Share News

‘ప్రభుత్వ వ్యతిరేకత’కు బీజేపీ అతీతమా?

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:07 AM

రాహుల్‌గాంధీ ఇటీవల ఒక ప్రశ్న అడిగారు. రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించిన ఆ ప్రశ్న సులభంగా ఉన్నట్టు కనిపిస్తున్నా నిజానికి సంక్లిష్టమైనది.

‘ప్రభుత్వ వ్యతిరేకత’కు బీజేపీ అతీతమా?

రాహుల్‌గాంధీ ఇటీవల ఒక ప్రశ్న అడిగారు. రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించిన ఆ ప్రశ్న సులభంగా ఉన్నట్టు కనిపిస్తున్నా నిజానికి సంక్లిష్టమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ ఒక దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావానికి ఎందుకు గురికావడం లేదు? 1977లో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న కారణంగా మా నానమ్మ ఇందిర సైతం ఓడిపోయారు అని ఆయన అన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో కొనసాగేలా ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు.

ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఎన్నికల్లో జయాపజయాల విషయమై రాహుల్‌ ఇటీవల చేసిన వివిధ వ్యాఖ్యలలో మాదిరిగానే తాజా ఆరోపణలో కూడా ఒక ఇబ్బందికరమైన సత్యం ఉంది. ఒక విషయంలో రాహుల్‌ సరిగానే మాట్లాడారు. ఎన్నికల సంఘం తీవ్ర విశ్వసనీయత లోటును ఎదుర్కొంటోంది. అవును, ఈ సత్యం ఇంకెంత మాత్రం ఒక చర్చనీయాంశంగా ప్రతిపక్షాలకే పరిమితమై లేదు. ఈసీఐపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారనడం సత్యదూరం కాదు. ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై వివాదం, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు నివేదించిన వివరాలలో ‘తార్కిక వ్యత్యాసం’కు సంబంధించిన సమస్యలు, లక్షలాది ఓటర్ల తొలగింపుపై రగడ, ఓటర్ల అప్పీళ్లపై విచారణలో జాప్యం మొదలైనవన్నీ ఎన్నికల సంఘం పారదర్శకతపై న్యాయబద్ధమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాజ్యాంగ సంస్థల మధ్య ‘విశ్వాస లోటు’ ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.


ఓటర్‌ జాబితాల ధర్మబద్ధత గురించి పట్టించుకునే ఎవరికైనా ఈ అంకెలు ఆందోళన కలిగిస్తాయి. బెంగాల్‌లో ఇంతవరకు 22 లక్షల మంది పౌరులు తమ ఓటు హక్కు తొలగింపుపై అప్పీల్‌ చేశారు. విచారణ పూర్తయిన అప్పీళ్లలో 93శాతం మంది చట్టబద్ధమైన ఓటర్లే అని నిర్ధారణ అయింది. ఎన్నికలు అంటే కేవలం పోలింగ్‌ రోజున జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. ఓటర్‌ జాబితాలలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంతోనే నిజానికి ఎన్నికలు ప్రారంభమవుతాయి. మరి తన పనితీరుపై ఆందోళనలను కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమేనని ఎన్నికల సంఘం ఎలా కొట్టివేయగలుగుతుంది? ఎన్నికల సంఘం తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించడం లేదనే ఆందోళనలు ఇటీవల వివిధ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిన తీరుతెన్నుల ఆధారంగానే వ్యక్తమవుతున్నాయన్నది నిరాకరించలేని వాస్తవం.

మన దేశంలో ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించే ఏజెన్సీలు కూడా రాజకీయ కుట్రల్లో భాగమా? 2014 నుంచి నరేంద్ర మోదీకి ప్రజాదరణ– ముఖ్యంగా హిందీ భాషా రాష్ట్రాలలోను, పశ్చిమ భారత రాష్ట్రాలలోనూ అంతకంతకూ పెరుగుతోందని అన్ని ఒపీనియన్ పోల్స్‌ ఫలితాలు నిర్ధారిస్తూనే ఉన్నాయి. ఆ పోల్స్‌ అన్నీ ప్రామాణిక పద్ధతులలో జరిగి ఉండకపోవచ్చు. అయినంతమాత్రాన వాటి ఫలితాలకు కారణమైన రాజకీయ పరిణామాన్ని కొట్టివేయడం సబబు కాదు. దానిని నిష్పాక్షికంగా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీకి అసాధ్యంగా ఉన్న మహా శక్తిమంతమైన రాజకీయ, సంస్థాగత యంత్రాంగాన్ని బీజేపీ అభివృద్ధిపరచుకున్నది. కార్యకర్తల బలాన్ని అపారంగా పెంచుకున్నది. పైగా ఆరెస్సెస్‌ నుంచి సంపూర్ణ మద్దతు బీజేపీకి లభిస్తోంది. ఆర్థిక వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. పార్టీ సందేశాలను ప్రభావదాయకంగా ప్రజలలోకి తీసుకువెళ్లే సామర్థ్యం తక్కువేమీ కాదు. కనుకనే జాతీయ ప్రాధాన్యమున్న అంశాలను ఎన్నికల ప్రచారానికి చాలా నేర్పుగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడంలో బీజేపీ సదా సఫలమవుతోంది.


