డిజిటల్ వెలుగుల్లో తండాల తండ్లాట
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:30 AM
‘తెలంగాణలో 2025–26లో పనిదినాల తగ్గుదల వల్ల ఏర్పడిన మొత్తం వేతన ఆదాయ నష్టంలో ఎస్సీ, ఎస్టీ కార్మికుల వాటా ఇంచుమించు 38 శాతం’ – లిబ్‌టెక్ ఇండియా నివేదిక.
‘తెలంగాణలో 2025–26లో పనిదినాల తగ్గుదల వల్ల ఏర్పడిన మొత్తం వేతన ఆదాయ నష్టంలో ఎస్సీ, ఎస్టీ కార్మికుల వాటా ఇంచుమించు 38 శాతం’ – లిబ్‌టెక్ ఇండియా నివేదిక.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సతి తండాకు చెందిన అశ్విని గత రెండేళ్లలో ఉపాధి హామీ పథకం కింద సగటున 54 రోజులు పని చేసి, రూ.32,205 వేతనం పొందింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో 20 రోజుల పని కేటాయించినా వాడుకోలేకపోయింది. యాప్ హాజరు విధానం ఆమెకు అడ్డంకిగా మారింది. ఇదే తండాలో ఉండే మెగా రెండు వారాలు పనికి వెళ్లానంటోంది. కానీ కార్మిక పని నివేదికలో ఆమె పేరుపై ఒక్క పనిదినమూ నమోదు కాలేదు. ‘కళ్లు పడతలే’ అని కారోబార్ చెప్పినప్పటికీ మెగా పని ఆపలేదు. తన పేరుపై జీరో వర్క్ నమోదైందని తెలియక ‘కూలి పడతదా’ అని ఆశగా అడుగుతోంది.
ఏడాదిలో ఒక్క పనిదినం నమోదైన కార్డును కూడా యాక్టివ్‌గా చూపించిన నరేగా ఉద్యోగ రిజిస్టర్ ప్రకారం, గత మార్చి నాటికి ఇక్కడ 138 యాక్టివ్ కార్డులున్నాయి. మూడు నెలల తర్వాత, నరేగా శకం ముగిసేనాటికి అవి 122కు తగ్గాయి. 99 కుటుంబాలు 2026–27 తొలి త్రైమాసికంలో పనికోసం దరఖాస్తు చేశాయి. అందరికీ పనులు కేటాయించినా, 28 కార్డులపై ఒక్క పనిదినమూ నమోదు కాలేదు. మరో 47 కుటుంబాలు పది రోజులకు మించి పని చేయలేకపోయాయి.
‘తండాలో పని సరిగా లేదు. ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ అప్‌డేట్ వచ్చిన రోజుల్లో పని సరిగా జరగదు. హాజరు సమస్యతో ప్రతిరోజూ ఐదారుగురు వెనక్కి వెళ్లిపోతుంటారు’ అని కారోబార్ కొర్రా భరత్‌కుమార్ చెప్పారు. సర్వర్ డౌన్ అయినపుడు కొంతమంది తిరిగెళ్లిపోతారు. మొదటి ఫొటో అప్‌లోడ్ కాకపోయినా, కొందరు పనికోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి కారణాల వల్ల ‘పనిదినాలు తగ్గుతయి. కూలి తక్కువ పడతది. అకౌంట్లో ఎవరికి ఏమి పడతదో తెలియట్లేదు. యాప్ వచ్చినాక, పని మానేసిన వాళ్లున్నారు’ అని ఓ కార్మికుడు చెప్పాడు.
పై అనుభవాలు, ఎంఐఎస్ గణాంకాలు కలసి కార్మికులు పనిదినాలు కోల్పోవడానికి సాంకేతిక సమస్యలు ఒక ముఖ్య కారణమని చెబుతున్నాయి. అమలుచేసే యంత్రాంగ వైఫల్యం ఇందుకు మరో కారణమని మాజీ సర్పంచ్ కొర్రా పెంటయ్య అన్నారు. ‘డిమాండ్లు పెట్టినం. అనేకమార్లు మా పేరొచ్చిందా అని అడిగినం. రాలేదంటరు’ అని తన కుటుంబ అనుభవాన్ని వివరించారు. ఆయన కుటుంబ సభ్యులకు 23 పనిదినాలు కేటాయించగా, వారు తొమ్మిది రోజులు మాత్రమే పనిచేశారు.
2022–23తో పోలిస్తే, 2025–26లో (మార్చి 22నాటి డ్యాష్‌బోర్డు ప్రకారం) సతి తండాలో ఒక్కో కుటుంబానికి లభించిన సగటు ఉపాధి 70.64 రోజుల నుంచి 19.47 రోజులకు పడిపోయింది. 2026–27 తొలి త్రైమాసికంలోనూ ఈ క్షీణత కొనసాగింది. ఈ మూడు నెలల్లో కార్మికులు మొత్తం 705 పనిదినాలు వాడుకోగలిగారు. అంటే, డిమాండ్ పెట్టిన 99 కుటుంబాలకు సగటున 7.12 పనిదినాలే లభించాయి.
‘ఎండాకాలం పని లేదు. బయోమెట్రిక్ రావడం లేదని, లొకేషన్ రావడం లేదని అధికారులు చెబుతున్నారు’ అని సర్పంచ్ నెనావత్ తుకారం బాలు ఏప్రిల్ మూడో వారంలో చెప్పారు. ఆయన మాటలు డేటాతో సరిపోలాయి. ఏప్రిల్ తొలిపక్షంలో పనులు నామమాత్రంగానే జరిగాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత రెండేళ్లలో చేసిన ప్రకటనల ప్రకారం, నెట్‌వర్క్ సమస్యలున్నప్పుడు ఆఫ్‌లైన్ మోడ్‌లో హాజరు వేయొచ్చు. నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక అప్‌లోడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం లేదని, యాప్‌లో నమోదు తప్పనిసరి అని అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వీరాంజనేయులు తెలిపారు.
