Share News

పాత కథ మీద  కొత్త ప్రశ్నలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:11 AM

తెలుగు కథాసాహిత్యంలో కొన్ని రచనలు మొదట చదివినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అవి జీవన విధానాన్ని సహజంగా, అందంగా, ప్రశాంతంగా మన ముందు ఉంచుతాయి.

పాత కథ మీద  కొత్త ప్రశ్నలు

తెలుగు కథాసాహిత్యంలో కొన్ని రచనలు మొదట చదివినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అవి జీవన విధానాన్ని సహజంగా, అందంగా, ప్రశాంతంగా మన ముందు ఉంచుతాయి. కానీ కాలం మారిన కొద్దీ, అదే రచనలను కొత్త సామాజిక దృష్టితో తిరిగి చదివితే, ఒకప్పుడు ప్రశ్నాతీతంగా కనిపించిన విలువలు కొత్త ప్రశ్నలుగా మన ముందు నిలబడతాయి.

సత్యం శంకరమంచి రాసిన ‘అమరావతి కథలు’ పుస్తకంలోని ‘ఒక రోజెళ్లిపోయింది’ కథను ఈమధ్య మళ్లీ చదువుతుంటే నాకు ఒక ప్రశ్న తలెత్తింది: ‘ఒకప్పుడు ఆదర్శంగా కీర్తించబడిన ఈ కథలోని జీవన విధానం, మారిన సామాజిక విలువల వెలుగులో నేటికీ ఆదర్శంగా నిలబడుతుందా?’ అని.

ఈ మూడు పేజీల కథ అమరావతిలోని పూజారి పిచ్చయ్య గారి దైనందిన జీవితాన్ని చిత్రీకరిస్తుంది. ఆయన నిశ్శబ్ద స్వభావం, గుడికి వెళ్లి మంత్రం బయటకు వినిపించకుండా పూజ ముగించడం, గుడి ప్రాంగణంలోని చెట్లు, పువ్వులు, గాలిగోపురంపై వాలే పావురాలు — ఇవే ఆయన ప్రపంచం. ఇంట్లో భార్య సీతమ్మ గారి జీవితం ఆయన అవసరాల చుట్టూ తిరుగుతుంది. చివరికి ఆయన నిద్రలోనే కన్నుమూస్తారు. ఆ నిశ్శబ్ద జీవి పరమ నిశ్శబ్దంలో కలిసిపోవడాన్ని రచయిత ఉదాత్తంగా చిత్రీకరించారు. కథ ప్రారంభం నుంచి ముగింపు వరకు ‘నిశ్శబ్దం’ అనే భావాన్ని క్రమబద్ధంగా నిర్మించి కథనాన్ని నడిపించారు.


ఒక రచనను దాని కాలపు సామాజిక పరిస్థితులతో అర్థం చేసుకోవడం అవసరమే. అయితే, వర్తమాన విమర్శనాత్మక దృష్టితో తిరిగి పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. ఈ కథలో కనిపించే కుటుంబ నిర్మాణం, వంశపారంపర్య ఆధ్యాత్మిక అధికారం, గ్రామీణ సమాజంలో కొన్ని వర్గాలకు లభించిన జీవన స్థిరత్వం – ఇవన్నీ ఇరవయ్యవ శతాబ్దం మధ్యకాలపు తెలుగు సమాజ విలువలను ప్రతిబింబిస్తాయి.

పిచ్చయ్య గారి జీవితం వంశపారంపర్య వృత్తితో ముడిపడి ఉంది. ఇతర అర్చకులు జీవన సమస్యలు, ధరల గురించి మాట్లాడుతుంటే, ఆయన పావురాలను లెక్కపెడుతూ కూర్చోవడం కేవలం వైరాగ్యం మాత్రమే కాదు; లౌకిక ఒత్తిడుల నుంచి దూరంగా ఉండగలిగే స్థితి కూడా. ఆయన జీవన నిర్మాణం ఆయనకు ఒక రకమైన అనుకూలతను కల్పించి ఉండవచ్చు. కానీ కథ ఆయన జీవితాన్ని స్తుతిస్తూ మహిమ పరచడం ద్వారా చుట్టూ ఉన్న స్థితిగతులను కావాలనే విస్మరిస్తుంది.

ఒక్క కథ మొత్తం సమాజానికి ప్రాతినిధ్యం వహించకపోయినా, చుట్టూ ఏ అంశాలను ఆ కథ విస్మరించిందో చర్చకు తీసుకురాబోవటం అప్రస్తుతం కాదు. ఈ కథలోని ప్రశాంత జీవితం శతాబ్దాలుగా సాగిన కుల ఆధారిత శ్రమ విభజన కొన్ని వర్గాలకు కల్పించిన ప్రత్యేక సామాజిక హక్కుల ఫలితంగా చూడవచ్చు. భారతీయ సామాజిక నిర్మాణంలో కొన్ని వర్గాలు ఆధ్యాత్మిక అధికారంతో స్థిరమైన స్థానం పొందగా, మరికొన్ని వర్గాలు దేహశ్రమతో అస్థిర జీవనంలో మిగిలిపోయాయి. మనుగడ సంక్షోభాలు తక్కువగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న అసమానతలను ప్రశ్నించాల్సిన అవసరం కూడా తక్కువవుతుంది.