ఎన్నికల వ్యయాలపై ఈసీఐకి నివేదించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మొత్తం రూ.529.38 కోట్లు ఖర్చు చేసింది. ఆ ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ చేసిన వ్యయం రూ. 248.55 కోట్లు. బీజేపీ ఒక్క బెంగాల్‌లోనే చేసిన వ్యయం, ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఖర్చు చేసిన మొత్తం కంటే ఎక్కువగా ఉన్నది. ఈసీఐ వెల్లడించిన లెక్కల ప్రకారం, బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల వ్యయం రూ.286.99 కోట్లుగా ఉన్నది. ఆయా పార్టీలు చేసిన వ్యయాలు ఇంకా అధికంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే అవేవీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని రుజువు చేయలేవు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కాలంలోనే తమకు అందిన విరాళాలు మొత్తం రూ.1,473 కోట్లు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. అదే కాలంలో కాంగ్రెస్‌కు విరాళాల రూపేణా కేవలం రూ.207 కోట్లు మాత్రమే సమకూరాయి. చెప్పవచ్చినదేమిటంటే ఒక శక్తిమంతమైన ఎన్నికల యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఎలాంటి కుట్ర సిద్ధాంతాలు అవసరం లేదు. గతంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీతో సమానంగా సమర్థ యంత్రాంగాన్ని ఎందుకు నిర్మించుకోలేకపోయింది? ఈ ప్రశ్నను రాహుల్‌గాంధీ ఎదుర్కోవాలి.


కాంగ్రెస్‌కు వాటిల్లిన సమస్యలన్నిటికీ ఈసీఐని తప్పుపట్టడం ఎంతమాత్రం వివేకం కాదు. నాయకత్వ తగాదాలు, సంస్థాగత క్షీణత, ముఠాల కుమ్ములాటలు, ఫిరాయింపులు, బలహీనపడిన పీసీసీలు మొదలైనవన్నీ కాంగ్రెస్‌ స్వయంకృతాలే కానీ ఈసీఐ ప్రమేయంతో జరిగినవి కావు కదా. ఇదిగో ఇక్కడే ప్రభుత్వ వ్యతిరేకత అనే వాదన మరింత ఆసక్తికరమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది. అదొక వాస్తవం. 2018లో మూడు హిందీ రాష్ట్రాలలో బీజేపీని కాంగ్రెస్‌ ఓడించింది. 2023లో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. 2024 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ కనీస మెజారిటీని కూడా సాధించుకోలేకపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాలపై ఆధారపడడం అనివార్యమయింది. భారతీయ ఓటర్లు అధికారంలో ఉన్నవారిని శిక్షిస్తారని, శిక్షించగలరని ఈ జయాపజయాలు స్పష్టం చేస్తున్నాయి. మోదీపై ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు పనిచేయడం లేదు? ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఒక సుస్థిర జాతీయ ప్రత్యామ్నాయంగా ఎందుకు మార్చలేకపోతున్నాయి? మొదటిదానికంటే రెండోదే మరింత ఆసక్తికరమైన ప్రశ్న. ఈ రెండు ప్రశ్నల మధ్య ఉన్న తేడా చాలా ముఖ్యమైనది.

బీజేపీని ఎన్నికల్లో ఓడించడం అసాధ్యం కావచ్చు కానీ ప్రతిపక్షాలు ఆ పార్టీని రాజకీయంగా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాయి, సులభంగా ఎందుకు ఓడిపోతున్నాయని కాంగ్రెస్‌ తప్పక ప్రశ్నించుకోవాలి. నైరాశ్యానికి లోనవుతూ దాన్ని అధిగమించడానికి ప్రయత్నించకపోతే ఎలా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పన్నెండేళ్లకు పైగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. రాజకీయ అలసట, అసంతృప్తి, బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఇదొక రాజకీయ అవకాశం. అయితే రాజకీయ అవకాశమే రాజకీయ విజయానికి రాచబాట వేయదు. ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఉన్నది. దానిని ఓట్లు, సీట్లుగా మార్చడానికి ఒక సువ్యవస్థిత రాజకీయ వేదిక అవసరం.


