కొత్త సైనిక కూటమి
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:20 AM
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఒక కీలకమైన రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం, వీటిలో ఏ దేశంమీద శత్రువు దాడిచేసినా, తమపై జరిగిన ఉమ్మడి దాడిగానే ఈ దేశాలు పరిగణిస్తాయి.
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఒక కీలకమైన రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం, వీటిలో ఏ దేశంమీద శత్రువు దాడిచేసినా, తమపై జరిగిన ఉమ్మడి దాడిగానే ఈ దేశాలు పరిగణిస్తాయి. సౌదీ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్ పవిత్ర మక్కా నగరంలో ఈ ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ మీద సంతకాలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీచీఫ్ ఆసిం మునీర్ బృందం కూడా షరీఫ్‌కు తోడుగా అక్కడే ఉంది. తమపై జరిగే ఏ విదేశీ సైనిక దాడినైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని పాకిస్థాన్ ప్రకటించింది.
ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నట్టు భారత్ ఓ ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నకాలంలో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా ఆ మూడుదేశాల మధ్యా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాల ప్రత్యేక శిక్షణలు, రక్షణ సాంకేతికతల బదిలీ, మరీ ముఖ్యంగా నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటివి ఉంటాయి. టర్కీ, పాకిస్థాన్‌లకు యుద్ధంలో ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా, సౌదీ మట్టుకు ఇరాన్ దెబ్బలకు గాయపడుతోంది. ప్రధానంగా సౌదీలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంటే, సౌదీ మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాల మీద హౌతీ, హిజ్బుల్లా వంటి ఇరాన్ మిత్రశక్తులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ తన రక్షణ ఛత్రాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది.
చమురు ధనం ఘనంగా ఉన్న సౌదీ, అణుబలం ఉన్న పాకిస్థాన్, అతిపెద్ద ఆధునిక సైనికశక్తి టర్కీ చేతులు కలిపి ఇలా ఉమ్మడి రక్షణకు కట్టుబడ్డారు. గత ఏడాది సెప్టెంబరులో ఖతార్ రాజధాని దోహామీద ఇజ్రాయెల్ దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్–సౌదీ ఇదే తరహా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ‘నాటో’ టర్కీ చేరికతో ఇప్పుడు దీనిని ‘ఇస్లామిక్ నాటో’గా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఒకరిని కొడితే అందరినీ కొట్టినట్టేనంటూ ఆర్టికల్ 5లో నాటో రాసుకుంది. ప్రస్తుతానికి ఈ మక్కా ఒప్పందానికి నాటో లక్షణాలేమీ లేకపోయినా, రాబోయేకాలంలో ఈజిప్ట్, జోర్డాన్ ఇత్యాది గల్ఫ్‌దేశాలను కూడా చేర్చుకొని వ్యవస్థీకృత ఏర్పాట్లతో ఇది విస్తరిస్తుందన్న ఊహాగానాలు ఈ వ్యాఖ్యకు కారణం కావచ్చు. యుద్ధం నిరవధికంగా సాగుతున్న తరుణంలో, తన భద్రత విషయంలో పూర్తిగా అమెరికాను నమ్ముకొని ఊరుకోవడం సరిపోదని కూడా సౌదీ భావించినట్టుంది. షియా ఆధిపత్య ఇరాన్‌కు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సున్నీ భద్రతా కూటమి ఏర్పడుతోందని కూడా ఈ పరిణామంపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పాకిస్థాన్–సౌదీల మధ్య గత ఏడాది కుదిరిన ఒప్పందం అన్నిరకాల రక్షణలూ అంటూ పేర్కొనడం వల్ల అణ్వస్త్రాలు కూడా అందులో అంతర్లీనంగా ఉన్నాయన్న అనుమానం విస్తృతంగా ఉంది. ఇప్పటి త్రైపాక్షిక ఒప్పందం అటువంటి నర్మగర్భమైన ప్రస్తావనలేమీ చేయలేదు. ఒక సుదీర్ఘ ప్రకటన వినా, ఈ ఒప్పందం పూర్తి పాఠం బయటకు తెలియదు కనుక, ఈ భాగస్వామ్యం విస్తృతి ఎంత, ఈ పరస్పర సహకారం ఏయే పరిస్థితుల్లో వర్తిస్తుంది, దాని భౌగోళిక పరిమితులు ఏమిటి ఇత్యాది కీలక విషయాలపై పలు ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ప్రపంచంలో రక్షణమీద అత్యధికంగా ఖర్చుచేసే దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాకు ఈ కాగితపు ఒప్పందం వల్ల క్షేత్రస్థాయిలో ఎంత భద్రత సమకూరుతుందో తెలియదు కానీ, ఏటా డెబ్బై బిలియన్ డాలర్లకు పైగా రక్షణఖర్చు చేస్తున్న సౌదీని ఇలా ఆదుకొనే పేరిట మిగతా రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మరిన్ని అత్యాధునిక ఆయుధాలు అమ్ముకొనేందుకు టర్కీకీ, ఇప్పటికే సైనికసాయం చేస్తూ భారీగా రుణాలు పొందుతున్న పాకిస్థాన్‌కు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. ఇక, చైనా, టర్కీ, సౌదీలతో బలమైన రక్షణ ఒప్పందాలున్న పాకిస్థాన్‌తో భారతదేశానికి వచ్చిపడే సమస్యలు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. ఈ త్రైపాక్షిక ఒప్పందం తక్షణముప్పు కానప్పటికీ, రేపటి రోజుల్లో మరిన్ని చేరికలతో మరింత విస్తరించగల అవకాశాలున్నాయని అంటున్న ఆ కూటమిలో పాకిస్థాన్ చక్రం తిప్పడం నిశితంగా గమనించాల్సిన పరిణామమే.