, రాజకీయవేత్తలు ఉన్న ప్రపంచం... రాజకీయ సమాచారాన్ని స్వతస్సిద్ధంగా సృష్టించి, పంచుకుంటూ, స్పందిస్తున్న యువజనులు ఉన్న ప్రపంచం ఒకటి కావు. అవి పూర్తిగా భిన్నమైనవి. ఒక మంత్రి పక్కా ప్రణాళికతో అత్యంత జాగ్రత్తగా రూపొందించిన సందేశం ప్రజలలోకి విస్తృతంగా వెళ్లవచ్చు. అయితే వారు దానికి ఎలా స్పందించాలో అది నిర్దేశించలేదు. డిజిటల్ ప్రజారంగం ఒక టెలివిజన్ స్టూడియోకు భిన్నమైనది. టీవీ స్టూడియోలో అయితే ఎవరు, ఎప్పుడు మాట్లాడాలో ప్రభుత్వం నిర్ణయించగలదు. డిజిటల్ విశ్వం విషయంలో అటువంటిది కుదరదు. ఈ కారణంగానే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవల్సిన అవసరమున్నది. ప్రజాస్వామిక జవాబుదారీతనం అనేది ఉద్యోగాలు, ధరల పెరుగుదల, పరీక్షల నిర్వహణ, తమ భావి అవకాశాలపై వ్యాకులతల నుంచి వేరుగా ఉండే అంశం కాదని యువ భారతీయులు భావిస్తున్నారు. ఈ దృష్ట్యా ప్రస్తుత ఆందోళనల పట్ల మోదీ ప్రభుత్వం భిన్న దృక్పథంతో వ్యవహరించవలసిన అవసరమున్నది. భారత్ అంటే కేవలం గుజరాత్ మాత్రమే కాదు కదా. గుజరాత్ నమూనా పూర్తిగా ఒక అత్యంత కేంద్రీకృత రాజకీయ నాయకత్వం ప్రాతిపదికన రూపొందింది. ప్రభావశీల నాయకుడు దానికి కీలకం. ఆయన నేతృత్వంలోని ప్రాబల్య పార్టీ రాజకీయ కథనాలను ప్రభావితం చేస్తోంది. అయితే భారతదేశ వైశాల్యమూ, వైవిధ్యమూ, ప్రజాస్వామిక సంస్థలు మరింత సర్దుబాటు దృక్పథంతో కూడిన నాయకత్వ శైలిని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వాస్తవాన్ని అంగీకరించాలి. అంగీకరించడమంటే ప్రతి నిరసన బృందమూ చేసే ప్రతి డిమాండ్‌ను విధిగా ఆమోదించాలని కాదు. శాంతి భద్రతలను కాపాడటమనేది ప్రభుత్వాల చట్టబద్ధ బాధ్యత. నిరసనకారులు హింసాకాండకు పాల్పడినట్టు గట్టి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అందుకు వారిపై చర్య తీసుకోవల్సిందే. అయితే చట్టాన్ని అమలుపరచడం, భిన్నాభిప్రాయాన్ని ముప్పుగా పరిగణించడం మధ్య మౌలిక తేడా ఉన్నది. ఆందోళనకారులతో చర్చించడం వారి షరతులకు లోబడడం ఎంత మాత్రం కాదు. విమర్శకుల వాదనలను వినేందుకు సుముఖత చూపడం వల్ల అధికారం తగ్గదు. అది అధికారాన్ని మరింత విశ్వసనీయం చేస్తుంది. మరి మేలుతర నిర్ణయాన్ని తీసుకోవడం ఎలా? ప్రతి నిరసన ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేసేందుకు అనుమతించాలా లేక ఇబ్బందులు కలిగించిన ప్రతి నిరసనను అణచివేయాలా అనే వాటి మధ్య ఒకదానిని ఎంచుకోవడం సరైన నిర్ణయం కాబోదు. భిన్నాభిప్రాయాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించే రాజకీయ నిర్వహణ నమూనా, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమనేది ప్రజా జీవితంలో ఒక అనివార్య భాగమని ఆమోదించే ప్రజాస్వామిక నమూనా మధ్య ఒక దానిని ఎంపిక చేసుకోవాలి. తదుపరి ఘర్షణ ప్రారంభమయ్యేలోగా నిరసనకారులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదా లేదా అనేది ఒక ప్రధాన ప్రశ్న. చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేనిపక్షంలో నిరసనలు, ప్రతి నిరసనలతో పరిస్థితులు అల్లకల్లోమయ్యే అవకాశమున్నది. 2027లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల క్రమం ప్రారంభమయ్యేదాకా అవి కొనసాగుతాయి. పరిస్థితులు అలా ఉండటం ఎంతమాత్రం శుభసూచకం కాదు.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)