మళ్లీ రాహుల్‌గాంధీ వద్దకు వెళదాం. తన ప్రశ్నలకు ఈసీఐ సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేయడం సమంజసమే. ఎన్నికల సంఘానికి, ఆ మాటకు వస్తే ఏ రాజ్యాంగ సంస్థకు అయినా పారదర్శకత, జవాబుదారీతనం, సంస్థాగత విశ్వసనీయత ఉండడం అవసరం. ఓటర్ల జాబితాపై రగులుతున్న వివాదం స్పష్టం చేస్తున్నదేమిటి? ఈసీఐ తన విధులను మరింత పారదర్శకతతో నిర్వహించాలనే కాదూ? సర్‌ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సంపూర్ణంగా వెల్లడించాలి. దానిని స్వతంత్ర వ్యక్తులు, సంస్థలు పరిశీలించి నిగ్గు తేల్చాలి. ఇది తప్పనిసరి.

ఈసీఐ ప్రమేయం కీలకంగా లేని ప్రాంతాలలో కాంగ్రెస్‌ పరాజయం పాలయింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఘనమైన ఎన్నికల విజయాలు లభించాయి. ఎన్నికల మధ్యవర్తి– అంటే ఈసీఐ తన విధులు సక్రమంగా నిర్వర్తించనందునే బీజేపీ అసాధారణ విజయాలు మూటగట్టుకుందని విమర్శించడం సబబుకాదు. ఈసీఐ కంటే బాగా సహాయకారి అయిన రాజకీయ, సంస్థాగత, సైద్ధాంతిక, నాయకత్వ కారణాలు బీజేపీ విజయాల వెనుక ఉన్నాయి. ఈ వాస్తవాన్ని విపక్షాలు విస్మరించకూడదు.


కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంపై రాహుల్‌గాంధీ తన దృష్టిని కేంద్రీకరించాలి. అలా కాకుండా బాహ్య సమస్యలపై ఆయన ఎంత ఎక్కువగా దృష్టి పెడితే, తన అంతర్గత లోపాలను సరిదిద్దుకోవడంలో కాంగ్రెస్‌పై అంత తక్కువ ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల వాటిల్లే ప్రమాదాన్ని రాహుల్‌ గుర్తించాలి. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను రక్షించేందుకు కృషి చేస్తూనే తన సంస్థాగత లోపాలను సరిదిద్దుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించాలి. ఈ రెండిటినీ ఏకకాలంలో నిర్వర్తించడం నిజంగా ఒక పెద్ద సవాలు. రెండూ అవసరమే. ఏదో ఒకటి మాత్రమే సరిపోదు.

2009–24 సంవత్సరాల మధ్య బీజేపీకి లభించిన మొత్తం ఓట్ల సంఖ్య 7.84 కోట్ల నుంచి 23.59 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో కాంగ్రెస్‌కు లభించిన మొత్తం ఓట్ల సంఖ్య 11.9 కోట్ల నుంచి 13.67 కోట్లకు మాత్రమే పెరిగింది. ఈ గణాంకాలు సమస్త జయాపజయాలన్నిటికీ వివరణ ఇవ్వలేవు. భారతదేశ ఎన్నికల ముఖచిత్రం జాతీయ ఓట్ల లెక్కింపు కంటే చాలా క్లిష్టమైనది. అయితే ప్రధాన జాతీయ పక్షాలకు లభించిన మొత్తం ఓట్ల సంఖ్యలో తేడాలు దేశంలో సంభవించిన రాజకీయ మార్పు భారీ స్థాయిని సూచిస్తున్నాయి. ఈ భారీ మార్పును సుసాధ్యం చేసిందేమిటి? మోదీత్వ అనండి, మోదీ హవా అనండి, హిందుత్వ రాజకీయ విజయం అనండి, బీజేపీ సంస్థాగత ఆధిక్యత అనండి లేదా ఎన్నికలలో గెలవడంలో బీజేపీ చాకచక్యాలు అనండి... అయితే ఈసీఐ వల్లే దేశ రాజకీయాలలో ఈ పెనుమార్పు వచ్చిందని అనవద్దు. ఎన్నికల సంఘం తన విశ్వసనీయత లోటుకు సంజాయిషీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ తన సొంత లోపాలకు సమాధానమివ్వాలి. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపుష్టికి ఈ రెండూ అవసరం.

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Oct 03 , 2026 | 12:10 AM