సతి తండా పక్కనే ఉన్న ఆంబోత్ తండా పరిస్థితి మరింత దిగదుడుపుగా ఉంది. ఎవరిని కదిలించినా ‘పని పెడతలేరు’ అనే మాటే వినవచ్చింది. ఆ గ్రామ డ్యాష్‌బోర్డు ప్రకారం, మార్చి నాటికి నమోదిత 311 జాబ్ కార్డుల్లో క్రియాశీలకమైనవి 141 మాత్రమే (వీబీ–జీ రామ్ జీ పోర్టల్ తాజా గణాంకాల ప్రకారం– యాక్టివ్ కార్డుల సంఖ్య 56కి, యాక్టివ్ కార్మికుల సంఖ్య 69కి తగ్గిపోయింది). ఇక్కడ తొలి త్రైమాసికంలో 13 కుటుంబాలకు కొద్ది పనిదినాలు దక్కాయి. గ్రామస్థులు గతంలో అక్కడ పని చేసిన ఆంబోత్ రాజును గుర్తు చేసుకున్నారు. ఆయన ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు పనులు మెరుగ్గా జరిగాయి. సతి తండాలో కూడా ఆయన విధులు నిర్వర్తించారు. పనుల క్షీణతకు ఫీల్డ్ అసిస్టెంటు లేకపోవడం ఒక కారణంగా కనిపించింది. వెనుకబడిన తమ తండాలపై ఈ ఖాళీ మరింత ప్రభావం చూపుతోందన్నారు బాలు. కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకానికి అనుమతి లేదని వీరాంజనేయులు తెలిపారు.
కార్డుల కొనసాగింపులోనూ కొందరు కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సతి తండాలో విజయ పేరు జాబ్ కార్డు నుంచి తొలగించారు. నెనావత్.. నైనావత్.. సత్తి.. సట్టి– ఇవన్నీ జాబ్ కార్డు, ఆధార్ తదితరాలపై నమోదైన ఆమె ఇంటిపేర్లు. జాబ్ కార్డులూ బ్యాంకు పాసు పుస్తకాలూ పరిశీలించిన తర్వాత ఇంటి పేరులో తేడా వల్ల డిజిటల్ ధ్రువీకరణ వ్యవస్థ ఆమె వివరాలను ఆమోదించలేదని అర్థమైంది. కొత్త కుటుంబానికి మారడం వల్ల విజయ పేరును, పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల బంగా అనే మరో కూలీ కార్డును 2025లో రద్దు చేసినట్టు నమోదు దరఖాస్తు రిజిస్టర్‌లో కనిపించింది. ఈ విషయం తెలియని బంగా ‘పని వస్తదా’ అని అడుగుతోంది.
ఆగస్టు 20 నాటికి వీబీ–జీ రామ్ జీ చట్టం అమల్లోకి వచ్చి 51 రోజులు. ఈ కాలంలో సతి తండాలో ఆరు కుటుంబాలకు చెందిన ఏడుగురికి సగటున 21 రోజుల పని లభించినట్టు డ్యాష్‌బోర్డు సమాచారం. ఆంబోత్ తండాలో పది కుటుంబాలకు చెందిన 12 మందికి సగటున 19.5 రోజుల పని లభించింది.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. రద్దు చేయనున్న జాబ్ కార్డుల వివరాలను బహిరంగపరచాలి. కార్డుదారులకు తమ అభ్యంతరాలు తెలియజేసే అవకాశం ఇవ్వాలి. అయితే, సతి తండాలో ఈ కుటుంబాలకు తమ కార్డులు ఎప్పుడు, ఏ కారణంతో తొలగించారో తెలియదు. రాజ్యసభకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2024 ఆగస్టు 2న అందించిన వివరాల ప్రకారం, 2019–20 నుంచి 2024–25 (2024 జూలై 30నాటికి) వరకు దేశంలో 4.43 కోట్ల జాబ్ కార్డులు తొలగించారు (తెలంగాణలో 6.76 లక్షలు).
నిరుపేదలకు న్యాయంగా దక్కాల్సిన ప్రయోజనాలు దక్కేలా చూడటమే డిజిటలీకరణ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. కానీ, దక్కిన పని చేసేందుకు సైతం డిజిటల్ ప్రక్రియలు అడ్డుపడుతున్నాయి. హాజరు నుంచి కూలి వరకు అనిశ్చితి వెన్నాడుతోంది. కూలి ఎంత పడతదో తెలియదు. పథకం తొలిరోజుల్లో ఇక్కడి కార్మికులు పే స్లిప్పులు రాకపోతే ప్రశ్నించారు. కూలి గురించిన సమాచారాన్ని గట్టిగా అడిగి తెలుసుకోగలిగారు. 20 ఏళ్ల తర్వాత, మిరుమిట్లు గొలిపే సాంకేతికత వెలుగుల్లో సమాచారం కోసం తడుముకుంటున్నారు. సతి తండాలో తనతో గడిపిన గంట వ్యవధిలో ‘కూలి ఎంత వస్తది’ అని పదే పదే అడిగింది విజయ అనే మరో కార్మిక మహిళ. డిజిటల్ ఇండియాలో ఇలాంటి వాళ్లకు చోటు లేదా?
- ఉదయలక్ష్మి వడ్లమూడి
ఇండిపెండెంట్ జర్నలిస్ట్