ఈ కథలో చిత్రించిన ప్రశాంతత స్వయంసిద్ధంగా ఏర్పడలేదు. ఊళ్ళో దేవాలయం నడపడం, ఇంట్లో ఆహారం సిద్ధం చేయడం– ఇవన్నీ అనేక చేతుల శ్రమపై ఆధారపడి ఉన్న విషయాలు. కానీ ఈ కథలోని కథనం ఈ శ్రమలను అదృశ్యం చేస్తుంది. పాఠకుడికి కనిపించేది కేవలం ఒక వ్యక్తి ప్రశాంతత మాత్రమే.

కథలో పిచ్చయ్య గారు గుమ్మం నుంచి ‘‘పచ్చడేమిటి?’’ అని అడిగితే దొడ్లోంచి సమాధానం వస్తుంది. భోజనం తర్వాత నులక మంచంపై వాలితే భార్య సీతమ్మ కాళ్లకు ఆముదం రాస్తుంది. ఆ కాలంలో ఇది ఆమెకు ‘ధర్మం’. ఆమె శ్రమ కుటుంబ జీవనానికి పునాది అయినా, కథనం దాన్ని స్వయంప్రతిపత్తి కలిగిన కృషిగా చూడదు. భర్త మరణానంతరం సీతమ్మ బొట్టు చెరుపుకుని ‘‘ఆయన నాలోనే ఉన్నారు’’ అని సరిపెట్టుకోవడం స్త్రీ అస్తిత్వాన్ని పురుషుడి కోణం నుంచే చూడాల్సిన సామాజిక కట్టుబాటుకు పరాకాష్ఠ.

కథలో ఒకే రకమైన చర్యల పునరావృత్తి — భర్త పూజకు వెళ్లడం, భార్య ఇంటిపనుల్లో మునగడం — ఇవి సహజమైన, ప్రశ్నించరాని జీవన క్రమంగా చిత్రించబడుతుంది. దీర్ఘకాలం కొనసాగిన అలవాట్లను ఒక విలువగా, వాటి పునరావృత్తిని ధర్మంగా మార్చే సమాజ విధానం కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది. ఈ కథలో చిత్రించిన ఆధ్యాత్మికత వ్యక్తిని సామాజిక వాస్తవాల నుంచి దూరంగా ఉంచే అంతర్ముఖ జీవన రూపాన్ని ఆదర్శంగా ప్రతిపాదిస్తుంది. పిచ్చయ్య గారి జీవనశైలి సామాజిక వాస్తవాలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా, సొంత అంతర్ముఖ ప్రపంచానికి పరిమితమైనట్లు కనిపిస్తుంది.


గొప్ప రచన కాలం మారినా కొత్త ప్రశ్నల మధ్య విమర్శను ఆహ్వానిస్తూ తన ప్రాసంగికతను నిలబెట్టుకుంటుంది. యాభై ఏళ్ల క్రితం భర్త కాళ్లు నొక్కడం ‘ఆదర్శ గృహిణి’ లక్షణంగా కనిపించినా, నేడు అది స్త్రీ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేసిన విలువల భాగంగా అనిపిస్తుంది. కాలం మారినప్పుడు మన విలువల కొలమానాలు కూడా మారతాయి. ఈ కథలో దాదాపు ఎలాంటి సంఘర్షణ కనిపించదు. కుటుంబంలో విభేదాలు లేవు, సమాజంలో ఉద్రిక్తత లేదు, వ్యక్తిలో అంతర్గత కలత లేదు. జీవితం సహజ సమతుల్యతగా చిత్రితమవుతుంది. వాస్తవ జీవితం వైరుధ్యాలు, అసమానతలు, ఘర్షణలతో నిండి ఉంటుంది కాబట్టి, ఈ సంఘర్షణ లేమిని కేవలం కథన శైలిగా మాత్రమే కాక, ఒక నిర్దిష్ట జీవన క్రమాన్ని సహజంగా అంగీకరింపజేసే నిర్మాణంగానూ చూడవచ్చు.

‘ఒక రోజెళ్లిపోయింది’ కళాత్మకంగా అందమైన కథ. అయినా అది ఒక నిర్దిష్ట జీవన విధానాన్ని ఆదర్శంగా చూపిస్తుందా, లేక అప్పటి జీవన నిర్మాణాన్ని ప్రశ్నించరాని ఆదర్శంగా పునరుత్పత్తి చేస్తుందా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.

ఈ కథపై విమర్శ చేయడం అంటే పిచ్చయ్య వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడం కాదు. ఆయన వ్యక్తిగతంగా ప్రశాంతుడు, నిరాడంబరుడు, ఎవరినీ నొప్పించని మనిషి కావచ్చు. కానీ వ్యక్తి మంచితనాన్ని, అతడు భాగమైన సామాజిక వ్యవస్థ న్యాయబద్ధతను కలిపి చూడాలి. సాహిత్య విమర్శ లక్ష్యం వ్యక్తులను తీర్పు చేయడం కాదు; వారి జీవితం సహజంగా కనిపించేలా చేసిన విలువల వ్యవస్థను ప్రశ్నించడం.

సాహిత్యం గతాన్ని భద్రపరచడానికి మాత్రమే కాదు; వర్తమానాన్ని ప్రశ్నించి, భవిష్యత్తును మరింత మానవీయంగా నిర్మించడానికి ఉపయోగపడాలి. గొప్ప సాహిత్యం రెడీమేడ్‌ సమాధానాలు ఇవ్వదు. అది ప్రతి కొత్త చారిత్రక సందర్భంలో మనం సహజమని నమ్మిన విలువలను, నిర్మాణాలను తిరిగి పరిశీలించే విమర్శనాత్మక దృష్టిని పెంపొందిస్తుంది.

- బాలాజీ పోతుల

81792 83830

Updated Date - Jul 06 , 2026 | 12:11 AM