పగిలిన పల్లె పాదాలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 07:34 AM
ఓ చలికాలపు సాయంత్రమో వేసవికాలపు ఉదయమో ఊరిలో ఉప్పు బెడ్డంత మిగిలిన మడిసెక్కని ఎచ్చబెట్టి..
ఓ చలికాలపు సాయంత్రమో
వేసవికాలపు ఉదయమో
ఊరిలో ఉప్పు బెడ్డంత
మిగిలిన మడిసెక్కని ఎచ్చబెట్టి
నెత్తిన అప్పుల భారంతో
నగరంలోకి అడుగుపెట్టిన
పగుళ్ళిచ్చిన పాదాలు కొన్ని
పూట కూలికి కూటి కుండకి పొసగక
ఆవురావురమంటూ నడిచొచ్చిన
మట్టి పాదాలు మరికొన్ని
వృత్తిని కోల్పోయి
ఒట్టి చేతులను వేలాడేసుకొని
వలసొచ్చిన పాతకాలపు
పనిముట్ల లాంటి పాదాలు ఇంకొన్ని
నగరం ఓ మహాజనసాగరం
ఆకలి పాదాలన్నింటినీ ఆహ్వానిస్తుంది
భవన నిర్మాణానికి
ఇటుకులుగానో
హోటల్లో అన్నం ప్లేట్లుగానో
ఏ కర్మాగారానికో
చెమట చొక్కాగానో మార్చేస్తుంది
కుడిచేత్తో కాసులిచ్చి కాసేపటికే
ఎడమచేత్తో ఎగరేసుకుపోతుంది
నల్లని నింగిలో
చందమామను సైతం
మురికి కాలవలో మునిగిన
రూపాయి కాసులా మెరిపిస్తుంది
నడకే మరచి
నిత్యం పరుగులు పెడుతున్న నగరంలో
ఎండిన ఎండ్రపీత డిప్పల్లాంటి
పాదాలు కొన్ని...
చిక్కగా చీకటి కాలువలై పారుతుంటే
నగరపు నడిసంద్రంలో
ఈదుతున్న మరికొన్ని పాదాలు
చుక్కాని లాంటి చేతులతో కలిసి
తీరాన్ని చేరాలని చూస్తున్నాయి
మొయిద శ్రీనివాసరావు
99082 56267